logo

దోపిడీ కేసులో ముగ్గురి అరెస్టు

ఆటో ఎక్కిన ప్రయాణికుడిని బెదిరించి దోపిడీకి పాల్పడిన నిందితులను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు... గురువారం ఆ వివరాలు

Updated : 01 Jul 2022 02:15 IST

నిందితులను వెంటాడిన సిబ్బందితో ఎస్పీ మలికా గార్గ్‌, అదనపు ఎస్పీ (అడ్మిన్‌) నాగేశ్వరరావు

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఆటో ఎక్కిన ప్రయాణికుడిని బెదిరించి దోపిడీకి పాల్పడిన నిందితులను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఒంగోలు డీఎస్పీ యు.నాగరాజు... గురువారం ఆ వివరాలు వెల్లడించారు. ఉలవపాడు మండలం చాకిచర్లకు చెందిన డోలా శ్రీనివాసరావు జూన్‌ 28 అర్ధరాత్రి ఒంగోలు రైల్వేస్టేషన్‌లో దిగారు. బస్టాండ్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. అదే ఆటోలో మరో ఇద్దరు యువకులు ఎక్కారు. బస్టాండ్‌కు కాకుండా దక్షిణ బైపాస్‌ వైపు వెళ్తుండడంతో ప్రశ్నించిన శ్రీనివాసరావును... సదరు యువకులు కత్తులతో బెదిరించారు. నగర శివార్లలో ఆయనను కొట్టి రూ.7,600 నగదు, చరవాణి లాక్కొని... సూరారెడ్డిపాలెం సమీపంలో ఆటోలోంచి కిందపడేసి వెళ్లిపోయారు. బాధితుడు సమీపంలో ఉన్న హైవే మొబైల్‌ పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు అప్రమత్తమయ్యారు. తమ వాహనంతో ఆటోను వెంబడించారు. దీంతో నిందితులు జాతీయ రహదారిపై ఆటోను వదిలి పరారయ్యారు. ఆటో నంబరు ఆధారంగా రెండో పట్టణ సీఐ ఎన్‌.రాఘవరావు, ఎస్సై దాసరి రాజారావు దర్యాప్తు చేపట్టారు. దోపిడీకి పాల్పడిన నిందితులు ఒంగోలు అరవకాలనీకి చెందిన వరికూటి అశోక్‌, కోన విజయ్‌, కోటా రవితేజలుగా గుర్తించారు. ఒంగోలు ఎఫ్‌సీఐ గోదాము వద్ద వారిని అరెస్టు చేసి... చోరీ సొత్తుతో పాటు నేరానికి ఉపయోగించిన ఆటో, కత్తి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు.

హైవే మొబైల్‌ సిబ్బందికి ఎస్పీ ప్రశంస: బాధితుడి ద్వారా దోపిడీ విషయం తెలిసిన వెంటనే స్పందించి నిందితులను వెంటాడిన హైవే మొబైల్‌ పెట్రోలింగ్‌ సిబ్బంది... హెడ్‌ కానిస్టేబుల్‌ కొలకలూరి అంకయ్య (హెచ్‌సీ నెం:1126), ఏఆర్‌ కానిస్టేబుల్‌ వై.బాదరయ్య (ఏఆర్‌ పీసీ నెం: 2976)ను జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి గురువారం పిలిపించి ప్రశంసాపత్రాలు అందజేశారు. అదనపు ఎస్పీ (అడ్మిన్‌) కె.నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని