logo

ఆ అడుగులు.. ఉత్తేజకరాలు

ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం మండువవారి పాలెంలో నిర్వహిస్తున్న తెదేపా మహానాడు మొదటి రోజైన శుక్రవారమే జన జాతరను తలపించింది. సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వీరిలో

Published : 28 May 2022 06:52 IST

చంద్రబాబుకు గజమాలతో స్వాగతం

ప్రకాశం జిల్లా ఒంగోలు మండలం మండువవారి పాలెంలో నిర్వహిస్తున్న తెదేపా మహానాడు మొదటి రోజైన శుక్రవారమే జన జాతరను తలపించింది. సభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వీరిలో కొందరు మండే ఎండల్లోనూ వైకల్యాన్నీ లెక్క చేయకుండా మూడు చక్రాల బళ్లపై చేరుకుంటే.. మరికొందరు పార్టీపై అభిమానంతో చిన్నారులతోనూ వచ్చారు. ఇంకొందరు శపథం చేసిన వారూ ఉండటం విశేషం. ఇలాంటి కొందరిని ‘న్యూస్‌టుడే’ బృందం పలుకరించింది. అడుగడుగునా ఉత్తేజకరంగా నిలుస్తున్న వారి విశేషాలు ఇవీ...- న్యూస్‌టుడే, టంగుటూరు, ఒంగోలు నగరం

వైకల్యాన్నీ లెక్క చేయకుండా...

ఇతను తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్‌ నియోజకవర్గానికి చెందిన దివ్యాంగుడు సోమనర్సయ్య. మండువవారిపాలెంలో నిర్వహించిన మహానాడు సభకు హాజరయ్యారు. 1982 సంవత్సరం నుంచి తెదేపాలో కొనసాగుతున్నానని.. ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లా తెదేపా పార్లమెంట్‌ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నట్టు చెప్పారు. మండే ఎండలను.. వైకల్యాన్నీ లెక్క చేయకుండా పార్టీ పండుగకు హాజరైనట్టు సోమనర్సయ్య వివరించారు.

గెలిచే వరకు మీసం ఉంచను...

నెల్లూరు జిల్లాకు చెందిన కప్పెర శ్రీనివాసులు తెదేపా నెల్లూరు పార్లమెంట్‌ బీసీ సెల్‌ అధ్యక్షుడు. శుక్రవారం నాటి మహానాడుకు నల్లని దుస్తులు ధరించి, గుండు కొట్టించుకొని, మీసం తీసేసి ఆయన హాజరయ్యారు. సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి, మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఎన్నికల్లో ఓడిపోయే వరకు.. తెదేపా గెలిచే వరకు తాను ఇదే విధంగా నిరసన చేస్తానని ఆయన శపథం చేశారు.

విశాఖ ఉక్కు..మా హక్కంటూ...

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ టీఎన్‌టీయూసీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ, స్టీల్‌ప్లాంట్ టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు ఉమ్మడి నరేంద్రకుమార్‌తో సహా విశాఖ ఉక్కు పరిశ్రమ సిబ్బంది మహానాడు కార్యక్రమానికి హాజరయ్యారు. సభా ప్రాంగణం వద్ద ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఇతర జిల్లాల నాయకుల నుంచీ మద్దతుగా సంతకాలు సేకరించారు.

కనులారా తిలకించాలని...

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గానికి చెందిన కేశవనాయుడు దివ్యాంగుడు. గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే ఇతనికి ఎన్టీఆర్‌ దైవసమానులు.. చంద్రబాబు అంటే ప్రాణం. చంద్రబాబును కనులారా తిలకించాలని అయిదోసారి మహానాడులో పాల్గొన్నట్టు తెలిపారు. తెదేపా కార్యకర్తను కావడంతో భూమి ఉందనే సాకుతో వికలాంగుల పింఛన్‌ను వైకాపా ప్రభుత్వం నిలిపి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహానాడుకు తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లను చూస్తుంటే రానున్న ఎన్నికల్లో చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చూస్తామని ఆత్మవిశ్వాసం రెట్టింపు అయిందన్నారు.

ఇంటిల్లిపాదీ తరలి వచ్చే...

విశాఖపట్నం సమీపంలోని గాజువాక నియోజకవర్గానికి చెందిన 300 మందికి పైగా తెదేపా నాయకులు, కార్యకర్తలు ప్రైవేట్‌ బస్సుల్లో మహానాడుకు తరలివచ్చారు. వీరిలో పలువురు మహిళలు, చిన్నారులుండటం విశేషం. ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, బాలకృష్ణ చిత్రపటాలతో మహానాడు ప్రాంగణంలో నినాదాలు చేస్తూ కొద్దిసేపు సందడి చేశారు.

16వ సారి.. ఆనవాయితీగా హాజరు...

తెలంగాణ రాష్ట్రం హుజూర్‌నగర్‌ నియోజకవర్గం గరిడిపల్లి మండలానికి చెందిన 20 మంది తెదేపా నాయకులు కూడా మహానాడుకు హాజరయ్యారు. వీరిలో మండవ వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఇప్పటి వరకు పదిహేను మహానాడులకు హాజరయ్యారు. మండువవారిపాలేనిది తనకు 16వ మహానాడు అని సంతోషం వ్యక్తం చేశారు.

భారీగా పోలీసు బందోబస్తు

ఒంగోలు నేర విభాగం, న్యూస్‌టుడే: మహానాడుకు 900 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఒంగోలు ట్రాఫిక్‌ డీఎస్పీ పి.మల్లికార్జునరావు ఆధ్వర్యంలో సీఐలు వి.సుధాకర్, ఎం.శ్రీనివాసరావు, ఎం.బీమ్లా నాయక్, బి.పాపారావు, ఎ.శివరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో 20 మంది ఎస్సైలు తమ సిబ్బందితో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించారు. పార్కింగ్‌ ప్రాంతాల్లో నలుగురు ఎస్సైలు, తమ సిబ్బందితో విధులు నిర్వర్తించారు. మహానాడు సభా వేదిక వద్ద దిశ డీఎస్పీ పల్లపురాజు ఆధ్వర్యంలో సీఐలు ఎం.డి.ఫిరోజ్, ఇ.మాలకొండయ్య, కె.శ్రీనివాసరావు, కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏడుగురు ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు. రద్దీ ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు పికెట్స్‌ ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని