logo
Updated : 29 Jun 2022 02:40 IST

బడి బస్సు.. తనిఖీలకు ముఖం చాటేస్తూ...

ఎఫ్‌సీలపై దృష్టిపెట్టని యాజమాన్యాలు
బోగస్‌ బీమా పత్రాలతో రోడ్లపై పరుగు

జులై అయిదో తేదీ నుంచి పాఠశాలల తలుపులు తెరుచుకోనున్నాయి. ఆటపాటలకు ఇక సెలవంటూ పుస్తకాల సంచులతో పిల్లలు బడి బాట పట్టనున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు షెడ్లలో విశ్రాంతి తీసుకుంటున్న బస్సులు రంగుల హంగులద్దుకుని రోడ్డెక్కనున్నాయి. మరి ఇవి ఎంత సురక్షితం అనే ప్రశ్న ప్రతి చిన్నారి తల్లిదండ్రుల మదిలోనూ తలెత్తుతోంది. కారణం తరచూ ప్రమాదాల బారిన పడుతున్న ఉదంతాలు కళ్లెదుట కనిపిస్తుండటమే. ఇటువంటి పరిస్థితుల్లో బస్సులను పరిశీలించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లను రవాణా శాఖ అధికారులు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ దిశగా ఇటు పాఠశాల యాజమాన్యాలు, అటు సంబంధిత అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే అదునుగా నకిలీ బీమా పత్రాలతోనూ పెద్దసంఖ్యలో కొందరు నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి.

- న్యూస్‌టుడే, ఒంగోలు నేరవిభాగం

రంగులద్ది..  రోడ్డెక్కిస్తూ...
ఏదైనా వాహనం రోడ్డెక్కాలంటే రవాణా శాఖ జారీ చేసిన ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌(ఎఫ్‌సీ) తప్పనిసరి. బడి బస్సులకూ ఇదే నిబంధన వర్తిస్తుంది. ఏటా విద్యా సంవత్సరం ఆరంభానికి ముందే రవాణా శాఖ కార్యాలయాల వద్ద ఎఫ్‌సీల కోసం బారులు తీరడం పరిపాటి. ఇప్పుడా పరిస్థితి మారింది. జిల్లాలో ప్రస్తుతం 1,198 బడి బస్సులుంటే.. జూన్‌ 27వ తేదీ నాటికి కేవలం 378కి మాత్రమే అధికారులు ఎఫ్‌సీలు జారీ చేశారు. మరో 820 ఇంతవరకు రవాణా శాఖ కార్యాలయాల ముఖమే చూడలేదు. అంటే నిబంధనల ఉల్లంఘన ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్ఛు అనధికారికంగా నడిపే బడి బస్సులూ ఎన్నో ఉన్నాయి.

బీమా.. ధీమా లేకుండానే...

రవాణా శాఖ నిబంధనల ప్రకారం ప్రతి వాహనానికీ బీమా తప్పనిసరి. చేయించకపోతే ఎఫ్‌సీ మంజూరు చేసే అవకాశమే లేదు. కొందరు నకిలీ పత్రాలతో కొందరు బస్సులు నడుపుతుండగా, మరికొందరు అస్సలు బీమా పత్రాలు లేకుండానే తిప్పుతున్నారు. ఒంగోలులోని ప్రముఖ విద్యాసంస్థ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి కనీసం బీమా పత్రాలు లేకుండానే పెద్దసంఖ్యలో తమ బస్సులు తిప్పుతున్నట్లు అభియోగాలు ఉన్నాయి. విద్యార్థులను తరలించే క్రమంలో ఏదైనా ప్రమాదం వాటిల్లితే ఎటువంటి పరిహారమూ లభించే అవకాశం లేదు. అయినప్పటికీ రవాణా శాఖ అధికారులు కళ్లు మూసుకుని అనుమతులు మంజూరు చేస్తారనే అభియోగాలున్నాయి.

పరిశీలించాల్సిన అంశాలివీ...

ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీకి ముందు సంబంధిత మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎంవీఐ) ఆ వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలించాలి. సీట్లు, బ్యాగులు పెట్టుకునే ఏర్పాట్లు, ప్రథమ చికిత్స పెట్టె, ఫైర్‌ ఎష్టింగ్విషర్‌, విద్యార్థులు సులువుగా వాహనంలోకి ఎక్కేలా మెట్ల అమరిక, టైర్ల మన్నిక, అత్యవసర ద్వారం, డ్రైవర్‌, అతని అనుభవం అన్నీ పరిశీలించి సంతృప్తి చెందాలి. అనంతరం ఆయనే స్వయంగా బస్సు నడిపి చూసి అంతా బాగుందని నిర్ధారించుకున్న తర్వాత ఎఫ్‌సీ మంజూరు చేయాలి.

సరైన పరిశీలన లేకుండానే...

వాస్తవంలో అందుకు భిన్నంగా సాగుతోందనే విమర్శలున్నాయి. ఎంవీఐలకు సహాయకులుగా ఉన్న కానిస్టేబుళ్లు, హోంగార్డులు పత్రాలను పరిశీలించి సంతృప్తి చెందితే చాలు ఎఫ్‌సీలు జారీ అవుతున్నాయి. ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమైన ప్రక్రియ. ఇక్కడే విద్యార్థుల భద్రత గాలిలో దీపంలా మారుతోంది.

ఎఫ్‌సీలు లేకుండా నడిపితే కఠిన చర్యలు...

బడి బస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ నడుస్తోంది. ఎఫ్‌సీల కోసం బస్సులను నిత్యం తీసుకొస్తున్నారు. జులై అయిదో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌సీల జారీ ప్రక్రియ ఊపందుకుంది. అవి లేకుండా రోడ్డెక్కితే ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. విద్యార్థుల భధ్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తాం. నకిలీ బీమా పత్రాలు, అసలు బీమా లేకుండా తిప్పుతున్న వాటి పైనా దృష్టి సారించి చర్యలు తీసుకుంటాం.

- బి.శ్రీకృష్ణవేణి, ఉప రవాణా కమిషనర్‌, ఒంగోలు

 

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని