logo

చనిపోయామన్నారు.. ఆ పత్రాలివ్వరూ!

‘మేమంతా బతికుండగానే చనిపోయినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మాకు మరణ ధ్రువీకరణ పత్రాలైనా ఇవ్వండి.. పింఛన్లయినా మంజూరు చేయండి’ అంటూ పామూరు మండలం

Updated : 07 Aug 2022 06:02 IST

పింఛను దరఖాస్తుదారుల ఆందోళన

అధికారులపై పోలీసులకు ఫిర్యాదు

అధికారులపై చర్యలు తీసుకోవాలని

ఎస్సై సురేష్‌కు ఫిర్యాదు చేస్తున్న బాధితులు.. చిత్రంలో తెదేపా నాయకులు

పామూరు, న్యూస్‌టుడే: ‘మేమంతా బతికుండగానే చనిపోయినట్లు ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మాకు మరణ ధ్రువీకరణ పత్రాలైనా ఇవ్వండి.. పింఛన్లయినా మంజూరు చేయండి’ అంటూ పామూరు మండలం నర్రమారెళ్ల, చింతలపాలెం, సుబ్బక్కపల్లి, బొట్లగూడూరు తదితర గ్రామాలకు చెందిన పింఛను దరఖాస్తుదారులు డిమాండ్‌ చేశారు. శనివారం తెదేపా నాయకులతో కలిసి స్థానిక శేషమహల్‌ నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు పత్రాలు పట్టుకొని ప్రదర్శనగా వెళ్లారు. బాధ్యులైన అధికారులపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలంటూ ఎస్సై కె.సురేష్‌కు ఫిర్యాదుచేశారు. మండల పరిషత్తు కార్యాలయానికి చేరుకుని రహదారిపై బైటాయించి ఆందోళన చేపట్టారు. సామాజిక భద్రత పింఛన్లు పొందేందుకు తమకు అన్ని అర్హతలు ఉన్నాయని.. అవి మంజూరై నంబర్లు కూడా వచ్చాయన్నారు. తెదేపా సానుభూతిపరులమైన తమకి నగదు రాకుండా చేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నించారన్నారు. తాము చనిపోయినట్లు అధికారుల ద్వారా ఆన్‌లైన్‌లో తప్పులు నమోదుచేసి పైలోకానికి పంపారన్నారు. కూలి పనులు, డప్పులు కొట్టుకుని జీవిస్తున్నామని..ఇలా అన్యాయం చేయడం తగదని మరికొందరు పేద ఎస్సీ దరఖాస్తుదారులు వాపోయారు. అధికారులు లేకపోవడంతో కార్యాలయ గది గోడకు ఫిర్యాదును అతికించారు. మాజీ జడ్పీటీసీ సభ్యులు బొల్లా మాల్యాద్రి చౌదరి, ఎం.హుస్సేన్‌రావు మాట్లాడుతూ మండలంలో 36 మంది దరఖాస్తుదారులు మృతిచెందినట్లు నమోదు చేయడం దారుణమన్నారు. ఉన్నతాధికారులు విచారణ చేసి చర్యలు తీసుకోవాలన్నారు. మండల ఎస్సీ సెల్‌, తెలుగురైతు అధ్యక్షులు డోలా శేషాద్రి, మన్నం రమణయ్య, నాయకులు పి.రామారావు, జి.శ్రీను, యు.హరిబాబు, పి.వెంకటేశ్వర్లు, కె.సుభాషిణి, ఎస్‌.మోషే, ఎం.రామకృష్ణ, కె.రాము తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని