logo

అధికారంలో మిరియాలు

అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గత రెండు రోజులుగా చేస్తోన్న వాఖ్యలు జిల్లా రాజకీయాల్లో

Published : 29 Jun 2022 02:38 IST

ప్లీనరీలో మాట్లాడుతున్న బాలినేని.. వేదికపై మాగుంట, బుర్రా, బూచేపల్లి,

సుజాత, మాజీ మంత్రి శిద్దా తదితరులు

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు- ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్‌టుడే: అధికార పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గత రెండు రోజులుగా చేస్తోన్న వాఖ్యలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. అదే సమయంలో ఎవరిని ఉద్దేశించి అలా మాట్లాడుతున్నారనే విషయంపై సొంత పార్టీలోని నాయకుల్లోనే తర్జనభర్జనలు సాగుతున్నాయి. సొంత పార్టీలోనే కుట్రంటూ పదే పదే చేస్తోన్న వ్యాఖ్యలు వైకాపాలోని అంతర్గత విభేదాలనూ బహిర్గతం చేస్తున్నాయి.

వరుస ఉదంతాలతో ఉక్కిరిబిక్కిరి...: ఇటీవల కాలంలో ఒంగోలు కేంద్రంగా తనకు వ్యతిరేకంగా వరుసగా జరుగుతున్న పలు అంశాలతో మాజీ మంత్రి బాలినేని ఒకింత ఇబ్బందికి గురయ్యారు. ఆయనను మంత్రి వర్గం నుంచి తొలగించడం,  జీర్ణించుకోలేక ఆయన అలకబూనటం వంటివి రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. చివరికి ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డితో భేటీ అయిన తర్వాత మనసు మార్చుకున్నారు. అనంతరం ఆయనకు పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తగా ప్రకాశంతో పాటు నెల్లూరు, బాపట్ల జిల్లాల బాధ్యతలు అప్పగించారు. పార్టీలో మంచి ప్రాధాన్యం దక్కడంతో ఇక అంతా సజావుగానే కొనసాగుతుందనే వాతావరణం నెలకొంది. ఇటీవల కాలంలో కొత్తపట్నం మండలం అల్లూరులో ధాన్యం కొనుగోళ్లలో అవకతవకల పేరిట చోటుచేసుకున్న ఆందోళనతో బాలినేని తీవ్రంగా స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరుష పదజాలంతో తెదేపాకు చెందిన మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను దూషించారు. ఇంతలోనే జనసేన మహిళా కార్యకర్తతో బాలినేని మద్యం మత్తులో మాట్లాడారంటూ కొన్ని ఛానళ్లలో వచ్చిన వార్తలు ఆయన్ను మరింత చికాకుకు గురి చేశాయి. చెన్నైలో బంగారం కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఒక వ్యాపారి రూ.2 కోట్లతో పోలీసులకు పట్టుబడితే అది బాలినేని హవాలా డబ్బు అంటూ విమర్శలు వచ్చాయి. వైకాపా నాయకుడు సుబ్బారావు గుప్తా పదే పదే ఏదోక వ్యాఖ్యలు చేస్తూ చికాకు పెడుతూనే ఉన్నారు.

ఏ పెద్దల వైపు ఆ వేళ్లు...: ఈ నేపథ్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి బాలినేని ఘాటుగా స్పందించారు. తెదేపా నాయకులు దామచర్ల జనార్దన్‌, మంత్రి శ్రీనివాసరావుపై తీవ్ర విమర్శలు చేశారు. వారికి తమ పార్టీలో కొందరు పెద్ద నాయకులు సహకరిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా నిత్యం కదలికలు తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌ తన చుట్టూ కొందరిని ఏర్పాటు చేశారంటూ బాలినేని చేసిన వ్యాఖ్యలతో ద్వితీయ శ్రేణి నాయకులు సైతం ఉలిక్కిపడ్డారు. వాస్తవానికి జిల్లాలో కొందరు కేంద్ర, రాష్ట్ర స్థాయి నాయకులతో బాలినేనికి కొంత మేరకు వివాదాలున్నాయి. తరచూ వేదికలు పంచుకుంటూ, తామంతా ఒకటే అని చెబుతున్నప్పటికీ అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని కొందరితోను పెద్దగా సఖ్యత లేదు. బాలినేని వ్యాఖ్యల్లో ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్షంతో కుమ్మక్కైన పెద్ద నాయకులు ఎవరంటే కొందరి నాయకుల వైపు అందరి దృష్టి మళ్లింది. వైకాపాలో ప్రస్తుతం ఎవరిని కదిలించినా దీని పైనే చర్చ సాగుతోంది. పార్టీలో కోవర్టులు ఎవరనే విషయంపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. గతంలో వేరే పార్టీలో పనిచేసి వచ్చిన నాయకులు, ఇతర పార్టీల్లో ఉండి తాజాగా బాలినేని శిబిరంలోకి చేరిన వారి పైనా అనుమానపు చూపులు చూస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి తన వద్ద కాల్‌ డేటా ఉందని అవసరమైన సమయంలో బహిర్గతం చేస్తామని శ్రీనివాసరెడ్డి సభాముఖంగా ప్రకటించడం పెను దుమారాన్ని రేపుతోంది.

వారసులను ఆదరించాలని
అభ్యర్థన...: ఒంగోలులోని ఏ1 కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన వైకాపా నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో నేతలు వారసుల ప్రస్తావన తేవడం గమనార్హం. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అతని కుమారుడు ప్రణీత్‌రెడ్డి మాగుంట కుటుంబ బిడ్డలన్నారు. ప్రస్తుతం తమకు వయస్సు అయిపోతోందని.. తమ స్థానంలో వచ్చే మా వారసులను కూడా ఇదే విధంగా ఆదరించాలని ఆయన కార్యకర్తలను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని