logo

ఇంటర్‌ సరే.. బోధకులేరీ!

బాలికలకు ఉన్నతవిద్య దరిచేర్చేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)లో ఇంటర్మీడియట్‌ కోర్సులు ప్రారంభమవుతున్నాయి. మొత్తం 37 కేజీబీవీలకు గాను 14 చోట్ల ఇప్పటికే ఇంటర్‌ తరగతులు కొనసాగుతున్నాయి. మి

Published : 28 Jun 2022 03:22 IST

 37 కేజీబీవీల్లో ప్రవేశాలకు ఏర్పాట్లు

- న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

బాలికలకు ఉన్నతవిద్య దరిచేర్చేందుకు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అన్ని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ)లో ఇంటర్మీడియట్‌ కోర్సులు ప్రారంభమవుతున్నాయి. మొత్తం 37 కేజీబీవీలకు గాను 14 చోట్ల ఇప్పటికే ఇంటర్‌ తరగతులు కొనసాగుతున్నాయి. మిగిలిన 23 చోట్ల కూడా ఈసారి మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు. అంతవరకు బాగానే ఉన్నా గతంలో మాదిరి బోధకుల కొరత లేకుండా తగిన ఏర్పాట్లుచేస్తేనే ఆశించిన లక్ష్యం నెరవేరుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పదోతరగతి ఉత్తీర్ణులైన బాలికలందరికీ ఉన్నత విద్య అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నుంచి జులై 12 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు అధికారి బి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొన్ని కేంద్రాలకు వృత్తి విద్యా కోర్సులు కేటాయించారు. అక్కడ సాధారణ కోర్సులు ఉండవు. సాధారణంగా కేజీబీవీల్లో ఇంటర్‌ బోధించేవారిని పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ)గా పిలుస్తారు. పీజీ ఉత్తీర్ణులను నియమించి నెలకు రూ.12 వేల వేతనం ఇస్తుంటారు. తక్కువ వేతనం కావడంతో ఆ పోస్టుల్లో చేరినవారు కొద్దిరోజుల తరువాత విరమించుకుంటున్నారు. మూడేళ్లుగా 14 కేంద్రాల్లో ఇంటర్మీడియట్‌ తరగతులు కొనసాగుతున్నా పూర్తిస్థాయిలో బోధకులు లేరు. గత ఏడాది సమస్య మరింత జఠిలమైంది. పరీక్షలకు మూడు నెలల ముందు 45 పోస్టుల భర్తీకి ప్రకటన ఇవ్వగా 200 మంది దరఖాస్తు చేసుకున్నారు. మౌఖిక పరీక్షల దశలో ప్రభుత్వం నియామకాలు నిలిపివేయడంతో విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం పడింది. ఆ తర్వాత గంటల పద్ధతిలో అతిథి అధ్యాపకులను నియమించుకోవాలని ఎస్‌పీడీ సూచించినా అర్హులు లేక ఆచరణకు నోచుకోలేదు. దీనివల్ల జూనియర్‌ ఇంటర్‌లో 36 శాతం, సీనియర్‌ ఇంటర్‌లో 59 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గతంలో ఎప్పుడూ ఈ తరహా పరిస్థితి ఎదురుకాలేదు.

165 మంది అవసరం

ఇంటర్‌ బోధనకు ఒక్కో కేజీబీవీకి అయిదుగురు అవసరం. ఆ విధంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్నవారు పోను 165 మందిని నియమించాలి. ఇప్పటివరకు నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. ప్రవేశాలు మాత్రం ప్రారంభించారు. దీనిపై ఏపీసీ బి.శ్రీనివాసరావును సమాచారం కోరగా సోమవారం జరిగిన సమావేశంలో పీజీటీ పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తామని చెప్పారన్నారు. అన్ని చోట్ల వసతిగృహ సౌకర్యం ఉంటుందని..అనాథలు, ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ, ఓసీలకు వరుస క్రమంలో ప్రాధాన్యమిచ్చి ప్రవేశాలు కల్పిస్తామన్నారు.

ఆ కేంద్రాల్లో వృత్తి విద్యాకోర్సులు

కొత్తగా మంజూరైన కేంద్రాల్లో కొన్నిచోట్ల కేవలం వృత్తి విద్య కోర్సులనే ప్రవేశపెట్టారు. గుడ్లూరులో ఎంపీహెచ్‌డబ్ల్యూ, కందుకూరులో అగ్రికల్చర్‌, కురిచేడులో మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌, హెచ్‌ఎం పాడులో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, మార్కాపురం(రాయవరం)లో అకౌంటింగ్‌, టాక్సేషన్‌ కోర్సులు అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన చోట్ల సంప్రదాయ గ్రూపులు ఎంపీసీ, బైబీసీ, హెచ్‌ఈసీ, సీఈసీలో ప్రవేశాలు ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని