logo
Updated : 28 Jun 2022 11:56 IST

అమ్మకానికి జగనన్న పట్టా ..!

అప్పులు చేసి నిర్మించలేక కొందరు లబ్ధిదారుల అవస్థ

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు:

ఇటుక, సిమెంట్‌, ఇనుము అదనంగా కొనుగోలు చేసుకుంటున్నాం. అవి తెచ్చి కాలనీలో ఉంచితే రాత్రికి రాత్రే దొంగలు తీసుకెళ్లిపోతున్నారు. దీంతో ఇళ్ల వద్ద పెట్టుకుని అక్కడి నుంచి మళ్లీ రిక్షా బాడుగ పెట్టుకుని అవసరమైన మేరకు కాలనీల వద్దకు తీసుకెళ్తున్నాం. -ఓ పేద దంపతుల వెల్లడి

ఇల్లు ఒకసారే కట్టుకుందామని రూ.3 వడ్డీకి అప్పు తెచ్చి పనులు చేస్తున్నాం. నిర్మాణానికి ఇప్పటికే రూ.5 లక్షలైంది. మరో రూ.2 లక్షలు ఖర్చుచేస్తేనే తప్ప అనుకున్నట్లుగా ఇల్లు పూర్తికాదు. సొమ్ము లేక ఏం చేయాలో పాలుపోవడంలేదు. -ఓ లబ్ధిదారు ఆవేదన

తక్షణం ఇంటిని నిర్మించకపోతే పట్టా రద్దు చేసి స్థలం వెనక్కి తీసుకుంటామన్న అధికారుల హెచ్చరికలతో జగనన్న కాలనీల్లో లబ్ధిదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చేసేదిలేక కొందరు ఆ స్థలాలను అమ్ముకుంటున్న పరిస్థితి వివిధ చోట్ల వెలుగులోకి వస్తుంది.

కొత్తపట్నం జగనన్న కాలనీ లేఅవుట్‌లో దాదాపు 280 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. సగం మంది రోజూ కూలికి వెళితే కానీ పూట గడవని నిరుపేదలు. అధికారుల హెచ్చరికలతో దిక్కుతోచని స్థితిలో కొందరు వాటిని విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కాలనీలో ఇప్పటివరకు 30 మంది.. ఎప్పటికైనా స్థలం మీకే విక్రయిస్తామన్న ఒప్పందంతో రూ.70 వేల నుంచి రూ.1.70 లక్షల వరకు కొందరి వద్ద డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. ఓ లబ్ధిదారు మాట్లాడుతూ రూ.2 నుంచి రూ.5 వడ్డీకి రూ.2 లక్షలు రుణం తెచ్చానని.. చేతిలో ఉన్న మరో రూ.60 వేలు ఖర్చు చేసి నిర్మాణం చేపట్టానని తెలిపారు. ఇప్పటివరకు రూ.19 వేల చొప్పున రెండు బిల్లులు మాత్రమే వచ్చాయన్నారు. ఇంటిలోకి వెళ్లాలంటే మరో రూ.2 లక్షలకు పైగా ఖర్చవుతుందని, ఎటూ దిక్కుతోచడం లేదని వాపోయారు. ‘ఇక్కడ ఏర్పాటుచేసిన ట్యాంకుల్లో పదిరోజులుగా నీళ్లు లేవు. దీంతో ట్యాంకు నీళ్లు కొందామంటే రూ.400 చెబుతున్నారు. మాకు ఆ శక్తి లేదు. సమీపంలో ఉన్న కుంట నుంచి బిందెలతో మోసి తెచ్చుకుంటున్నాం’ అని మరో వృద్ధురాలు తెలిపారు. ఇక ఆర్థిక ఇబ్బందులతో కొందరు పునాదులు వేసి నిలిపేయగా ఇంకొందరు గుంతలు తీసి చువ్వలు మాత్రం నిలబెట్టారు.

స్థోమత లేక..

కాలనీలో పట్టా పొందిన ఓ మహిళకు ఇంటి నిర్మాణం చేపట్టే స్థోమత లేదు. బేస్‌మెంట్‌ వేయాలంటే కూలీలు, మేస్త్రి ఖర్చులే రూ.1.20 లక్షలు అడిగారు. అంత డబ్బులు లేవని మిన్నకుండిపోయిన ఆమెకు పట్టా రద్దవుతుందని స్థానిక అధికారులు చెప్పడంతో కంగారుపడ్డారు. ఆ ఆ స్థలం బేరం పెట్టి రూ.70 వేలకు విక్రయించారు. వాస్తవానికి కొనుగోలు చేసిన వ్యక్తి ఆ పట్టాను తన పేరిట మార్చుకోవడానికి అయిదేళ్ల వరకు అవకాశం ఉండదు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టినా పట్టా పొందిన లబ్ధిదారు పేరు మీదనే ఉంటుంది. కాగా ఉదయం వేళల్లో నిర్మాణ పనులు చేపట్టి ఆ తర్వాత కూలి పనులకు వెళ్తున్నామని మరికొందరు తెలిపారు. తొలుత ఇల్లు కట్టిస్తామని చెప్పి, ఇప్పుడు తాము నిర్మించుకోకపోతే రద్దు చేస్తామని ప్రభుత్వం చెప్పడమేంటని వారు ప్రశ్నించారు.

ఉన్నతాధికారులకు తెలియజేశాం

కొత్తపట్నం జగనన్న కాలనీలో కొందరు ఇంటి స్థలాలు విక్రయించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. నిర్మాణాలు చేపడుతుండటంతో ఎవరు విక్రయించారో, ఎవరు కొనుగోలు చేశారో తెలియని పరిస్థితి. ఎవరిపేరున పట్టా ఉందో వారికే రాయితీ సొమ్ము, సామగ్రి ఇస్తున్నాం. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. - నారాయణరెడ్డి, డీఈ, గృహ నిర్మాణశాఖ

ట్యాంకులు లేక ఇలా నీరు కొనుగోలు

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని