logo

వార్షిక ప్రణాళిక లక్ష్యం.. రూ.14,590.81 కోట్లు

జిల్లా పునర్విభజన అనంతరం ప్రస్తుత ప్రకాశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రుణాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకుగాను లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో వార్షిక ప్రణాళిక ప్రకటించారు. ఖరీఫ్‌లో

Updated : 27 Jun 2022 03:09 IST

అయినా సాగుకు బేషరతుగా అందని రుణం
కీలక రంగాలకు దక్కని పూర్తి స్థాయి భరోసా
ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే

జిల్లా పునర్విభజన అనంతరం ప్రస్తుత ప్రకాశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి రుణాలు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందుకుగాను లీడ్‌ బ్యాంక్‌ ఆధ్వర్యంలో వార్షిక ప్రణాళిక ప్రకటించారు. ఖరీఫ్‌లో రూ.3,350 కోట్లు; రబీ సీజన్‌లో రూ.2,470 కోట్ల మేర రుణం ఇవ్వాలని నిర్ణయించారు. వార్షిక రుణ ప్రణాళికలో ప్రాధాన్యతా రంగాలకు 75.29 శాతం రుణం కేటాయించారు. వ్యవసాయ రంగానికి సింహభాగం నిధులు కేటాయిస్తూ; చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకూ చేయూత అందించాలని నిర్ణయించారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. వ్యక్తిగత పూచీకత్తుతో చిరు వ్యాపారాలు, ఇతర ఉపాధి రుణాల మంజూరుకు బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. వ్యవసాయ రుణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చూపుతున్న అంకెలను బుక్‌ అడ్జస్ట్‌మెంట్లతో సరిపుచ్చుతున్నారు. పాత పద్దులను చూపడం మినహా కొత్తగా పంట రుణాలు ఇవ్వడం లేదనే విమర్శలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఇక కౌలు రైతుల సంగతి సరేసరి. బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినప్పటికీ కొర్రీలతో దాట వేస్తున్నారు.

ప్రాధాన్యమంటూనే మొండి వైఖరి...: రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ చేయూత పథకానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెంది, 45 నుంచి 60 సంవత్సరాల్లోపు మహిళలకు స్వయం ఉపాధి కల్పించేలా రుణం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసింది. అయినా తక్కువ మంది మహిళలకే రుణాలు ఇచ్చారు. ప్రాధాన్యతా రంగం పట్ల బ్యాంకర్ల వైఖరి ఎలా ఉందో ఇదోక ఉదాహరణ.

కౌలు కాడికి దక్కని రుణం...: జిల్లాకు చెందిన ఎక్కువ మంది రైతులు వృద్ధాప్యం లేదా వారి పిల్లలు ఇతర వృత్తుల్లో స్థిరపడటంతో స్థానికంగా ఉండే వ్యవసాయ భూమిని కౌలుకు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితిని చూస్తే జిల్లాలో లక్ష మందికి పైగానే కౌలు రైతులు పలు రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఏటా రెవెన్యూ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి, సీసీఆర్సీ కార్డులు జారీ చేస్తున్నారు. వీటి ఆధారంగా బ్యాంకు అధికారులు పంట రుణాలు జారీ చేయాలి. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల ఆదేశాల మేరకు కౌలు రైతులకు రుణం ఇవ్వాలని లక్ష్యం విధిస్తున్నా... పత్రాలు ఉన్న వారికి కూడా రుణాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది. కాగితాలపై ప్రకటనలు తప్ప వారికి రుణం అందడం లేదు. సాగు నిమిత్తం ఇంట్లో ఉన్న నగలు కుదవ పెట్టి రుణం తెచ్చుకోవడం లేదంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.


మహిళా సంఘాల వైపే మొగ్గు...
చిరు, వీధి వ్యాపారులను ఆదుకునేందుకు వడ్డీ లేని రుణం కింద రూ.10 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు జగనన్న తోడు పథకం అమలవుతోంది. డీఆర్డీఏ, మెప్మా ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చిరు, వీధి వ్యాపారులను గుర్తించి, వారితో బ్యాంకు రుణం నిమిత్తం దరఖాస్తు చేయించారు. అందులో తొలి ఏడాది తక్కువ మందికి మాత్రమే రుణం మంజూరు చేయడంతో; ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా స్త్రీనిధి కింద రూ.10 వేలు చొప్పున రుణాలు మంజూరు చేసింది. అన్ని విభాగాల కంటే స్వయం సహాయక సంఘాల మహిళలు తీసుకున్న బ్యాంకు రుణాల రికవరీ రేటు అత్యధికంగా ఉన్నందున వారికి మాత్రం రుణాలు విరివిగా ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకోసం బ్యాంకులు ప్రత్యేక పథకాలను అమల్లోకి తీసుకొచ్చాయి.


కౌలు రైతులకు రూ.50 కోట్ల రుణ లక్ష్యం...
అర్హులైన ప్రతి కౌలు రైతుకు పంట రుణం మంజూరు చేస్తాం. 2021-22 సంవత్సరానికి రూ.14 కోట్లు ఇచ్చాం, ఈ ఏడాది రూ.50 కోట్లు లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. పంట రుణాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నాం. గత ఏడాదితో పోలిస్తే స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ 10 శాతం పెరిగింది. దీని ఆధారంగా అదనంగా రుణాలు మంజూరు చేయనున్నాం. వంద శాతం మేర రుణ లక్ష్యాలను సాధిస్తాం.

- యుగంధర్‌రెడ్డి, ఎల్‌డీఎం


2022-23 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలు ఇలా...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని