logo
Published : 29 Jun 2022 06:18 IST

సొంత వారే తప్పులు ఎత్తి చూపితే దామచర్లపై విమర్శలా!

బాలినేనిపై తెదేపా నాయకుల ధ్వజం


మాట్లాడుతున్న ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ శ్రీనివాసరావు, చిత్రంలో నాయకులు శశికాంత్‌,  నాగేశ్వరరావు, పద్మజ తదితరులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: సొంత పార్టీ నాయకులే ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపుతుంటే ఓర్వలేక... ప్రతిపక్ష తెదేపాపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కసు వెళ్లగక్కడం ఎంతవరకు సమంజసమని ఏఎంసీ మాజీ ఛైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు ప్రశ్నించారు. తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌పై బాలినేని చేస్తున్న ఆరోపణలు ఖండించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గుప్తాపై వైకాపా నాయకుల దాడి, జనసేన నాయకురాలు రాయపాటి అరుణకు అర్ధరాత్రి వేళ ఫోన్‌ చేయడం, కొత్తపట్నం మండలం అల్లూరులో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, చెన్నైకు డబ్బు తరలిస్తూ పట్టుబడ్డ బంగారం వ్యాపారి బాలు కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్‌ ఉండడంపై... దామచర్లకు సంబంధం ఏమిటని నిలదీశారు. పార్టీ నాయకుడు ఎద్దు శశికాంత్‌ భూషణ్‌ మాట్లాడుతూ... ఒంగోలు ప్రజలకు బాలినేని చేసిందేమీ లేదని, ముఖ్యమంత్రి బంధువు అయినా మంత్రి పదవి పోగొట్టుకున్నారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోతున్నారని సర్వేలో తేలడంతోనే సానుభూతి కోసం లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఒంగోలు ప్రజలు వీటిని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో ఒంగోలు టిక్కెట్‌ వస్తుందో, లేదోనన్న అయోమయ స్థితిలో బాలినేని ఉన్నారని... తెదేపా నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు అన్నారు. సమావేశంలో తెలుగు మహిళ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షురాలు రావుల పద్మజ, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.కుసుమకుమారి, ఆర్ల వెంకటరత్నం, నాళం నరసమ్మ, ఎం.శ్రీనివాసరావు, నిడమనూరి పావని, పసుపులేటి సునీత తదితరులు పాల్గొన్నారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని