logo

సారూ.. అక్కడికి బదిలీ చేయరూ!

జిల్లాలో ప్రస్తుతం ఏ కార్యాలయంలో చూసినా బదిలీల చర్ఛే ప్రభుత్వం ఈ నెల 7న మార్గదర్శకాలు జారీ చేయడంతో అప్పటినుంచే తమకు అనుకూలంగా ఉన్న చోటుకు వెళ్లేందుకు పలువురు అధికారులు, ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారు. బదిలీలకు తుది గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించారు.

Published : 28 Jun 2022 03:22 IST

అనుకూలమైన చోటుకు అధికారులు, ఉద్యోగుల పోటీ

ప్రజాప్రతినిధుల ద్వారా పైరవీలు

- న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

జిల్లాలో ప్రస్తుతం ఏ కార్యాలయంలో చూసినా బదిలీల చర్ఛే ప్రభుత్వం ఈ నెల 7న మార్గదర్శకాలు జారీ చేయడంతో అప్పటినుంచే తమకు అనుకూలంగా ఉన్న చోటుకు వెళ్లేందుకు పలువురు అధికారులు, ఉద్యోగులు ప్రయత్నాలు చేస్తున్నారు. బదిలీలకు తుది గడువును ఈ నెలాఖరు వరకు పొడిగించారు. ఎక్కువ పోస్టులు మండల కేంద్రాల్లోనే ఉండటంతో స్థానిక ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యుల ఆశీస్సులతో కీలక నేతల నుంచి ఇప్పటికే కొందరు సిఫార్సు లేఖలు తీసుకోవడం గమనార్హం.

జిల్లాలోని 13 మండలాల్లో తహసీల్దారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2019లో జరిగిన ఎన్నికల సమయంలో తహసీల్దార్లు, ఎంపీడీవోలను పొరుగు జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అనంతరం తిరిగి రావడంతో అయిదేళ్లు నిండినవారు ఎవరూ లేరు. ఇతర మండలాల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు పరిపాలన సౌలభ్యం నిమిత్తం దరఖాస్తు చేసుకున్నారు. పామూరు తహసీల్దార్‌ జరుగుమల్లి; సీఎస్‌పురం అధికారి కొత్తపట్నం; దొనకొండ తహసీల్దార్‌ సింగరాయకొండకు; మార్టూరు అధికారి సంతనూతలపాడు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కొందరు డీటీలు యథావిధిగా ఇన్‌ఛార్జి తహసీల్దార్‌గా కొనసాగేందుకు చక్రం తిప్పుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 250 మంది వీఆర్వోలు, మరో 250 మంది రెవెన్యూ ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కలెక్టరేట్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

వాటిని ఖాళీగా ప్రకటిస్తూ..

జిల్లా ప్రజాపరిషత్‌ కార్యాలయం ఉమ్మడి ప్రకాశం కిందనే కొనసాగుతోంది. జడ్పీ యాజమాన్యం పరిధిలో 56 మండల ప్రజాపరిషత్‌, జడ్పీ ఉన్నత పాఠశాలలు, పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజినీరింగ్‌ కార్యాలయాలు ఉండగా సుమారు 1,100 మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. అయిదేళ్లపాటు ఒకే ప్రాంతంలో పనిచేస్తున్నవారికి బదిలీ తప్పనిసరి కావడంతో ఆ స్థానాలన్నీ ఖాళీగా ప్రకటించనున్నారు. దాంతో పలువురు పోటీ పడుతున్నారు. ఉమ్మడి ప్రకాశంలోని 56 మండలాలకుగానూ 30 మండలాల్లో కీలకమైన ఎంపీడీవో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మార్టూరు ఎంపీడీవో జరుగుమల్లికి; ప్రస్తుతం జడ్పీలో ఉన్న ఎంపీడీవో పంగులూరు; అక్కడ ఉన్న అధికారి కొరిశపాడుకు; పొన్నలూరులో ఉన్న అధికారి కొండపి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కనిగిరి ఎంపీడీవో మల్లికార్జునరావు ఒక్కరికే అయిదేళ్ల సర్వీసు పూర్తి కావడంతో అక్కడి నుంచి బదిలీ కానున్నారు. ఉద్యోగుల్లో అయిదేళ్లు నిండినవారు 197 మంది; విజ్ఞప్తుల కింద మరో 314 మంది దరఖాస్తు చేసుకున్నారు.

కార్యదర్శులను సర్దుబాటు చేసే దిశగా..

ఉమ్మడి జిల్లాలో 1,046 పంచాయతీలు ఉన్నాయి. అవన్నీ 568 క్లస్టర్ల కింద ఉండగా ప్రస్తుతం 571 మంది కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. పంచాయతీ యూనిట్‌గా 125 మంది అయిదేళ్ల సర్వీసు పూర్తిచేశారు. వారంతా అనుకూలంగా ఉన్న ఏదో ఒక పంచాయతీకి వెళ్లేందుకు అధికార పార్టీ నాయకులతో సిఫార్సు చేయించుకున్నారు. కార్యదర్శులకు గ్రేడ్లకు అనుగుణంగా క్లస్టర్‌ పంచాయతీలు కేటాయించాలని తొలుత పీఆర్‌ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు అనిశ్చితి నెలకొంది. తాజాగా గ్రేడు-1, 2; గ్రేడు-3, 4 హోదా కలిగిన కార్యదర్శులను అటు, ఇటుగా సర్దుబాటు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. బదిలీలకు జిల్లా పంచాయతీ కార్యాలయానికి 321 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎక్కువ మంది అదే మండలం, పంచాయతీలో కొనసాగేలా సర్దుబాటు చేసుకున్నారు.

ఇంజినీరింగ్‌ విభాగాలకు పోటీ

జిల్లా, డివిజన్‌, నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న ఇంజినీరింగ్‌ విభాగాలకు వెళ్లేందుకు పోటీ ఎక్కువగా ఉంది. ఒక్కో పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురు బదిలీల నిమిత్తం జడ్పీలో సిఫార్సు లేఖలు అందించారు. కొందరు స్వగ్రామాలకు దగ్గరగా ఉండే మండలాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండేళ్లుగా సాధారణ బదిలీలు లేక ఎక్కువమంది పరిపాలన సౌలభ్యం పేరిట పలు ప్రాంతాల్లో డిప్యూటేషన్లపై విధులు నిర్వహిస్తున్నారు. వారిలో అత్యధికులు స్థానికంగానే రెగ్యులర్‌గా కొనసాగేందుకు ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సులు చేయించుకున్నారు. బదిలీల ప్రక్రియకు మరో మూడు రోజులే గడువు ఉండటంతో ఉన్నతాధికారులు ఆ దిశగా కసరత్తు ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని