logo
Published : 06 Aug 2022 02:20 IST

తరలిపోతున్న తెల్లబంగారం

దోచుకుంటున్న దళారులు ‌

నష్టపోతున్న పత్తి రైతులు

పత్తిని లారీకి లోడు చేస్తున్న కూలీలు

అర్థవీడు, న్యూస్‌టుడే: పశ్చిమ ప్రాంతంలో తెల్ల బంగారం మాయమవుతోంది. పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. వారు చెప్పిన ధరకు ఇచ్చేసి నష్టపోతున్నారు. రైతులకు వరంగా మారాల్సిందల్లా నష్టాలనే మిగుల్చుతోంది. మార్కాపురం సబ్‌ డివిజన్‌ పరిధిలో 10 వేల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. గిద్దలూరు నియోజకవర్గంలోని అర్థవీడు, రాచర్ల, బేస్తవారపేట మండలాల పరిధిలో అధికంగా 5 వేల హెక్టార్లలో సాగైంది. ఇందులో అధికంగా అర్థవీడు మండలంలోని బోగోలు, పాపినేనిపల్లి, మొహిద్దీన్‌పురం, పెద్దకందుకూరు గ్రామాల్లో సుమారు 6 వేల ఎకరాల్లో పండించారు. పత్తి క్వింటా ధర రూ.9500 నుంచి 9700 వరకు చెల్లిస్తూ పల్లెల్లో దళారులు కొనుగోలు చేస్తున్నారు. ఆరుగాలం కష్టపడ్డ అన్నదాతలు నగదు సమకూరుతుందన్న ఆశతో అధిక దిగుబడులతో పాటు ధరలు కలిసి వస్తున్నా దళారులకే అమ్మేస్తున్నారు.

కాటాలో మాయాజాలం :  రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసే దళారులు క్వింటా పత్తి తూకంలో 3 కేజీల వరకు కోత పెడుతూ నిలువునా దోపిడీ చేస్తున్నారు. పత్తిలో ఆకులు, నలుపు రంగు కాస్త కనపడితే మరికొంత తూకంలోకి పత్తిని కాజేస్తున్నారు. అసలే వర్షాలతో పత్తి పాడవుతుందన్న భయాందోళనకు రైతు గురవుతున్నాడు. దళారులు మాత్రం నాణ్యమైన పత్తిని కూడా ఏదో ఒక సమస్య చూపి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.  గత్యంతరం లేక వారుచెప్పిన ధరకే అమ్మాల్సిన దుస్థితి వచ్చింది.  దీంతో ఒక్కో పల్లెలో 5 మందికిపైగా దళారులు తయారై పత్తి రైతులను నిలువునా దోచేస్తున్నారు. వ్యవసాయ అధికారులకు ఈ సమస్య చేరవేసినా కనీసం దళారుల వద్దకు వచ్చి తూకం కాటాలను కూడా తనిఖీలు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. పదేళ్ల క్రితం గిద్దలూరులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ఈ మండలాల నుంచి పత్తిని కొనుగోలు చేశారు. తరువాత కాలంలో పత్తి సాగు లేకపోవడంతో ఆపేశారు. కానీ ఈ ఏడాది సాగుతో పాటు దిగుబడి అమాంతంగా పెరిగింది. ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దళారుల చేతివాటాన్ని అరికట్టాలని రైతులు కోరుతున్నారు.


కూలీ ఎక్కువే.. :  పత్తి తీత పనులకు మార్కాపురం, యర్రగొండపాలెం, కనిగిరి నియోజకవర్గాల పరిధి పల్లెల నుంచి వందల సంఖ్యలో ఆటోల్లో తరలివస్తున్నారు. ఒక్కో కూలీకి దూరాన్ని బట్టి ఆటో బాడుగతో కలిపి రూ.360 నుంచి రూ.480 వరకు ఇస్తున్నారు. ఒక్కో రైతు కనీసం పది ఎకరాలకు తగ్గకుండా పత్తి సాగు చేశారు. ఎకరా పైరులో సుమారు 13 నుంచి 15 క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి వస్తోంది. దీంతో ఎకరాకు పెట్టే పెట్టుబడి ఖర్చు ఎక్కువగా ఉంటోంది. ఆదాయం మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. దీంతో ఈ గ్రామాల నుంచి రోజువారీగా పదుల సంఖ్యలో వందల టన్నుల పత్తిని దళారులు లారీలలో మార్కెట్‌కు తరలిస్తున్నారు. తక్కువకు కొని ఎక్కువ లాభపడుతున్నారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts