logo

ఎంతెంత దూరం.. ఇంతింత భారం

ఆర్టీసీ మరోసారి పెంచిన బస్సుల ఛార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. డీజిల్‌ సెస్‌ పేరిట రెండున్నర నెలల వ్యవధిలోనే భారం విధించడం పట్ల ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దూర ప్రాంతాలు వెళ్లే పల్లె బస్సులకు గరిష్ఠంగా రూ.20 నుంచి రూ.25, సూపర్‌ లగ్జరీ సర్వీసుల్లో రూ.70

Published : 02 Jul 2022 06:08 IST

ఆర్టీసీ ఛార్జీల పెంపుతో ప్రయాణికుల ఆవేదన

న్యూస్‌టుడే, ఒంగోలు అర్బన్‌

ఆర్టీసీ మరోసారి పెంచిన బస్సుల ఛార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. డీజిల్‌ సెస్‌ పేరిట రెండున్నర నెలల వ్యవధిలోనే భారం విధించడం పట్ల ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దూర ప్రాంతాలు వెళ్లే పల్లె బస్సులకు గరిష్ఠంగా రూ.20 నుంచి రూ.25, సూపర్‌ లగ్జరీ సర్వీసుల్లో రూ.70 నుంచి రూ.80 వరకు పెంపుదల ఉంది. దీంతో పల్లెలతో పాటు పట్టణ ప్రాంతాలకు సైతం వెళ్లేవారికి బాదుడు తప్పడం లేదు. పెంచిన ఛార్జీలతో ప్రతి ప్రయాణికుడిపై రూ.20 నుంచి రూ.150 వరకు భారం పడుతుంది.

ఒంగోలు డిపో పరిధిలో 132 సర్వీసులున్నాయి. వీటిలో హైదరాబాద్‌కు 11, విజయవాడకు 18 నడుస్తున్నాయి. ఒంగోలు నుంచి విజయవాడ సూపర్‌ లగ్జరీ బస్సుకు  గతంలో రూ.240 ఉండగా ఇప్పుడు రూ.260, ఆల్ట్రా డీలక్స్‌లో రూ.220 నుంచి రూ.250, ఏసీ సర్వీసుల్లో రూ.350 నుంచి రూ.380కు పెంచారు.

 ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు సూపర్‌ లగ్జరీ టిక్కెట్‌ గతంలో రూ.520 ఉండగా తాజాగా రూ.80 పెంచి రూ.600గా నిర్ణయించారు. ఏసీ బస్సుకు గతంలో రూ.870 ఉండగా ఇప్పుడు రూ.960 చేశారు. పల్లె బస్సుల్లో సైతం రూ.5 నుంచి రూ.20 వరకు పెంపుదల ఉంది.

మార్కాపురం పరిధిలో..

మార్కాపురం నుంచి హైదరాబాద్‌కు సూపర్‌ లగ్జరీకి గతంలో రూ.450 ఉండగా రూ.70 పెంచి రూ.520 చేశారు. ఇక్కడినుంచి బెంగళూరుకు రూ.740 ఉండగా తాజా పెంపుతో రూ.790 అయింది. విజయవాడకు నిన్నటివరకు రూ.245 ఉన్న టిక్కెట్‌ ఇప్పుడు రూ.275 చేశారు. మార్కాపురం నుంచి ఒంగోలుకు ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు గతంలో రూ.120 ఉండగా గరిష్ఠంగా రూ.15 పెంచుతూ రూ.135గా నిర్ణయించారు. ఈ క్రమంలో ప్రతి డిపో నుంచి ఇదే మాదిరి ఛార్జీల పెంపు ఉంది. కనిగిరి నుంచి హైదరాబాద్‌ సూపర్‌లగ్జరీ బస్సు టిక్కెట్‌ రూ.540 నుంచి రూ.580కి పెరిగింది. ఇంద్ర ఏసీ బస్సుకు రూ.640 ఉండగా శుక్రవారం నుంచి రూ.780. కనిగిరి-విజయవాడ ఎక్స్‌ప్రెస్‌కు కూడా పాత ధర రూ.270 ఉండగా ఇప్పుడు మరో రూ.35 పెంచారు.  

22 శాతం భారం

పెంచిన ఛార్జీలతో ప్రయాణికులపై 22 శాతం అదనపు భారం పడుతుంది. నిత్యం ఆర్టీసీకి రూ.15 లక్షల వరకు అదనంగా ఆదాయం సమకూరనుంది. ఒక్క కనిగిరి డిపో పరిధిలోనే రోజుకు రూ.3 లక్షల వరకు అదనంగా రానుంది.

ఒకే మార్గం.. ఎంతో వైరుధ్యం

పుల్లలచెరువు, న్యూస్‌టుడే: ఒకే మార్గానికి వేర్వేరు డిపోల బస్సులు రెండు రకాల ఛార్జీలు వసూలుచేయడం చర్చనీయాంశమైంది. పుల్లలచెరువు మండలంలోని నాయుడుపాలెం నుంచి యర్రగొండపాలెం 12 కి.మీ. కాగా గురువారం వరకు బస్సు టిక్కెట్‌ రూ.15 ఉండేది. తాజా పెంపుతో దానిని రూ.20 చేశారు.

గుంటురు జిల్లా మాచర్ల డిపోకు చెందిన బస్సు ఈ మార్గంలో శుక్రవారం రూ.20 ఛార్జి తీసుకోగా.. మార్కాపురం డిపో బస్సులో మాత్రం రూ.25 తీసుకున్నారు. ఇప్పటికే పెంపుదలతో ఇబ్బందిపడుతుంటే ఆర్టీసీ సిబ్బంది మళ్లీ ఇలా వ్యత్యాసాలు చూపడం ఏమిటని నాయుడుపాలెం ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేశారు.


పునరాలోచన చేయాలి

పామూరుకు రూ.20 టిక్కెట్‌ ధర ఉండగా రెండున్నర నెలల క్రితం రూ.25 చేశారు. ఇప్పుడు రూ.30 అంటున్నారు. దంపతులు ఇద్దరు పిల్లలతో సి.ఎస్‌.పురం నుంచి పామూరు వచ్చి వెళ్లేందుకు ఛార్జీలు రూ.240 అయ్యాయి. దూరం ప్రయాణాలకు విపరీతంగా పెంచారు. తక్కువ ఛార్జీలతో సురక్షితంగా ప్రయాణం సాగించవచ్చని అనుకుంటాం. ఇప్పుడు భారం పెరుగుతోంది. ప్రభుత్వం పునరాలోచన చేయాలి.

- ముప్పాళ్ల సుబ్బయ్య, సి.ఎస్‌.పురం


ఈ నిర్ణయం సరికాదు

ఇప్పటికే విద్యుత్తు బిల్లులు, పెట్రోల్‌, నూనె, గ్యాస్‌ ధరలు పెరిగి ప్రజలు తల్లడిల్లుతున్నారు. ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచడం భావ్యం కాదు. ఎక్కడాలేని విధంగా ఒక్క ఏడాదిలోనే రెండు దఫాలు పెంచడం ప్రయాణికులకు ఇబ్బందికరం. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులను.. అలాగే విజయవాడ, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో చదివే పిల్లలను కలిసేందుకు ఆర్టీసీలో వెళ్లి రావాలంటే హడలి పోవాల్సి వస్తోంది. 

 - ఫరూఖ్‌, కనిగిరి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని