logo

రామతీర్థాన్ని గాలికొదిలేశారు!

లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీరుస్తూ, ఒంగోలు వరప్రసాదినిగా పేరొందిన రామతీర్థం జలాశయం...

Published : 08 Aug 2022 01:47 IST

నీటితో ఉన్న జలాశయం (పాతచిత్రం)

లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీరుస్తూ, ఒంగోలు వరప్రసాదినిగా పేరొందిన రామతీర్థం జలాశయం... అధికారులు, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగా అనాథలా మిగిలింది. కొద్దిపాటి విద్యుత్తు బిల్లులు చెల్లించక... ఏళ్లుగా సరఫరా నిలిచిపోయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద ప్రాజెక్టు వద్ద కాపలా సిబ్బంది ఒక్కరూ లేకపోవడం గమనార్హం.    - న్యూస్‌టుడే, చీమకుర్తి

ఎటు చూసినా సమస్యలే...
* సుమారు రూ.రెండు లక్షల బిల్లు బకాయిలు ఉండడంతో... ఆరేళ్ల క్రితమే రామతీర్థానికి విద్యుత్తు సరఫరా నిలిపేశారు. నేటికీ పునరుద్ధరణ దిశగా ఎటువంటి చర్యలూ లేవు. దీంతో కట్టలపై ఉన్న దీపాలు అలంకారప్రాయంగా మారాయి. గేట్లను సైతం మాన్యువల్‌గా నిర్వహించాల్సి వస్తోంది. ప్రస్తుతం జలాశయంలో చేపల పెంపకం ద్వారా ఏటా రూ.ఆరేడు లక్షల ఆదాయం వస్తున్నా... ఈ మొత్తమంతా మత్స్యశాఖ ఖాతాలోకి వెళ్తోంది.
* అప్పట్లో నిర్మించిన ఫైలాన్‌ బీటలు వారుతోంది. కట్టలపై ఏర్పాటు చేసిన రక్షణ గోడలు బీటలు వారుతున్నాయి. కనీస నిర్వహణ లేక ఏపుగా పెరిగిన చిల్లచెట్లతో కట్టలు, జలాశయం పరిసరాలు చిట్టడవిని తలపిస్తున్నాయి.‌్ర అవుట్‌ ఫాల్‌ రెగ్యులేటర్‌ గేట్ల అమరిక సరిగా లేక... ప్రాజెక్టు ప్రారంభం నుంచీ నీరు లీకవుతోంది. ఏళ్లుగా సమస్య కొనసాగుతున్నా... పైపై మరమ్మతులే తప్ప శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు లేవు. ప్రస్తుతం లీకేజీల రూపంలో క్యూసెక్కుల కొద్దీ నీరు వృథాగా పోతోంది.
* ప్రాజెక్టు పరిధిలో రూ.లక్షల విలువైన మోటార్లు, ఇతర పరికరాలు, సామగ్రి ఉన్నా కనీస రక్షణ లేదు. గతంలో వంతుల వారీగా లస్కర్లు కాపలా విధులు నిర్వహించే వారు. ప్రస్తుతం ఆ ఊసే లేకుండా పోయింది.

నిధులు కేటాయించినా నీరసమే...
రామతీర్థంలో నెలకొన్న సమస్యలపై ‘ఈనాడు’లో వరుసగా కథనాలు ప్రచురితం కావడంతో జిల్లా అధికారులు స్పందించారు. ప్రజా ప్రతినిధులతో చర్చించి... మరమ్మతు పనుల కోసం చీమకుర్తి మండల పరిషత్‌ ద్వారా రూ.18 లక్షల నిధులు మంజూరు చేయించారు. కట్టల అభివృద్ధికి రూ.15 లక్షలు, గేట్ల లీకేజీలను అరికట్టేందుకు రూ.3 లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు. వెంటనే పనులు ప్రారంభించాలని... గత నెలలో రిజర్వాయర్‌ సందర్శనకు వచ్చిన జలవనరుల శాఖ అధికారులు ఆదేశించినా నేటికీ అతీగతీ లేదు. నిధులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో వెంటనే పనులు ప్రారంభిస్తే... కొంతమేరకైనా రామతీర్థం పూర్వ వైభవం సంతరించుకునే అవకాశం ఉంది.
కొండల నడుమ కొలువుదీరిన విశాలమైన జలాశయం. సమీపంలోనే దక్షిణ కాశీగా వినుతికెక్కిన పుణ్య క్షేత్రం. చుట్టూ విస్తరించిన గెలాక్సీ గ్రానైట్‌ గనులు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు అన్ని వసతులు ఉన్నా... ఆ దిశగా కనీస చర్యలు లేవు.
ఒంగోలు బ్రాంచి కాలువ ద్వారా వచ్చే నీటితో జలాశయం నింపడం... ఆ తరువాత దిగువకు విడుదల చేయడం వరకే యంత్రాంగం పరిమితం అవుతోంది తప్ప... ప్రాజెక్టు ఆలనా పాలనా తమ బాధ్యత కాదన్నట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

బీటలు వారిన రక్షణ గోడ

ప్రాజెక్టు: మాగుంట సుబ్బరామిరెడ్డి రామతీర్థం రిజర్వాయర్‌
మొత్తం నిర్మాణ వ్యయం: రూ.55 కోట్లు
జాతికి అంకితం చేసింది: ఫిబ్రవరి 25, 2009
సామర్థ్యం: 1.514 టీఎంసీలు

లక్ష్యం: ఒంగోలు బ్రాంచి కాలువ చివరి ఉన్న లక్ష ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ. ఒంగోలు నగరం, చీమకుర్తి, కందుకూరు పట్టణాలు, ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాలకు తాగునీటి సరఫరా (ప్రస్తుతం... కనిగిరి పట్టణం, నియోజకవర్గంలోని పలు ఊళ్లకు, తాళ్లూరు, దర్శి మండలాల్లోని వివిధ గ్రామాలకు కూడా పథకం ద్వారా తాగునీరందిస్తున్నారు)

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts