logo

గజ్జలకొండ ..ఆవేదనే నిండా

పశ్చిమ ప్రకాశం మార్కాపురంలో రైతులకు ఏటా నష్టమే మిగులుతోంది.. పంట చేతికి వచ్చేసరికి ప్రకృతి వైపరీత్యాలు, కరవు, అధిక వర్షపాతం.. ఇలా ఏదో ఒక సమస్యతో ఇబ్బందులు చవిచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వ పరంగా రావాల్సిన బీమా పరిహారంలో కూడా మొండిచేయే ఎదురైంది. రైతులు అధికంగా సాగుచేసిన పంటలకు కాకుండా అసలు

Published : 25 Jun 2022 03:15 IST

834 మంది రైతుల్లో పరిహారం అయిదుగురికే

మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే


గ్రామంలో సాగులో ఉన్న కంది పంట

పశ్చిమ ప్రకాశం మార్కాపురంలో రైతులకు ఏటా నష్టమే మిగులుతోంది.. పంట చేతికి వచ్చేసరికి ప్రకృతి వైపరీత్యాలు, కరవు, అధిక వర్షపాతం.. ఇలా ఏదో ఒక సమస్యతో ఇబ్బందులు చవిచూస్తున్నారు. తాజాగా ప్రభుత్వ పరంగా రావాల్సిన బీమా పరిహారంలో కూడా మొండిచేయే ఎదురైంది. రైతులు అధికంగా సాగుచేసిన పంటలకు కాకుండా అసలు వేయనివాటికి వర్తింపచేస్తుండటంతో వారంతా ఈసురోమంటున్నారు. మార్కాపురం మండలంలోని గజ్జలకొండలో నెలకొన్న పరిస్థితి దీనికి ఉదాహరణ.

ఈ పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల్లో 834 మంది రైతులు కంది, మిరప, పత్తి, ఆముదాలు, మినప, బొప్పాయి, పొగాకు, బత్తాయి, పూల మొక్కలు సాగుచేశారు. కేవలం అయిదుగురికి మాత్రమే పరిహారం మంజూరైంది. అదీ బత్తాయి పంటకు రావడంతో నివ్వెరపోయారు. గురువారం జరిగిన మండల పరిషత్తు సమావేశంలోనూ ఇదే అంశం వాడివేడి చర్చకు దారితీసింది. గజ్జలకొండ పరిధిలో పడమటిపల్లె, నాగిరెడ్డిపల్లె, పిచ్చిగుంట్లపల్లె, గుండారపుపల్లె, తూర్పుపల్లె, మాలపాటిపల్లె, ఎస్సీపాలెం గ్రామాలున్నాయి. వర్షాధార పంటైన కందిని 1311 ఎకరాల్లో 642 మంది.. మిరపను 330 ఎకరాల్లో 120 మంది.. బొప్పాయి 70 ఎకరాల్లో 31 మంది వేశారు. వీటికి ప్రభుత్వం బీమా వర్తింపచేయలేదు. ఆముదం పంట నష్టపోయినందుకు ఒక రైతుకు రూ.2,783, బత్తాయి వేసిన నలుగురు రైతులకు రూ.1,34,424 మంజూరుచేశారు. మాలపాటిపల్లెకు చెందిన జి.కోటిరెడ్డి మాట్లాడుతూ ‘గత ఏడాది కంది, మిరప అయిదు ఎకరాల్లో సాగు చేశాను. పంట చేతికి అందే సరికి వానలు, తెగుళ్లతో దెబ్బతిన్నాయి. బీమాకు దరఖాస్తు చేసుకున్నా వర్తింపచేయలేదు. రూ.లక్ష వరకు నష్టపోయాను.’ అని వాపోయారు. తూర్పుపల్లె ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం, బీమా కంపెనీలు కలిసి రైతులు సాగు చేయని పంటలకు బీమాను వర్తింపచేశారన్నారు. ప్రతి రైతు ఎకరాకు సుమారు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు నష్టపోయారని.. రెండోవిడతలో అయినా బీమా ప్రకటించాలని కోరారు. మార్కాపురం వ్యవసాయాధికారి ఎన్‌.లక్ష్మీనారాయణ వద్ద ప్రస్తావించగా పంట కోత ప్రయోగాల్లో దిగుబడి అంచనాల ప్రకారం కంది, మిరప ఎంపిక కాలేదన్నారు. గ్రామ స్థాయి అధికారులు అన్ని పంటలకు ఈ-క్రాప్‌ చేశారన్నారు. అధికారుల తప్పిదం ఏమీలేదన్నారు.

రూ.60 వేలు నష్టపోయా...

గజ్జలకొండ పరిధిలో నీటి సమస్య ఉండటంతో ఎక్కువశాతం రైతులు కంది వేస్తారు. నేనూ మూడెకరాల్లో వేశా. రూ.60 వేల వరకు ఖర్చయింది. దిగుబడి ఒక్క బస్తా కూడా రాక నష్టపోయాను. బీమాను వర్తింప చేయకపోవడం మరింత నిరాశ కలిగించింది. - శెనిగె వెంకటేశ్వరరెడ్డి, రైతు, గజ్జలకొండ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని