logo

మహా జన జాతర

అధికార పార్టీ అడ్డంకులు.. అధికారుల సహాయ నిరాకరణలు ఏవీ మహా ప్రభంజనాన్ని ఆపలేకపోయాయి. తెలుగు దేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మహానాడు.. అవరోధాలను అధిగమించి తొలి రోజైన శుక్రవారం ఆద్యంతం జన జాతరను తలపించింది. ఎన్టీఆర్‌

Published : 28 May 2022 06:57 IST

తిరునాళ్లలా సభా ప్రాంగణం

అడ్డంకులను అధిగమించి వేడుక

మహానాడుకు పోటెత్తిన ప్రజానీకం

కార్యకర్తలు బహూకరించిన కొమ్ము తలపాగా ధరించి విజయ

సంకేతం చూపుతున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు

అధికార పార్టీ అడ్డంకులు.. అధికారుల సహాయ నిరాకరణలు ఏవీ మహా ప్రభంజనాన్ని ఆపలేకపోయాయి. తెలుగు దేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన మహానాడు.. అవరోధాలను అధిగమించి తొలి రోజైన శుక్రవారం ఆద్యంతం జన జాతరను తలపించింది. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఒంగోలు మండలం మండువవారిపాలెం సమీపంలోని సభా ప్రాంగణం మొదలు పరిసర ప్రాంతాలన్నీ నాయకులు, కార్యకర్తలు, సందర్శకులతో కిక్కిరిశాయి. చిన్నారులు మొదలు.. వృద్ధుల వరకూ మండే ఎండలనూ లెక్క చేయక తరలిరావడంతో సభా ప్రాంగణం, సమీప ప్రాంతాలు తిరునాళ్లను మరిపించాయి. అధినేత నారా చంద్రబాబు నాయుడుతో సహా నేతలు చేసిన ప్రసంగాలు శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపాయి. సీఎం జగన్‌ పాలనాతీరుపై, అధికార పార్టీ నాయకుల ఆగడాలపై విమర్శలు చేస్తున్న సమయంలో సభికులు పెద్దఎత్తున కరతాళ ధ్వనులు చేశారు.

తెలుగు తమ్ముళ్లలో జోష్‌... : రెండు రోజుల పాటు నిర్వహించనున్న తెదేపా మహానాడుకు తొలిరోజైన శుక్రవారమే శ్రేణులు భారీగా తరలివచ్చాయి. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా.. 8 గంటలకల్లా నాయకులు, కార్యకర్తలతో సభా ప్రాంగణం కిక్కిరిసింది. ప్రతినిధుల సభకు 12 వేల మందిని ఆహ్వానించారు. అంచనాలకు మించి తరలిరావడంతో తెలుగు తమ్ముళ్లలో జోష్‌ నెలకొంది. ఉదయం 10.30 గంటల సమయానికల్లా తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అప్పటికే ప్రతినిధుల సభ వెలుపల ఉన్న ఖాళీ స్థలంలో కూడా పార్టీ శ్రేణులతో నిండిపోయింది. రక్తదాన శిబిరం ప్రారంభం అనంతరం చంద్రబాబు వేదిక మీద ఆసీనులయ్యారు. ఎటు చూసినా జనం కనిపించడంతో ఆయన ముఖంలోనూ ఉత్సాహం తొణికిసలాడింది. ఎండ తీవ్రతను కూడా లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, యువకులు, చిన్నపిల్లలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శిబిరాలు, గ్యాలరీలలో వీక్షించారు.

ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న చంద్రబాబు..

చిత్రంలో అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్, బచ్చుల అర్జునుడు,

బీద రవీంద్ర, ఏలూరి సాంబశివరావు, దామచర్ల జనార్దన్‌ తదితరులు

ఉమ్మడి జల్లా నేతలకు కితాబు...: వివిధ ప్రాంతాలనుంచి వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు తరలివచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి మహానాడుకు వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధినాయకుడిని దగ్గరి నుంచి చూసేందుకు ఎగబడ్డారు. అద్దంకి నియోజకవర్గంలోని అలవలపాడు నుంచి పలువురు మహిళలు స్వచ్ఛందంగా మహానాడుకు వచ్చారు. వాలంటీర్లు నిలువరించే ప్రయత్నం చేయగా ఒక్కసారి చంద్రబాబును చూసి వెళ్తామని బతిమలాడుకున్నారు. మహానాడు ఏర్పాట్లు బాగున్నాయని అధినేత చంద్రబాబు జిల్లా నేతలకు కితాబిచ్చారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా నాయకులను అభినందించారు. తొలిరోజు సభ విజయవంతం అందరిలోనూ ఆనందం కనిపించింది. 

నేడు చంద్రబాబు పర్యటన ఇలా... 

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన రెండో రోజైన శనివారం ఇలా కొనసాగనుంది. 

ఉదమం 9 గంటలకు బస చేసిన ఎన్నెస్పీ అతిథి గృహం నుంచి బయలుదేరి సీవీఎన్‌ రీడింగ్‌ రూం, నగరపాలక సంస్థ కార్యాలయం, చర్చి సెంటర్, ట్రంకురోడ్డు మీదుగా అద్దంకి బస్టాండ్‌కు చేరుకుంటారు. ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారు. సుమారు 1,000 ద్విచక్ర వాహనాలతో భారీ ప్రదర్శన నిర్వహించేలా పార్టీ నాయకులు ప్రణాళిక చేశారు. 

11 గంటలకు అద్దంకి బస్టాండ్‌ నుంచి కర్నూలు రోడ్డు, ముంగమూరు రోడ్డు జంక్షన్, వీఐపీ రోడ్డు మీదుగా ఎన్నెస్పీ అతిథి గృహానికి చేరుకుంటారు. 

మధ్యాహ్నం 2 గంటలకు వీఐపీ రోడ్డు, మంగమూరు రోడ్డు మీదుగా మహానాడు ప్రాంగణానికి చేరుకుంటారు. సభ అనంతరం విజయవాడ బయలుదేరి వెళ్తారు.  

అదుపు కానంత అభిమానం...

మహానాడు తొలిరోజైన శుక్రవారం 12 వేల మంది క్రియాశీలక కార్యకర్తలతో ప్రతినిధుల సభ నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అంతకు రెండింతలు తరలి రావడంతో రద్దీ ఏర్పడింది. చంద్రబాబు, లోకేష్‌ ప్రాంగణానికి వచ్చే సమయానికి ఎక్కువ మంది వీఐపీ గ్యాలరీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో వారిని అడ్డుకునేందుకు వాలంటీర్లు చేసిన కృషి ఫలించలేదు. కొందరు కార్యకర్తలు బారికేడ్లను కూలదోసి లోపలికి ప్రవేశించారు. తెదేపా ప్రకాశం పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, మహిళా విభాగం నాయకురాలు గోసు దుర్గ తదితరులు కూడా తోపులాటలో చిక్కుకుపోయారు.

సభావేదిక ప్రారంభంలో సభ్యత్వ నమోదు కోసం పది కౌంటర్లు ఏర్పాటు చేశారు. అక్కడ కార్యకర్తలు ఒక్కసారిగా గుమిగూడటంతో తీవ్ర రద్దీ ఏర్పడింది.

చంద్రబాబు అధిరోహించిన వేదిక వద్దకు చేరుకునేందుకు కొందరు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఒకరినొకరు నెట్టుకున్నారు. కొద్దిసమయం వారిని అదుపు చేయడం కష్టమైంది. ఈ సమయంలో వేదిక చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లు పడిపోయాయి.

ఎన్టీఆర్‌ వేషధారణలో శంకర్‌రావు

పలకరింపులు.. సెల్ఫీల జోరు... 

మహానాడు ప్రాంగణంలో నాయకులతో సెల్ఫీలు దిగేందుకు కార్యకర్తలు ఉత్సాహం ప్రదర్శించారు. మూడేళ్ల తర్వాత కలుసుకున్నామని, ఒక సెల్ఫీ దిగుదాం అన్నా అంటూ ఒకరినొకరు పలకరించుకుంటూ ఫొటోలు దిగారు.

ఎన్టీఆర్‌ బొమ్మలు, బ్యాడ్జీలు, బనియన్లు, చొక్కాలు, టోపీలు ధరించిన కార్యకర్తలు సందడి చేశారు.

చక్రాలకు తప్పని చిక్కులు...

సభా ప్రాంగణం ఒంగోలు- విజయవాడ ప్రధాన రహదారి పక్కన కావడంతో ఆ ప్రాంతంలో ఉదయం నుంచే పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి. కొంత సమయంపాటు రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. 
సభా వేదిక ప్రాంగణంలోకి అనుమతించే నాయకుల జాబితాలను ముందుగానే సిద్ధం చేసి వారి నుంచి ఎంట్రీ ఫీజు వసూలు చేసి ఓ ఫైల్‌తో పాటు కండువా, తదితరాలను అందజేశారు.

చంద్రబాబుకు బొట్టు పెట్టి సభలోకి ఆహ్వానిస్తున్న మహిళలు

హోరెత్తిన హర్షధ్వానాలు...

తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సభా వేదిక మీదకు వస్తుండగా ఆయనతో సెల్ఫీలు దిగేందుకు కొందరు నాయకులు పోటీ పడ్డారు. వేదిక పైకి రాగానే నాయకులు, కార్యకర్తలు, ముఖ్యలు ఈలలు వేస్తూ హర్షధ్వానాలు చేశారు.

జీవన్‌రెడ్డి అనే దివ్యాంగుడు పార్టీకి రూ.రెండు వేల విరాళాన్ని అందజేసి ఔదార్యం చాటడంతో ప్రధాన నాయకులు సభాముఖంగా అభినందనలు తెలిపారు.

తొలిరోజు కార్యక్రమాలకు ప్రతినిధులు మాత్రమే సభకు రావాల్సి ఉంది. ప్రకాశం పొరుగు జిల్లాలైన పల్నాడు, గుంటూరు, నెల్లూరు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చారు. దీంతో అంచనాలకు మించి సభా ప్రాంగణం కిక్కిరిసింది. న్యూస్‌టుడే, తాళ్లూరు

వేదిక వద్ద హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న మండువవారిపాలెం వాసులు

మహానాడుకు హాజరైన పార్టీ ప్రతినిధులు, నాయకులతో కిక్కిరిసిన సభా ప్రాంగణం

మహానాడు ప్రాంగణంలో తెదేపా జెండాలతో కార్యకర్తల సందడి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని