logo

ఆశల సాగరం.. కాలువలు దుర్భరం

నాగార్జునసాగర్‌ జలాశయం నిండింది. సాగర్‌ కుడికాలువ కింద సాగుచేసే పంటలకు ఈ నెల 15 నుంచి నీరు విడుదల చేస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది పక్షం రోజుల ముందుగానే జలాలు వస్తున్నాయి. ఎన్నెస్పీ కాలువల దుస్థితి మాత్రం మారలేదు. మూడేళ్లుగా నిధులు లేక నిర్వహణ పనులు అటకెక్కాయి. చివరి ఆయకట్టుకు

Published : 10 Aug 2022 03:23 IST

ఏళ్లుగా నిర్వహణ లేక అవస్థలు

దెబ్బతిన్న తూములు, కరకట్టలు, గట్లు

- ఈనాడు డిజిటల్‌, ఒంగోలు

తూము డ్రాపు పగిలిపోయిన మేడపి కాలువ

నాగార్జునసాగర్‌ జలాశయం నిండింది. సాగర్‌ కుడికాలువ కింద సాగుచేసే పంటలకు ఈ నెల 15 నుంచి నీరు విడుదల చేస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఈ ఏడాది పక్షం రోజుల ముందుగానే జలాలు వస్తున్నాయి. ఎన్నెస్పీ కాలువల దుస్థితి మాత్రం మారలేదు. మూడేళ్లుగా నిధులు లేక నిర్వహణ పనులు అటకెక్కాయి. చివరి ఆయకట్టుకు నీళ్లు రాని పరిస్థితి. కరకట్టలు, గట్లు, తూములు దెబ్బతిన్నాయి. చిల్ల చెట్లు పెరిగిపోయాయి. విలువైన జలాలు అనేకచోట్ల వృథాగా పోవాల్సిన పరిస్థితి. కనీస నిర్వహణ పనులూ కానరావడంలేదు. ఎక్కడెక్కడ కాలువల పరిస్థితి ఎలా ఉందో ‘న్యూస్‌టుడే’ బృందాలు పరిశీలించాయి.

ప్రకాశం-గుంటూరు జిల్లాల సరిహద్దు 85/3వ మైలు నుంచి ప్రధాన కాలువ...అద్దంకి, దర్శి, పమిడిపాడు, ఒంగోలు, యద్దనపూడి బ్రాంచి కాలువలున్నాయి. వాటి పరిధిలోని 1,170 మైళ్ల మేర 4.30 లక్షల ఎకరాలకు సాగర్‌ నీరందాల్సి ఉంది. ప్రస్తుతం మన జిల్లాలో 5 నియోజకవర్గాల పరిధిలోని 14 మండలాల్లో 2.54 లక్షల ఎకరాలకు సాగర్‌ నీరు రానుంది.. ప్రధాన కాలువతో పాటు బ్రాంచి కాలువలు, మేజర్‌, మైనర్‌ కాలువలు అధ్వానంగా మారాయి. కొన్ని చోట్ల లైనింగ్‌ దెబ్బతింది. మరమ్మతులకు ఏటా ప్రతిపాదనలు పంపుతున్నా నిధులు మంజూరు కావడం లేదు. కాలువలను ఆధునికీకరించి అయిదేళ్ల పైనే అయింది. చెట్లు పెరగడంతో అడవిని తలపిస్తున్నాయి. అప్పట్లో కొన్నిచోట్ల పనులు నాసిరకంగా జరగడంతో కాంక్రీటు కూడా దెబ్బతింది..కురిచేడు నుంచి దర్శి వరకు ఉన్న డీబీసీ కాలువ పరిధిలో ముండ్లమూరు, తాళ్లూరు, దర్శి మండలాల్లో నీరందించే రజానగరం మేజరుతో పాటు, 3 వేల ఎకరాలకు ఉపకరించే వీరాయపాలెం, దర్శి పంట కాలువల్లో అడవిని తలపించేలా చెట్లు పెరిగాయి.


దాదాపు 18 వేల ఎకరాల సాగుదల కలిగిన నిప్పట్లపాడు మేజరు కూడా పలుచోట్ల చెట్లతో మూసుకుపోయింది. ఓబీసీ ప్రధాన కాలువకు ఇరువైపులా లాకుల వద్ద గట్టు కోతకు గురయింది.


12 కాలువలు..  కానరావు పనులు

పిచ్చి చెట్లు పెరిగిన మేడపి మైనర్‌ కాలువ

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: త్రిపురాంతకం ఎన్నెస్పీ సబ్‌ డివిజన్‌లోని 12 మేజరు కాలువల పరిధిలో 40 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కొన్నేళ్ల క్రితం రూ.100 కోట్లతో ప్రధాన కుడి కాలువ, రూ.10 కోట్లతో మేజర్‌, మైనర్‌ కాలువలను ఆధునికీకరించారు. అనంతరం నిర్వహణ లేదు.. సిమెంటు కాంక్రీటు లైనింగ్‌ దెబ్బతిని కాలువలు ఛిద్రమై చివరి ఆయకట్టుకు నీరు అందడంలేదు.

మిరియంపల్లి మేజర్‌ కాలువ దిగువ రైతులదీ అదే పరిస్థితి.

* ముడివేముల మేజర్‌ కాలువ కరకట్టలు లోపలి వైపు చెట్లు పెరిగి కాలువ మూసుకుపోయింది. డీవీఎన్‌ కాలనీ దాటి దిగువకు చుక్క నీరూ వెళ్లడంలేదు.

సోమేపల్లి మేజర్‌ కాలువకు నీరందించే ప్రధాన కాలువ తూము వద్ద నుంచి అడవి గడ్డి విపరీతంగా పెరిగి జలం వృథాగా పోతూ దిగువకు చేరడంలేదు. ప్రధాన కాలువ వద్ద సోమేపల్లి చెరువుకు నీరు వెళ్లేందుకు గండి కొట్టి అక్రమంగా తూము ఏర్పాటుచేసినా పట్టించుకునేవారు కరవు.


రెగ్యులేటర్లు  పనిచేయవు

పూర్తిగా దెబ్బతిన్న ఎన్నెస్పీ గేట్ల వద్ద దిమ్మెలు

రామతీర్థం రిజర్వాయరు నుంచి ఒంగోలుకు ఓబీసీ కాలువ ద్వారా నీరు ప్రవహిస్తుంది. 36వ మైలు రాయి నుంచి 43వ మైలురాయి వరకు చీమకుర్తి డివిజన్‌..43.67 నుంచి 53 వరకు సంతనూతలపాడు డివిజన్‌ వరకు ఈ కాలువ ప్రవహిస్తుంది. ఉప కాలువలుగా కరవది, కారుమంచి, మైలవరం, చీమకుర్తి-1, చీమకుర్తి-2, మువ్వవారిపాలెం, చిలకపాడు, పి.గుడిపాడు, కొప్పోలు, ఈతమొక్కల, త్రోవగుంట ఉన్నాయి. ఓబీసీ కాలువ 1980లో నిర్మించడంతో ప్రస్తుతం శిథిలమైంది. రెగ్యులేటర్లు ఉన్న ప్రదేశాల వద్ద దిమ్మెలు పగిలిపోయాయి. ఇనుప గేట్లు పనిచేయడం లేదు. కాలువ కట్టలు కనీసం నడిచేందుకు కూడా వీలు కావడం లేదు. చీమకుర్తి-సంతనూతలపాడు డివిజన్‌ వరకు 10-15 తూములున్నాయి. నీరు వదిలిన ప్రతిసారి వీటి నుంచి వృథాగా పోతుంది. మరోవైపు రామతీర్థం రిజర్వాయరు పరిధిలో సుమారు లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగరు నీరివ్వాల్సి ఉంది. ఉప మేజర్‌ కాలువల పరిధిలో చివరి భూములకు వెళ్లడంలేదు. చెరువులను సైతం నింపడంలేదు.  

- న్యూస్‌టుడే, సంతనూతలపాడు


దర్శి కాలువ..  గట్లు చూడలేం

సాగర్‌ ప్రధాన కాలువపై వంతెన శిథిలావస్థకు చేరడంతో బయటపడ్డ ఇనుప చువ్వలు

దర్శి బ్రాంచి ప్రధాన కాలువ పరిధిలోని రజానగరం మేజరు, ముండ్లమూరు మండలంలో పంట పొలాలకు నీరందించే కాలువలు పిచ్చి మొక్కలతో ఉన్నాయి. ఓబీసీ పరిధిలో కాలువకు ఇరువైపులా నిర్మించిన గట్టు శిథిలావస్థకు చేరి కోతకు గురవుతుంది. ఎటుచూసినా లీకులే. కాలువ చివర భూములున్న త్రిపురసుందరీపురం, ఉయ్యాలవాడ గ్రామాల రైతులు ఇబ్బందిపడుతున్నారు. తాళ్లూరు మండల పరిధిలోని దాదాపు ఏడెనిమిది గ్రామాలకు నీరు రావడంలేదు. రెడ్డిసాగరు వద్ద విడిపోతున్న కరవది మేజరు కాలువ అధ్వానంగా ఉంది. ప్రధాన కాలువలో శివరాంపురం వద్ద చిల్లకంప, తుమ్మచెట్లు పెరిగి కిందకు నీరు సరఫరా కావడంలేదు.  

- న్యూస్‌టుడే, దర్శి, తాళ్లూరు


పేరాయపాలెం, కొత్తపాలెం, శివరాంపురం తదితర కాలువల పరిధిలో దాదాపు 40 వేల ఎకరాలున్నా సగం భూములకూ నీరందడం లేదు.


నువ్వు పంట దెబ్బతింది

కాలువలకు సత్వరం మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. గతేడాది రైతుల విన్నపం మేరకు ఆరుతడి పంటలకు నీటిని విడుదల చేసినా కాలువల చివరకు నీరు రాక ఎన్నో ఇబ్బందుల పాలయ్యాం. మేము సాగు చేసిన నువ్వు పంట దెబ్బతింది.

-ఐ.సుబ్బారెడ్డి, రైతు, తాళ్లూరు


బాగుచేస్తేనే దిగువకు నీరు

ముడివేముల మేజర్‌ కాలువ పరిధిలో రెండెకరాల్లో సాగు చేస్తున్నా. ఒడ్డుపాలెం కాలువ పిచ్చి కంపతో ఉంది. కరకట్టలు దెబ్బతిన్నాయి. ఈ సారైనా మరమ్మతులు చేసి దిగువ ఆయకట్టుకు నీరందించాలి.

-గద్దె నర్సయ్య, రైతు, పాపన్నపాలెం, త్రిపురాంతకం మండలం


యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు

ఎన్‌ఎస్పీ చివరి ఆయకట్టు భూములకూ నీరందేలా ఈసారి ప్రణాళిక రచించాం. లీకులు, వృథాను దృష్టిలో పెట్టుకుని 3 టీఎంసీలు అదనంగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు జరుగుతాయి. కేటాయించిన నీటిని క్రమపద్ధతిలో వినియోగించడానికి అనువుగా ఇబ్బంది లేకుండా చూస్తాం.

-ఏఎస్‌ దినేష్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts