logo

కారు ఢీకొని... విద్యార్థినికి తీవ్ర గాయాలు

కళాశాల నుంచి రోడ్డు దాటుతున్న విద్యార్థినిని కారు ఢీ కొనడంతో తీవ్ర గాయపడ్డ సంఘటన టంగుటూరు మండలం వల్లూరు రైస్‌ కళాశాల ఎదుట బుధవారం చోటు చేసుకుంది

Published : 30 Jun 2022 02:13 IST

గాయపడిన హరితకు సపర్యలు చేస్తున్న విద్యార్థులు, స్థానికులు

టంగుటూరు, న్యూస్‌టుడే: కళాశాల నుంచి రోడ్డు దాటుతున్న విద్యార్థినిని కారు ఢీ కొనడంతో తీవ్ర గాయపడ్డ సంఘటన టంగుటూరు మండలం వల్లూరు రైస్‌ కళాశాల ఎదుట బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు, విద్యార్థులు తెలిపిన వివరాల మేరకు ...కొండపి మండలం దేవిరెడ్డిపాలెం (రెడ్డిపాలెం)కు చెందిన భోగిరెడ్డి హరిత వల్లూరు సమీపంలోని రైస్‌ కళాశాలలో ఎంబీఏ చదువుతోంది.. కళాశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు స్నేహితులతో కలసి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో బయటకు వచ్చింది. 16వ జాతీయ రహదారిలో స్నేహితులతో మాట్లాడి వెనక్కి వస్తుండగా విజయవాడ నుంచి టంగుటూరు వైపు వెళ్తున్న కారు అతి వేగంగా వచ్చి హరితను ఢీకొంది. కారు వేగానికి హరిత కారు ముందు భాగంలోని అద్దానికి ఢీకొని గాలిలో ఎగిరి రోడ్డుపై పడింది. తలకు గాయం కావడంతో స్పృహ కోల్పోయింది. తోటి విద్యార్థులు హరితకు సపర్యలు చేయడంతో కోలుకుంది. 108కి సమాచారం అందించినా ఎంత సేపటికీ రాలేదు.  హరితను ఢీ కొన్న కారు నిలపకుండా వేగంగా వెళ్లిపోవడంతో కళాశాలకు చెందిన పలువురు విద్యార్థులు వెంబడించి వల్లూరు గ్రామ సమీపంలో అడ్డగించారు. కారు నడుపుతున్న వ్యక్తి ఆటోలో ఒంగోలు పోలీస్‌ స్టేషన్‌కి అంటూ వెళ్లి పోయాడని సమాచారం. దీనిపై హైవే పోలీసులు టంగుటూరు పోలీసులకు సమాచారం అందించారు.
మానవత్వం చాటుకున్న ఎంపీపీ : ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో ఒంగోలు నుంచి టంగుటూరుకు కారులో వెళ్తున్న టంగుటూరు ఎంపీపీ పటాపంజుల కోటేశ్వరమ్మ, ఆమె అల్లుడు మస్తాన్‌బాబులు సంఘటన చూసి మానవత్వంతో వారి కారులో హరితను ఒంగోలు కిమ్స్‌ ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించారు. హరిత వివరాలను స్నేహితుల ద్వారా తెలుసుకుని టంగుటూరు మండలంలోని పలు వాట్సాప్‌ గ్రూప్‌ల్లో పోస్ట్‌ చేశారు. విషయం తెలుసుకున్న పలువురు హరిత తల్లిదండ్రులకు సమాచారం అందించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని