logo

ప్రాణాలు తీసిన యమపాశాలు

ఇంటి మేడ పైకి ఎక్కి విద్యార్థులంతా సరదాగా ఆటలాడుకుంటున్నారు. ఉరుకులు పరుగులు పెడుతున్న ఆ చిన్నారులను చూసి విధికి కన్ను కుట్టినట్లైంది. విద్యుత్తు ప్రమాదం రూపంలో

Updated : 27 Jun 2022 02:20 IST

ఆటలాడుతుండగా తీగలు తగిలి విద్యార్థి
మైక్‌కు విద్యుత్తు ప్రసరించి మత బోధకుడు
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

ఇంటి పైనున్న విద్యుత్తు తీగ వద్ద విగతజీవిగా విద్యార్థి

కనిగిరి, న్యూస్‌టుడే: ఇంటి మేడ పైకి ఎక్కి విద్యార్థులంతా సరదాగా ఆటలాడుకుంటున్నారు. ఉరుకులు పరుగులు పెడుతున్న ఆ చిన్నారులను చూసి విధికి కన్ను కుట్టినట్లైంది. విద్యుత్తు ప్రమాదం రూపంలో ఒకరి ప్రాణాలను బలిగొంది. ఈ విషాద సంఘటన కనిగిరి నగర పంచాయతీలోని శంఖవరంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై దాసరి ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శంఖవరం గ్రామానికి చెందిన కడప వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మల కుమారుడు మారుతీ మహేంద్ర(10). స్థానికంగా ఉన్న పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో అదే ఊళ్లోని మరో నలుగురు మిత్రులతో కలిసి దాగుడు మూతలు ఆడుకునేందుకు ఉపక్రమించాడు. ఇందుకుగాను సమీపంలో ఉన్న శంకర్‌ అనే వ్యక్తికి చెందిన మేడ పైకి ఎక్కారు. ఆటలాడుకుంటున్న సమయంలో మేడ మీదుగా వెళ్తున్న వ్యవసాయ విద్యుత్తు తీగకు మారుతీ మహేంద్ర చెయ్యి తగిలింది. దీంతో అతను విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీగ నుంచి విడిపించుకునేందుకు రెండో చెయ్యి కూడా ఉపయోగించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇతర విద్యార్థులు ఇంటిని ఆనుకుని ఉన్న వరిగడ్డి వామి పైకి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.

మారుతీ మహేంద్ర (పాత చిత్రం)

 

రూ. 5 లక్షలిస్తే తొలగిస్తామన్నారు...

ఇళ్ల పైనుంచి వెళ్తున్న విద్యుత్తు తీగలను తొలగించాలని గ్రామస్థులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులకు అర్జీలు కూడా అందజేశారు. రూ. 5 లక్షల నిధులు సమకూరిస్తే స్తంభాలు, తీగలు తొలగిస్తామని చెప్పడంతో చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. ప్రస్తుతం విద్యార్థి మృతికి విద్యుత్తు శాఖే కారణమని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై అక్కడికి వచ్చిన అధికారులు, సిబ్బందిని నిలదీశారు. అర్జీలు ఇచ్చినప్పుడే తీగలు తొలగించి ఉంటే తన కుమారుడు మృతి చెందేవాడే కాదంటూ విద్యార్థి తల్లిదండ్రులు వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మ రోదించడం పలువురితో కంట నీరు పెట్టించింది. ప్రమాద విషయం తెలుసుకున్న నగర పంచాయతీ ఛైర్మన్‌ షేక్‌ అబ్దుల్‌ గఫార్‌, వార్డు సభ్యురాలు పెన్నా నాగమ్మ, వైకాపా, తెదేపా నాయకులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.


ప్రార్థనా మందిరానికి ఆహ్వానిస్తూ...

రాంబాబు మృతదేహం

పుల్లలచెరువు, న్యూస్‌టుడే: మండలంలోని మానేపల్లి గ్రామానికి చెందిన కొండా రాంబాబు(46) అదే గ్రామంలో మత ప్రబోధకుడిగా జీవనం సాగిస్తున్నారు. ఆదివారం ఆరాధన ఉండటంతో చర్చిలోకి వెళ్లారు. సంఘస్థులను ఆహ్వానించే ముందుగా దైవ ప్రార్థన చేసేందుకు మైక్‌ తీసుకున్నారు. ఈ సమయంలో మైక్‌కు అమర్చిన తీగలకు విద్యుత్తు ప్రసరించి కింద పడిపోయారు. స్థానికులు అక్కడికి చేరుకుని పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. రాంబాబుకు భార్య, నలుగురు పిల్లలున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వేముల సుధాకర్‌ తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని