logo

ధీశాలి.. టంగుటూరి

బ్రిటిష్‌ పాలనలో ఉన్న భారతీయుల బానిస సంకెళ్లను తెంచడానికి స్వాతంత్య్ర సమరంలో చురుకైన పాత్రను పోషించిన మహనీయుడు ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు. జిల్లాలో ఆయన అడుగుజాడలెన్నో. ప్రస్తుతం దేశమంతా ఆజాదీ కా అమృత మహోత్సవం నిర్వహిస్తున్న వేళ ఆ ధీశాలి గురించి ఒక్కసారి అవలోకిస్తే..

Published : 09 Aug 2022 01:43 IST

బ్రిటిష్‌ పాలనలో ఉన్న భారతీయుల బానిస సంకెళ్లను తెంచడానికి స్వాతంత్య్ర సమరంలో చురుకైన పాత్రను పోషించిన మహనీయుడు ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు. జిల్లాలో ఆయన అడుగుజాడలెన్నో. ప్రస్తుతం దేశమంతా ఆజాదీ కా అమృత మహోత్సవం నిర్వహిస్తున్న వేళ ఆ ధీశాలి గురించి ఒక్కసారి అవలోకిస్తే..

నాగులుప్పలపాడు, న్యూస్‌టుడే: నాగులుప్పలపాడు మండలం వినోదరాయునిపాలెం టంగుటూరి స్వస్థలం. వెంకటనరసింహులు, సుబ్బమ్మ దంపతులకు 1872 ఆగస్టు 23న ఆయన జన్మించారు. ఆరుగురు సంతానంలో ఒకరు. ఆయన పదకొండో ఏట తండ్రి మరణించడంతో కుటుంబం ఒంగోలుకు చేరింది. అక్కడ భోజనశాలను కొంతకాలం నడిపారు. తల్లి సంసాదన సరిపోక ధనికుల ఇళ్లలో ప్రకాశం వారాలు చేసి ఒంగోలు సమీపంలోని వళ్లూరులో ప్రాథమిక విద్య అభ్యసించారు. మిషన్‌ పాఠశాల ఉపాధ్యాయుడైన ఇమ్మానేని హనుమంతరావు నాయుడు చొరవతో ఉచితంగా మెట్రిక్‌ చదివారు.. అనంతరం రాజమండ్రిలో ఎఫ్‌ఏ, మద్రాసులో న్యాయశాస్త్రం చదివారు. కొంతకాలం ఒంగోలు, రాజమండ్రిలో న్యాయవృత్తి చేసి పేరు సాధించారు. రాజమండ్రిలో ఆయన పురపాలక సంఘం అధ్యక్షులుగా కూడా పనిచేశారు. మద్రాస్‌ హైకోర్టులో వాదించడానికి అవకాశం లేకపోవడంతో 1904లో ఇంగ్లాండ్‌ వెళ్లి బారిస్టర్‌ను పూర్తి చేసి 1907లో భారత్‌కు వచ్చి న్యాయవాద వృత్తి కొనసాగించారు.

ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం పంతులు

తుపాకీకి ఎదురొడ్డి..
తెలుగు, తమిళం, ఆంగ్ల భాషలలో స్వరాజ్య పత్రికకు సంపాదకత్వ బాధ్యతలను టంగుటూరి నిర్వహించారు. 1921 అక్టోబర్‌లో సత్యాగ్రహ ప్రతినపై సంతకం చేశారు. న్యాయవాది వృత్తిని వదిలి స్వాతంత్య్ర పోరాటంలోకి అడుగు పెట్టారు. తన జీవితాన్ని ప్రజా సేవకు అంకితం చేశారు. యావదాస్తిని ప్రజలకు రాసిచ్చారు. స్వరాజ్య పోరాటంలో 1928లో సైమన్‌ కమిషన్‌కు ఎదురుతిరిగారు. తెల్లవారి తుపాకీకి తన గుండెను ఎదురొడ్డిన ధైర్యశాలి. గాంధీజీ పిలుపు మేరకు ఒంగోలు మండలం దేవరంపాడు శివారు గుండ్లకమ్మ నది ఒడ్డున ఉప్పు సత్యాగ్రహాన్ని చేపట్టారు. ఇక్కడ 1935 నవంబరు 21న అప్పటి ఏఐసీసీ అధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్‌ విజయ స్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గాంధీజీ నుంచి ప్రకాశం పంతులుకు వచ్చిన అభినందన లేఖ ఇప్పటికీ దేవరంపాడు గ్రంథాలయంలో ఉంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగానూ 1953 అక్టోబరులో ఎన్నికయ్యారు. 13 నెలల తర్వాత 1954లో రాజీనామా చేశారు. 1957 మే 20న ఆయన చనిపోయారు. దేవరంపాడులో వసతి ఏర్పాటు చేసుకొని తన చివరి మజిలీ ఎక్కువగా విజయ స్థూపం వద్దనే ప్రకాశం పంతులు గడిపారని చెబుతారు. జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్‌ 5న అప్పటి వరకూ ఉన్న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా పేరు మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని పండుగగా నిర్వహిస్తోంది. 150వ జయంతి వేడుకలను వినోదరాయునిపాలెంలో ఈ నెల 23న ఘనంగా నిర్వహించనున్నారు.

తన కుమారులు నరసింహం, హనుమంతరావు, మనవడితో నాటి చిత్రం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని