logo

Prakasam news : గిద్దలూరు వైకాపాలో అంతర్గత విభేదాలు!

గిద్దలూరు నియోజకవర్గ వైకాపా రాజకీయాలు హైదరాబాద్‌కు చేరాయి. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అన్నా రాంబాబు బేస్తవారపేట మండలం జేబీకేపురంలో ప్రారంభించి ఆ తర్వాత నిర్వహించలేదు. అధిష్ఠానం జోక్యం చేసుకుని ఆయనతో మాట్లాడాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించినట్లు

Updated : 10 Aug 2022 09:50 IST

ఎమ్మెల్యే, నాయకులతో సమావేశమైన బాలినేని

నాయకులతో చర్చిస్తున్న మాజీ మంత్రి బాలినేని.. చిత్రంలో ఎమ్మెల్యే రాంబాబు

గిద్దలూరు పట్టణం, న్యూస్‌టుడే: గిద్దలూరు నియోజకవర్గ వైకాపా రాజకీయాలు హైదరాబాద్‌కు చేరాయి. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అన్నా రాంబాబు బేస్తవారపేట మండలం జేబీకేపురంలో ప్రారంభించి ఆ తర్వాత నిర్వహించలేదు. అధిష్ఠానం జోక్యం చేసుకుని ఆయనతో మాట్లాడాలని పార్టీ ముఖ్య నేతలకు సూచించినట్లు సమాచారం. ఇటీవల మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే.. తాను ఓ సామాజిక వర్గానికి వ్యతిరేకినంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని..అలాగే పార్టీలోని అంతర్గత విభేదాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, పలువురు ముఖ్యనేతలు తనను కలవాలంటూ బాలినేని నుంచి సమాచారం అందడంతో మంగళవారం హైదరాబాద్‌ వెళ్లారు. కె.రమణారెడ్డి (కొమరోలు), చేగిరెడ్డి లింగారెడ్డి (కంభం), సారె వెంకటనాయుడు(కొమరోలు జడ్పీటీసీ), కె.వంశీధర్‌రెడ్డి (గిద్దలూరు మాజీ ఎంపీపీ), బి.మధుసూదన్‌యాదవ్‌(గిద్దలూరు జడ్పీటీసీ), పి.వెంకటసుబ్బయ్య (నగర పంచాయతీ ఛైర్మన్‌), హోసూరారెడ్డి (బేస్తవారపేట ఎంపీపీ), పగడాల శ్రీరంగం(రాచర్ల జడ్పీటీసీ)తో పాటు అర్థవీడు, కంభం ప్రాంతాల నేతలతో బాలినేని సమావేశమయ్యారు. గడప గడపకు కార్యక్రమానికి సహకరించాలని సూచించగా తాము సిద్ధమేనని వారు తెలియజేసినట్లు సమాచారం. రాత్రి ఎమ్మెల్యేతో కలిసి నాయకులతో విడివిడిగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యే అనుకూల, వ్యతిరేక వర్గీయులు ఆరోపణలు చేసుకున్నట్లు సమాచారం. రాచర్ల నాయకుడు ఓ మాజీ జడ్పీటీసీని ఉద్దేశించి ఒంగోలులో ఉంటూ రాజకీయం చేస్తున్నావని విమర్శించినట్లు తెలిసింది. తనకు అనుమతి ఉన్న చెరువులో మట్టి ఎలా తోలుకున్నావంటూ ఆ సభ్యుడు ప్రశ్నించగా.. నీ వల్లే రూ.12 లక్షల నష్టం వచ్చిందని ఇటునుంచి సమాధానం వచ్చింది. తమకు అధికారులు పలకడం లేదని ఎమ్మెల్యేకు తెలియజేస్తే కలెక్టరుకు ఫిర్యాదు చేసుకోవాలని సమాధానం ఇస్తున్నారని మరో నాయకుడు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని