logo

అంతా అడ్డగోలు

ఒంగోలు ఉప రవాణా కమిషనర్‌ కార్యాలయం(డీటీసీ)లో ప్రైవేటు వ్యక్తుల హవా నడుస్తోంది. సాధారణంగా వాహనాల పత్రాలు, సామర్థ్యాన్ని (ఫిట్‌నెస్‌) మోటారు వాహనాల

Updated : 01 Jul 2022 02:16 IST

ప్రైవేటు కనుసన్నల్లో బస్సుల తనిఖీలు

రవాణా శాఖ కార్యాలయంలో పరిస్థితి

ఒంగోలు డీటీసీలో పత్రాల పరిశీలిస్తున్న ప్రైవేటు వ్యక్తి.. అదే వ్యక్తి బడి బస్సును తనిఖీ చేస్తూ...

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: ఒంగోలు ఉప రవాణా కమిషనర్‌ కార్యాలయం(డీటీసీ)లో ప్రైవేటు వ్యక్తుల హవా నడుస్తోంది. సాధారణంగా వాహనాల పత్రాలు, సామర్థ్యాన్ని (ఫిట్‌నెస్‌) మోటారు వాహనాల ఇన్‌స్పెక్టర్‌(ఎంవీఐ) పరిశీలించాలి. కార్యాలయంలోని కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఆయనకు సహకరిస్తుంటారు. అందుకు భిన్నంగా ఇక్కడ ‘ప్రైవేటు’ వ్యవహారం నడుస్తోంది. జులై 5వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానుండగా పెద్దసంఖ్యలో బడి బస్సులకు సామర్థ్య ధ్రువపత్రాలు(ఎఫ్‌సీ)లు జారీ కాలేదు. దీనిపై జూన్‌ 29న ‘బడి బస్సు.. తనిఖీలకు ముఖం చాటేస్తూ..’ శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. రవాణాశాఖ అధికారులు స్పందించారు. తక్షణం బస్సులకు ఎఫ్‌సీలు తీసుకోకపోతే కఠినంగా వ్యవహరిస్తామని యాజమాన్యాలను హెచ్చరించారు. దీంతో రవాణా శాఖ కార్యాలయాల వద్ద నిత్యం బస్సులు బారులు తీరుతున్నాయి.

ఏం జరుగుతుందంటే..

బడి బస్సుల తనిఖీల విషయంలో అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. నేరుగా ఎంవీఐ వాహనాన్ని పరిశీలించాలి. స్వయంగా నడిపి చూసి సంతృప్తి చెందిన తర్వాతనే ఎఫ్‌సీ మంజూరు చేయాలి. ఒంగోలు డీటీసీలో గురువారం దానికి భిన్నమైన పరిస్థితి.. బీమా పత్రాల పరిశీలనలో ఎంవీఐ నిమగ్నమై ఉంటే ప్రైవేటు వ్యక్తులు బస్సులను తనిఖీ చేస్తున్నారు. అంతా తూతూమంత్రమే. ఈ తరహా తనిఖీలు అక్రమాలకు ఆస్కారం కల్పిస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ట్యాబ్‌ల ద్వారా వాహనం ఫొటోలు తీసి, వాటి వివరాలతో సహా ఎంవీఐలు అప్‌లోడ్‌ చేయాలి. ఆ బాధ్యతలను కానిస్టేబుల్‌/హోంగార్డులు చూస్తున్నారు. ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని