logo

ఆ 7 మార్గాలకు మోక్షమెప్పుడో?

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఏడు మార్గాల్లో ఎన్‌డీబీ (న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ )నిధులతో రహదారులు నిర్మాణానికి 2020లో ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏడాదిన్నర క్రితమే టెండర్‌ ప్రక్రియ ముగిసింది. జేఎంసీ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.186 కోట్లకు టెండర్‌ దక్కించుకున్నప్పటికీ కేవలం ప్రాథమిక పనులను చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

Published : 25 Jun 2022 03:15 IST

 ఏడాదిన్నర క్రితమే టెండర్‌ పూర్తి

నత్తనడకన రోడ్ల నిర్మాణ పనులు

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు:

పొదిలి-టంగుటూరు రోడ్డు దుస్థితి ఇదీ.. మర్రిపూడి వద్ద ఇటీవల గుంతల్లో కంకర పోసిన దృశ్యం

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఏడు మార్గాల్లో ఎన్‌డీబీ (న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ )నిధులతో రహదారులు నిర్మాణానికి 2020లో ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏడాదిన్నర క్రితమే టెండర్‌ ప్రక్రియ ముగిసింది. జేఎంసీ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.186 కోట్లకు టెండర్‌ దక్కించుకున్నప్పటికీ కేవలం ప్రాథమిక పనులను చేపట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతవరకు ఒక్క రోడ్డు నిర్మాణం కూడా పూర్తికాలేదు. నిత్యం రాకపోకలు సాగే ఈ రోడ్లు అధ్వానంగా మారడంతో వీటిపై ప్రయాణం నరకంగా మారింది. కొత్త రహదారులు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు.

ఈ ఏడు రహదారుల్లో పొదిలితో ముడిపడినవే మూడు రోడ్లు ఉన్నాయి. పొదిలి-టంగుటూరు రహదారి 54 కిలోమీటర్లు ఉంది. ఈ మార్గంలో వ్యాపారం, ఇతర అవసరాల రీత్యా టంగుటూరు, శింగరాయకొండకు రాకపోకలు సాగిస్తుంటారు. నిత్యం 5 వేల వాహనాలు, పదివేల మంది ప్రజలు ప్రయాణం సాగిస్తుంటారు. రహదారి సింగిల్‌గా ఉండడం, పలుచోట్ల మరమ్మతులకు గురికావడంతో తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కొంత దూరం గుంతలకు ఆర్‌అండ్‌బీ అధికారులు కంకర రాళ్లు తెచ్చి పోశారు.

వినుకొండ-పొదిలి రహదారిలో కొనకనమిట్ల వద్ద రహదారి విస్తరణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దాదాపు పది కిలోమీటర్ల మేరకు కొత్త నిర్మాణం చేపట్టకపోవడంతో రాత్రివేళల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు తెలిపారు.

 కనిగిరి నియోజకవర్గంలోని వేములపాడు-ఊళ్లపాలెం రోడ్డు, 60 కిలోమీటర్లు ఉన్న పొదిలి-వినుకొండ మార్గంలో పనులు ఇటీవల ప్రారంభం అయ్యాయి.

పర్చూరు-పెదజాగర్లమూడి మధ్య దాదాపు 70 కిలోమీటర్లు దూరం ఉంది. ఈ మార్గాన్ని విస్తరిస్తే పర్చూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలు ఎన్‌హెచ్‌ 16లో కలుస్తుంది. ఈ మార్గంలో ఇంకా పనులు ప్రారంభం కాకపోగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలో కూడా తెలియని గందరగోళ పరిస్థితి ఉంది.

యర్రగొండపాలెం-త్రిపురాంతకం మార్గం 16.4 కిలోమీటర్లు ఉంది. సుమారు 2వేల వాహనాలు, 5వేల మంది ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఏడాది క్రితం రోడ్డు పరిశీలించినప్పటికీ ఇంకా పనులు మొదలు కాలేదు.

మార్కాపురం-దోర్నాల మొత్తం 27 కిలోమీటర్లు దూరం ఉండగా మధ్యలో దేవరాజుగట్టు నుంచి పెద్దారవీడు వరకు 5 కిలోమీటర్లు డబుల్‌ రోడ్డు వేయాల్సి ఉంది. ఈ దారిలో రోజుకు 2వేల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇటీవల పనులు ప్రారంభించగా మట్టితో రోడ్డు చదును చేసి, కల్వర్టులు ఏర్పాటు చేస్తున్నారు.

పనులు జరుగుతున్నాయి...

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తం ఏడు మార్గాల్లో పొదిలి-టంగుటూరు, పర్చూరు-పెదజాగర్లమూడి, త్రిపురాంతకం-యర్రగొండపాలెం రోడ్లు మినహా మిగిలిన మార్గాల్లో పనులు జరుగుతున్నట్లు ఆర్‌అండ్‌బీ అధికారులు పేర్కొనటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని