logo

అలలతో..ఆటలొద్దు

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సముద్ర తీరంలోని బీచ్‌ల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మూడేళ్లలో 30 మంది ప్రాణాలు కోల్పోయారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మృతిచెందిన వారిలో  యువకులు ఎక్కువగా ఉండటం మరింత ఆందోళన

Published : 30 Jun 2022 02:02 IST

ప్రమాదకరంగా తీర ప్రాంతం

 ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్న వైనం
 తీరాల్లో గస్తీ అంతంత మాత్రమే

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు

కొత్తపట్నం సముద్ర తీరంలో యువత సందడి

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సముద్ర తీరంలోని బీచ్‌ల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మూడేళ్లలో 30 మంది ప్రాణాలు కోల్పోయారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మృతిచెందిన వారిలో  యువకులు ఎక్కువగా ఉండటం మరింత ఆందోళన కల్పించే అంశం. నాలుగు నెలలుగా ప్రతి ఆదివారం ఏదోఒక తీరంలో ఒకటి రెండు సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి, ఇతర జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు జిల్లాలోని తీర ప్రాంతాలకు వస్తున్నారు. పర్యవేక్షణ సిబ్బంది నామమాత్రంగా ఉండటంతో భద్రతా చర్యలు కష్టంగా మారింది.  తీర ప్రాంతం విస్తరించి ఉండటంతో పర్యాటకులు ప్రమాదకర ప్రాంతాల్లో సముద్రంలోకి దిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సరదాగా అలలతో ఆటలాడి మృత్యువాత పడుతున్నారు.
సిబ్బంది కొరత..పర్యవేక్షణ లేమి
మెరైన్‌ స్టేషన్ల పరిధిలో సిబ్బంది కొరత వేధిస్తోంది. 140 మంది అవసరం కాగా 67 మంది మాత్రమే ఉన్నారు. వారినే సర్దుబాటు చేస్తూ విడతలవారీగా గస్తీ, భద్రతా చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. కొత్తపట్నం తీరంలో పోలీసు వాచ్‌ టవర్‌ తుప్పు పట్టి శిథిలమైంది. దాని పైకి ఎక్కడానికి వీలులేని పరిస్థితి. కిలోమీటర్ల పొడవున పర్యాటకులు తీరం లోకి దిగుతుంటారు. ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే అక్కడ ఉండటంతో వారు నేరుగా ఏదైనా సంఘటనలు గుర్తించలేరు. ఎవరైనా చెప్పేవరకు తెలిసే పరిస్థితి లేదు. పాకల తీరం లోనూ ఇదే పరిస్థితి. చీరాల, ఓడరేవుల్లోనూ ఈ మధ్యకాలంలో పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి.
హెచ్చరికలు పట్టవు..
దూరప్రాంతాల నుంచి తీరానికి వచ్చేవారికి ప్రమాదకరమైన ప్రాంతాలు తెలియవు. అలాంటి చోట ఎర్రటి గుడ్డలు కట్టిన కర్రలు పాతడమో, ఒక తాడుకు హెచ్చరిక బోర్డులు పెట్టడం, అలాంటి ప్రాంతాలకు పర్యాటకులు వెళుతుంటే వారిని హెచ్చరించి నిలువరించడం, తీరంలో నిరంతరం గస్తీ కాయడం లాంటివి మొక్కుబడిగా సాగుతున్నాయి. కుటుంబ సభ్యులతో తీరానికి వచ్చేవారు కొంత జాగ్రత్తలు తీసుకుంటుండగా, స్నేహితులు, విద్యార్థులుగా వచ్చే యువత కొందరు అందరూ స్నానాలు చేసే చోట కాకుండా జనసంచారం లేని చోటుకు వెళ్లి ప్రాణాల పైకి తెచ్చుకుంటున్నారు.


అవగాహన కల్పిస్తున్నాం..
పండగలు, వారాంతాల్లో తీరానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. కొందరు మద్యం మత్తులో, ఎవరూలేని ప్రదేశాల్లో సముద్రంలోకి దిగుతుండటం వల్ల  ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పర్యాటకులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నాం. సిబ్బంది, మత్స్యకారుల సహాయంతో చాలామందిని కాపాడుతున్నాం. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం.
-కె.శ్రీనివాసరావు, సీఐ, మెరైన్‌ స్టేషన్‌ కొత్తపట్నం


మూడేళ్లలో 30 మంది మృతి
* కొత్తపట్నం మెరైన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఏడాదికాలంలో 12 సంఘటనలు, రామాయపట్నం మెరైన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనూ పది సంఘటనలు జరిగాయి.
* చీరాల, ఓడరేవు, పాకల, కొత్తపట్నం, రామాయపట్నం, కనపర్తి బీచుల్లో మూడేళ్లలో 30మంది మృతి చెందారు.  
* గతనెల 16, 20న వాడరేవులో జరిగిన రెండు సంఘటనల్లో నలుగురు విద్యార్థులు తీరంలో గల్లంతయ్యారు. వారిలో ముగ్గురి మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకుని వచ్చాయి.
* పాకల తీరంలో గతనెల చోటుచేసుకున్న ప్రమాదంలో గల్లంతైన ఇద్దరు విద్యార్థులను మెరైన్‌ పోలీసులు కాపాడారు. పదుల సంఖ్యలో ప్రజలను మెరైన్‌ పోలీసులు, స్థానిక మత్స్యకారులు రక్షించారు. కొత్తపట్నం తీరంలో తండ్రి, కొడుకులను మెరైన్‌ * పోలీసులు రక్షించి ఆస్పత్రిలో చేర్చారు. ఈనెల 4న వాడరేవు తీరంలో అవ్వారు శంకరరావు అనే వృద్ధుడిని, 10న పల్నాడు జిల్లాకు చెందిన సయ్యద్‌ సలీమ్‌ తీరంలో మునిగి పోతుండగా మెరైన్‌ పోలీసులు రక్షించారు.


ఉమ్మడి ప్రకాశం జిల్లాలో..
సముద్ర తీర ప్రాంతం :102 కిలోమీటర్లు
జిల్లా విభజన తరువాత : 70 కిలోమీటర్లు
మండలాల పరిధి : 6
రోజుకు వస్తున్న పర్యాటకులు : 3,000
శని, ఆదివారల్లో.. వచ్చేవారు : 8,000
మెరైన్‌ స్టేషన్లు : 2
ఉన్న సిబ్బంది   :67


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని