logo

యంత్రాలిలా.. స్వచ్ఛ జలమెలా!

జిల్లాలోని 38 మండలాల్లో 1791 ప్రాథమిక పాఠశాలలు.. 210 ప్రాథమికోన్నత పాఠశాలలు.. 277 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో రక్షిత మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులు,

Published : 06 Aug 2022 02:20 IST

పాఠశాలల్లో విలువైన యంత్రాలు మూలకు
మార్కాపురం, న్యూస్‌టుడే

జిల్లాలోని 38 మండలాల్లో 1791 ప్రాథమిక పాఠశాలలు.. 210 ప్రాథమికోన్నత పాఠశాలలు.. 277 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రతి పాఠశాలలో రక్షిత మంచినీటి కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇప్పటికే కొన్నిచోట్ల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి గ్రామస్థులు, దాతలను ప్రోత్సహించి సొంతంగా వారి చేత ఏర్పాటుచేయించారు.. వాటిల్లో కొన్ని నిర్వహణ లేక మూలకు చేరాయి. మొదటి విడత నాడు-నేడులో జిల్లాలోని 1034 పాఠశాలల్లో పనులు చేపట్టారు. అందులో భాగంగా విద్యార్థులకు శుద్ధిచేసిన నీటిని అందించేందుకు ఆర్వో ప్లాంట్‌లను ఏర్పాటుచేశారు. విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.75 వేల నుంచి రూ.2.50 లక్షల వరకు ఒక్కో ప్లాంట్‌కు ఖర్చయింది. తద్వారా ఫ్లోరైడ్‌ సమస్య లేకుండా చూడవచ్చని భావించారు. మధ్యాహ్న భోజన సమయంలో వంటకు కూడా ఈ నీళ్లు ఉపయోగపడేవి. అనేకచోట్ల ఏర్పాటుచేసిన ఆరునెలలకే ఆ యంత్రాలు పాడై మూలకు చేరాయి. దీంతో పరిస్థితి మొదటికి వచ్చింది. కొందరు ఇళ్ల నుంచి తెచ్చుకుంటుండగా మరికొన్నిచోట్ల స్థానికంగా లభించే నీటిని మధ్యాహ్న భోజన సమయంలో ఉపయోగించుకుంటున్నారు. వంటకు కూడా అవే వాడాల్సి వస్తుంది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు దాతలను ప్రోత్సహించి స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆర్వో ప్లాంట్ల నుంచి కొనుగోలు చేసి తెచ్చి విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నారు. తక్షణం జిల్లా యంత్రాంగం స్పందించి ఎక్కడెక్కడ సమస్య నెలకొందో అక్కడ మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందిస్తూ వీటిని బాగు చేయించడానికి ప్రభుత్వం ఏపీడబ్ల్యూయూఐడీసీ సంస్థకు అప్పగించిందని.. విడతల వారీగా చర్యలు తీసుకుంటారని తెలిపారు.


మార్కాపురం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలకు ప్రభుత్వం నాడు-నేడు కింద రూ.2.50 లక్షలు వెచ్చించి శుద్ధి జలకేంద్రం(ఆర్వో ప్లాంట్‌) ఏర్పాటుచేసింది. సుమారు 1050 మంది విద్యార్థులకు ఈ జలం ఎంతో ఉపయుక్తంగా ఉండేది. ప్రస్తుతం యంత్రాలు మరమ్మతులకు గురికావడంతో పిల్లలంతా ఇళ్ల నుంచి నీళ్ల సీసాలు తెచ్చుకోవాల్సి వస్తుంది. మరికొంతమంది స్థానికంగా బోరు నీటిని వినియోగిస్తున్నారు.


కొనకనమిట్ల మండలంలోని తువ్వపాడు ప్రాథమిక పాఠశాలలోనూ ఇదే పరిస్థితి. పాఠశాలల నిర్వహణకే నిధులు లేని పరిస్థితుల్లో యంత్రం ఎలా బాగుచేయించాలో తెలియడంలేదు. దీంతో 40 మంది విద్యార్థులకు తాగునీటి సమస్య ఏర్పడింది. ఇదే మండలంలోని కె.నాగంపల్లి బడిలో ప్లాంట్‌ పనిచేయకపోవడంతో అగచాట్లు తప్పడంలేదు. స్థానికంగా ఉన్న బోరు నీటిలో ఫ్లోరైడ్‌ ఉండటంతో ఇళ్ల నుంచి సీసాలతో నీటిని తెచ్చుకుని భోజనాలు చేస్తున్నారు.


ర్లుపాడు మండలంలోని సీతానాగులవరం ప్రాథమిక పాఠశాలలో యంత్రం ఇది. ప్రస్తుతం పనిచేయడంలేదు.


మార్కాపురం మండలంలోని వేములకోట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో శుద్ధి జల యంత్రాలు గతయేడాది కొన్ని నెలలవరకు బాగానే పనిచేశాయి. ప్రస్తుతం అవి మొరాయించాయి. మోటారు పూర్తిగా చెడిపోయింది. బాగుచేస్తేనే ఇక్కడ తాగునీటి సమస్య తీరుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని