logo

వలస కూలీలకు శాపం

‘జగనన్న అమ్మఒడి’ పథకానికి ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా విధించిన నిబంధన ప్రభావం వలస కూలీలపై పడింది. పాఠశాల జరిగిన పనిదినాల్లో 75శాతం హాజరును తప్పనిసరి చేయడంతో ఈ పరిస్థితి

Updated : 27 Jun 2022 04:25 IST

ఎస్సీ కుటుంబాల్లోని పిల్లలకు అందని ‘అమ్మఒడి’
75 శాతం హాజరు నిబంధనతో అనర్హత

గుర్రపుశాలకు చెందిన ఎం.శైలజకు 78శాతం హాజరు ఉన్నట్లు

పాఠశాల ప్రిన్సిపల్‌ ఇచ్చిన ద్రువీకరణ పత్రం

యర్రగొండపాలెం, న్యూస్‌టుడే: ‘జగనన్న అమ్మఒడి’ పథకానికి ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా విధించిన నిబంధన ప్రభావం వలస కూలీలపై పడింది. పాఠశాల జరిగిన పనిదినాల్లో 75శాతం హాజరును తప్పనిసరి చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. తాజాగా వచ్చిన అనర్హుల జాబితాలో ఇలాంటి కుటుంబాలు ఎక్కువగా ఉన్న గ్రామ సచివాలయాల పరిధిలో చాలా మంది ‘అనర్హత’ జాబితాలోకి వెళ్లారు. దీంతో ఈ పథకం వర్తించకుండా పోయింది.

* పిల్లలతో పాటే కూలీ పనులకు: కరవు ప్రాంతం కావడంతో సరైన వ్యవసాయ పనుల్లేక ఎస్సీ కాలనీల్లో ఎక్కువమంది చెరకు కోత పనికి వెళ్తుంటారు. పాఠశాలల పనిదినాల్లోనే ఈ పనులు సాగుతాయి. సుదూర ప్రాంతాలకు పనికి వెళ్లి అక్కడే నాలుగైదు నెలలు ఉండి వస్తుంటారు. ఇంటివద్ద పెద్దలు, వృద్ధులు లేని కుటుంబాల్లోని చిన్నారులు తల్లిదండ్రులతో పాటే వలస వెళ్తుంటారు. ఈ క్రమంలో పాఠశాలలకు సగం రోజులే హాజరు అవుతుంటారు. ప్రభుత్వం ఈ ఏడాది పెట్టిన కొత్త నిబంధనల వీరికి పథకాన్ని దూరం చేసింది. గత నెలలో వచ్చిన అమ్మ ఒడి జాబితాలో అనర్హులకు సరైన సమాచారం లేకపోవడంతో చాలామంది తమ ఆధారాలతో వినతులు ఇవ్వలేకపోయారు. ఇప్పటికీ ఏవైనా కారణాలతో అనర్హత జాబితాలో ఉన్నవారు తమ ఆధారాలతో సచివాలయాల్లో అర్జీ ఇవ్వొచ్చని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.

* వై.పాలెం మండలం వీరభద్రాపురం సచివాలయం పరిధిలో హాజరు తక్కువగా ఉందని 28మంది అనర్హులుగా తేలారు. వీరిలో వలస కూలీలకు వెళ్లే ఎస్సీ కుటుంబాలవారే దాదాపు 22మంది ఉన్నారు. చాలా గ్రామాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది.

* వై.పాలెం మండలం గుర్రపుశాలకు చెందిన మామిళ్ల శైలజ త్రిపురాంతకం మండలం దూపాడు లోని బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. గడిచిన విద్యా సంవత్సరానికిగాను 197 రోజుల పనిదినాలు జరిగాయి. సదరు విద్యార్థిని 153 రోజులు బడికి హాజరైంది. దీంతో హాజరు 78 శాతంగా ఉంది. తాజాగా ప్రకటించిన జాబితాలో బాలిక హాజరు 75 శాతం కన్నా తక్కువ ఉందని అనర్హుల జాబితాలో పేరొచ్చింది. దీంతో ప్రభుత్వానికి అర్జీ ఇచ్చేందుకు గాను పాఠశాల నుంచి హాజరు ద్రువపత్రాన్ని తెచ్చుకోవాల్సి వచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని