logo

మృత్యుపాశానికి చిక్కిన బంధం

వారంతా ఎంతో ఉత్సాహంగా తిరుమలకు బయలుదేరారు. మనవడు కారు నడుపుతుండగా తాతయ్యతో పాటు అమ్మమ్మ, ఆమె చెల్లెల్లిద్దరూ వెనుక కూర్చొన్నారు. ఇంతలోనే ప్రమాద రూపంలో విధి వెంటాడింది. ఆ అయిదుగురూ అక్కడికక్కడే దుర్మరణం చెందడంతో బంధువులంతా తల్లడిల్లారు. ఆసుపత్రికి చేరుకొని తీవ్రంగా విలపించారు. కంభం పట్టణంలోని డెయిరీకి కూతవేటు దూరంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

Published : 09 Aug 2022 01:43 IST

ప్రమాదంలో అయిదుగురి దుర్మరణంతో విషాదం

ఒకేసారి ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు

కంభం, న్యూస్‌టుడే

కంభం వైద్యశాల వద్ద కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న నాగిరెడ్డి తల్లి, బంధువులు

వారంతా ఎంతో ఉత్సాహంగా తిరుమలకు బయలుదేరారు. మనవడు కారు నడుపుతుండగా తాతయ్యతో పాటు అమ్మమ్మ, ఆమె చెల్లెల్లిద్దరూ వెనుక కూర్చొన్నారు. ఇంతలోనే ప్రమాద రూపంలో విధి వెంటాడింది. ఆ అయిదుగురూ అక్కడికక్కడే దుర్మరణం చెందడంతో బంధువులంతా తల్లడిల్లారు. ఆసుపత్రికి చేరుకొని తీవ్రంగా విలపించారు. కంభం పట్టణంలోని డెయిరీకి కూతవేటు దూరంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనతో ఆయా కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

ల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు కంభం వద్ద ముందు వెళ్తున్న సిమెంటు లారీని ఢీకొట్టింది. కన్నుమూసి తెరిచేలోగా కారులో ఉన్న జూలకంటి నాగిరెడ్డి (23), చిలకల పెద్ద హనిమిరెడ్డి (70), చిలకల ఆదిలక్ష్మి (60), భూమిరెడ్డి గురవమ్మ (55), పల్లె అనంతరాములు (50) ప్రాణాలు విడిచారు. సమాచారం అందినవెంటనే కంభం సీఐ రాజేష్‌కుమార్‌, ఎస్సై నాగమల్లేశ్వరరావు, సిబ్బంది చేరుకొన్నారు. కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జయి మృతదేహాలు దాంట్లోనే ఇరుక్కుపోయాయి. ట్రాక్టర్‌ సహాయంతో కారు భాగాలను తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. పలు ప్రైవేటు వాహనాల్లో కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అదే గ్రామం నుంచి మరో వాహనంలో తిరుమలకు వెళ్తున్న వీరి బంధువులు తొమ్మిదిమంది అప్పటికే చాలా దూరం ముందుకు వెళ్లిపోయారు. అందులో నాగిరెడ్డి తల్లిదండ్రులు హనిమిరెడ్డి, గురవమ్మతో పాటు అన్న శ్రీనివాసరెడ్డి ఉన్నారు. పోలీసులు అందించిన సమాచారం తెలుసుకొని వెనక్కి వచ్చారు. జరిగిన ఘోరాన్ని చూసి విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను పోలీసులు అప్పగించారు. మృతి చెందిన పెద్దహనిమిరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు కాగా నాగిరెడ్డి వీరి మనవడు. గురవమ్మ, అనంతరాములు ఆదిలక్ష్మి తోడబుట్టినవారు. అంతా వ్యవసాయ కుటుంబాలకు చెందినవారే.

లారీని ఢీ కొని నుజ్జునుజ్జు అయిన కారు

ఎన్నో కలలతో వెళ్లి..
జూలకంటి నాగిరెడ్డి గుంటూరులో బీటెక్‌ చదివారు. పదినెలల క్రితమే ఎంఎస్‌ చేసేందుకు లండన్‌ వెళ్లిన ఆయన ఇటీవలే స్వగ్రామానికి వచ్చారు. తిరుమల వెళ్లడం కోసమని బంధువుల కారును తీసుకొన్నారు. తానే స్వయంగా నడుపుతున్నాడు. కొద్దిరోజుల్లో తిరిగి లండన్‌ వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇతని సొంతూరు వెల్దుర్తి కాగా పదేళ్ల క్రితం తల్లిదండ్రులు హనిమిరెడ్డి, గురవమ్మ కుటుంబంతో సహా శిరిగిరిపాడు వచ్చారు. ఇక్కడే కొంత పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. నాగిరెడ్డి విదేశాల్లో చదివి మంచి ఉద్యోగం చేస్తాడనే ఉద్దేశంతో సుమారు రూ. 18 లక్షల మేర అప్పు చేసి పంపించారు. వారి కల నెరవేరనే లేదు. తండ్రి హనిమిరెడ్డి కొంతకాలం క్రితం కిందపడడంతో కాలువిరిగింది. అన్న శ్రీనివాసరెడ్డి డిగ్రీ చదివాడు.

తోబుట్టువులంతా ఒకే వాహనంలో వెళ్లాలని..
ప్రమాదంలో మృతి చెందిన భూమిరెడ్డి గురవమ్మకు కుమారులు లింగారెడ్డి, నాగిరెడ్డి, కుమార్తె నాగమణి సంతానం. వీరందరికీ వివాహాలయ్యాయి. తన తల్లితో పాటు ఆమె అక్క, చెల్లి ఒకే కారులో ప్రయాణిస్తే బాగుంటుందన్న వెళ్లారని.. ముగ్గురూ చనిపోయారని కుమారుడు విలపించారు. తిరుపతి నుంచి తిరుమలకు మెట్లు ఎక్కలేననే ఉద్దేశంతో తన తల్లి తొలుత ప్రయాణం మానుకోవాలనుకున్నారని.. కారులోనే వెళ్దామని చెప్పడంతో ఆమె బయలుదేరారన్నారు.

తిరిగి వచ్చి వైద్యం చేయించుకుందామని..
అనంతరాములు స్వస్థలం పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేవిడిచర్ల. ఆమెకు భర్త పున్నారెడ్డి, కుమార్తె అరుణ ఉన్నారు. కంటికి శుక్లాలు రావడంతో నరసరావుపేటలో ఆమె వైద్యం చేయించుకోవాలనుకున్నారు. తిరుమలకు వెళ్లి వచ్చిన తర్వాత చేసుకోవచ్చని వాయిదా వేశారని.. ఇంతలోనే ఆమె మృత్యువుకు చిక్కారని కుటుంబ సభ్యులు తెలిపారు.

తండ్రి సేద్యానికి వెళ్లలేడని..
మృతిచెందిన పెద్దహనిమిరెడ్డి, ఆదిలక్ష్మి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, కుమారుడు అంజిరెడ్డి ఉన్నారు. మూడెకరాల పొలం సాగు చేసుకుంటున్నారు. వీరి పెద్ద కుమార్తె గురవమ్మ కుమారుడే నాగిరెడ్డి. తొలుత అంజిరెడ్డి తిరుమల వెళ్లాలనుకున్నారు. సేద్యం పనులు ఉన్నందున పెద్దహనిమిరెడ్డిని పంపించినట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని