logo
Updated : 29 Jun 2022 02:40 IST

పెద్దల అండ... కరిగిపోతున్న కొండ

ఎర్రమట్టి అక్రమ రవాణాపై అధికారుల నిర్లిప్త ధోరణి
న్యూస్‌టుడే, టంగుటూరు

జేసీబీతో గ్రావెల్‌ను తవ్వి టిప్పర్‌లో పోస్తున్న దృశ్యం

ఆ ప్రాంతం ప్రభుత్వ భూమని, అక్కడి నుంచి నిత్యం వేల టన్నుల ఎర్రమట్టి వివిధ రూపాల్లో తరలిపోతోందని అందరికీ తెలుసు. అయినప్పటికీ మైనింగ్‌ అధికారులు, రెవెన్యూ సిబ్బంది కన్నెత్తి చూడని పరిస్థితి. కొందరు రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్న ఈ ఎర్రమట్టి అక్రమ రవాణాలో అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తుండటం శోచనీయం. మండలంలోని కొణిజేడు, కందులూరు, మర్లపాడు గ్రామాల్లో విస్తరించి ఉన్న కొండ పోరంబోకు భూముల్లోని ఎర్రమట్టి తరలింపు యథేచ్ఛగా జరుగుతోంది.

రాత్రి, పగలు తేడా లేకుండా....

మూడు గ్రామాల్లోనూ దాదాపు 500 ఎకరాల్లో ఎర్రమట్టి కొండలు విస్తరించి ఉన్నాయి. తవ్వకాలకు అనుమతులు లేని ఈ ప్రాంతం నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా భారీ వాహనాలతో మట్టిని తరలిస్తున్నారు. నిత్యం వందల టిప్పర్లలో ఒంగోలు, సంతనూతలపాడు, చీమకుర్తి, కొండపి, టంగుటూరు, జరుగుమల్లి ప్రాంతాలకు మట్టి రవాణా జరుగుతోంది. దూరాన్ని బట్టి ఒక్కో టిప్పర్‌ రూ.5 వేల నుండి విక్రయిస్తున్నారు. ఇటీవల జగనన్న కాలనీ లేఅవుట్లకు మెరక తోలకం పేరుతో కొండ ప్రాంతాన్ని తవ్వి గ్రావెల్‌ తరలించడంతో భారీ గుంతలు ఏర్పడ్డాయి.

మైనింగ్‌ అధికారులు ఎక్కడ.....

కొండ ప్రాంతాల నుండి ప్రభుత్వ కార్యాలయాలకు గ్రావెల్‌ తీసుకెళ్లాలన్నా.. మైనింగ్‌ అధికారుల అనుమతులు తప్పనిసరి. వారు ఇచ్చిన కొలతల ఆధారంగా మాత్రమే తవ్వి తీసుకెళ్లాలి. అయితే ఇక్కడ తవ్వకాలకు ఎటువంటి అనుమతులు కనిపించని పరిస్థితి. ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా తరలిస్తున్నారని తెలిసినా, పట్టపగలే లారీలు వెళ్తున్నా గ్రామాల రెవెన్యూ అధికారులు ప్రశ్నించే పరిస్థితి లేదు. అక్రమ తవ్వకాలపై పంచాయతీల అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

తవ్వకాలపై కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు తెలిపేలా ఏర్పాటు చేసిన బోర్డు

 

కొందరు నాయకులే సూత్రధారులు...

కందులూరు, మర్లపాడు, యరజర్ల కొండ ప్రాంతాల్లో గ్రావెల్‌ తరలింపునకు అధికార పార్టీకి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి బంధువు, వల్లూరు గ్రామానికి చెందిన ఓ కాంట్రాక్టరు, కందులూరుకు చెందిన అధికార పార్టీ నాయకుడు సూత్రధారులని స్థానికులు చెబుతున్నారు. అందువల్లనే మైనింగ్‌ అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విచ్చలవిడిగా కొండలు తవ్వడంతో పర్యావరణం దెబ్బతింటోందని, పశువుల మేతకు కొండ ప్రాంతాలే దిక్కని కాపరులు వాపోతున్నారు.

కేసులు నమోదు చేయిస్తాం..

యరజర్ల ప్రాంతంలో కొంత తవ్వేందుకు అనుమతులు ఉన్నాయి. మిగిలిన చోట్ల ఇవ్వలేదు. అనుమతులు ఉన్నప్పుడు నచ్చిన చోటికి తరలించే అధికారం ఉంటుంది. అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు సమాచారం అందితే విజిలెన్స్‌ అధికారులను అప్రమత్తం చేస్తాం. కేసులు నమోదు చేయిస్తాం. నాలుగు నెలల క్రితం రెవెన్యూ అధికారులు నాలుగు టిప్పర్లను అదుపులోకి తీసుకొని టంగుటూరు పోలీస్‌ స్టేషన్‌కు అప్పగించారు.

- రవికుమార్‌, మైన్స్‌ అండ్‌ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్‌

 

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని