logo
Published : 30 Jun 2022 02:02 IST

బీమా.. భరోసా ఇచ్చేనా!

క్షేత్రస్థాయిలో మళ్లీ సర్వే
వైఎస్సార్‌ బీమా సాయానికి పలువురి ఎదురుచూపులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తూ జరిగే ప్రమాదాల్లో మృతిచెందినవారికి, వైకల్యం పొందిన పేద కుటుంబాలకు భరోసా ఇవ్వాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్‌ బీమా పథకం అమలుచేస్తోంది. మార్గదర్శకాల ప్రకారం గతేడాది నమోదు చేసుకున్న వారి వివరాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్రమబద్దీకరణ చేయాలి. కొత్తగా బియ్యం కార్డులు పొందిన వారి సమాచారాన్ని యాప్‌ ద్వారా నమోదు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటా సర్వే చేస్తున్నారు. లబ్ధిదారుల పేర్లు, బ్యాంక్‌ ఖాతాల్లో తప్పులు ఉన్నా..నామినీ పేర్ల మార్పు చేయడానికి ఈ సారి అనుమతి ఇచ్చారు. అయితే గతంలో ఈ పథకం కింద నమోదైన అనేకమందికి ఇప్పటికీ బీమా డబ్బులు రాక ఆవేదనలో ఉన్నారు.
38 మండలాలకు చెందిన...
గతేడాది జులై ఒకటో తేదీన వైఎస్సార్‌ బీమా పథకాన్ని ప్రారంభించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లబ్ధిదారులను గుర్తించారు.పునర్విభజన తర్వాత ఈ ఏడాది ప్రకాశం జిల్లాలోని 38 మండలాలకు చెందిన లబ్ధిదారుల క్రమబద్దీకరణకు ఆదేశాలివ్వడంతో గత నెల రోజులుగా వాలంటీర్లు సర్వే చేపట్టారు. గతయేడాది నమోదు ప్రక్రియ తొలిసారి కావడంతో తప్పులు దొర్లాయి. ప్రస్తుతం మార్పులు, చేర్పులు చేయాలంటే కచ్చితంగా లబ్ధిదారుల ఈకేవైసీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పథకం కింద దారిద్య్ర రేఖకు దిగువన ఉండే పేద కుటుంబాలకే అర్హత ఉంటుంది. బియ్యం పత్రం తప్పనిసరిగా ఉండాలన్న నిబంధన ఉంది. 18-70 సంవత్సరాలలోపు వయస్సు వారికి అవకాశం కల్పిస్తారు. 18-50 ఏళ్లలోపువారు సహజంగా మృతి చెందితే ఆ కుటుంబానికి రూ.లక్ష; రోడ్డు లేదా ఇతరత్రా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతే రూ.5 లక్షలు; శాశ్వత వైకల్యం చెందితే రూ.5 లక్షల చొప్పున బీమా రూపంలో ఆర్థికసాయం ఇస్తుంటారు.

మిగతావారికో
ఈ పథకం కింద జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,155 క్లెయిమ్స్‌ నమోదయ్యాయి. అందులో 123 ప్రమాద మరణాలు, 1,032 సహజ మరణాలు ఉన్నాయి. ఇప్పటివరకు 1,108 క్లెయిమ్‌లు మంజూరుకాగా, అందులో 673 క్లెయిమ్‌లకు సంబంధించి రూ.8.25 కోట్ల నిధులు విడుదల చేశారు. మిగతా బాధిత కుటుంబాలు నెలల తరబడి సాయం కోసం ఎదురుచూస్తున్నాయి. కొందరు లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల పరిశీలన నిమిత్తం ముందస్తుగా రూపాయి జమ చేసినా ఆ తర్వాత మిగతా మొత్తం జమ కాకపోవడంతో డీఆర్డీఏ, మండల వైఎస్సార్‌కేపీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. సరియైన సమాధానం లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts