logo
Updated : 12 Aug 2022 02:18 IST

పశువుల మూతి కట్టి.. నేతలే మేసి..

అక్రమార్కుల చెరలో ప్రభుత్వ భూములు
ఆన్‌లైన్‌లో పట్టాలు చూపుతూ అమ్మకాలు

కనిగిరి మండలం ఎన్‌.గొల్లపల్లి చెరువును ఆక్రమించి చుట్టూ ఏర్పాటు చేసిన కంచె

కనిగిరి, వెలిగండ్ల, న్యూస్‌టుడే: జిల్లాలో ప్రభుత్వ భూములు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో కనిగిరి ఒకటి. వెలిగండ్ల, కనిగిరి, పామూరు మండలాల్లోని రూ. కోట్ల విలువజేసే భూములు ప్రస్తుతం చాలా వరకు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయి. కొందరు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని ఆన్‌లైన్‌లో తమ పేరుతో ఎక్కించుకుంటున్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి ఆక్రమించిన భూములకు కంచెలు వేసి కుదిరితే పంటలు సాగు చేస్తున్నారు. లేదంటే ఆన్‌లైన్‌లో నమోదైన వివరాలను చూపుతూ ఇతరులకు విక్రయిస్తున్నారు. ఈ తరహా పరిస్థితులు కనిగిరి మండలం గానుగపెంట, గుడిపాడు, ఎన్‌.గొల్లపల్లి, వెలిగండ్ల మండలం హుస్సేన్‌పురం, తమ్మినేనిపల్లి, మరపగుంట్ల, పందువ, పెరుగుపల్లి పామూరు మండలం అయ్యనకోట, బోడవాడ, అయ్యవారిపల్లి, బలిజపాలెం తదితర గ్రామాల్లో ఎక్కువగా ఉన్నాయి.

* ఏకంగా పంటలు సాగు చేస్తూ...: నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉండటంతో కొందరు రాజకీయ నాయకుల కళ్లు వాటిపై పడ్డాయి. తమ పలుకుబడిని ఉపయోగించి ఆక్రమిస్తున్నారు. కొందరు నాయకులను మచ్చిక చేసుకుని వారి సాయంతో కుటుంబ సభ్యుల పేర్లతో ఆన్‌లైన్‌ చేయించుకుంటున్నారు. ఈ తరహాలో ఇప్పటికే పలువురు ఏకంగా పట్టాలు పొందడం గమనార్హం. పామూరు మండలం అయ్యన్నకోట, బోడవాడ, బలిజపాలెం తదితర ప్రాంతాల్లో 80 ఎకరాలు, వెలిగండ్ల మండలం హుస్సేన్‌పురం, పెరుగుపల్లి, తమ్మినేనిపల్లి తదితర ప్రాంతాల్లో 220 ఎకరాలు, కనిగిరి మండలం, ఎన్‌.గొల్లపల్లి, గానుగపెంట, బడుగులేరు తదితర ప్రాంతాల్లో 100 ఎకరాలు, హనుమంతునిపాడు మండలం ఉమ్మనపల్లి, మహ్మదాపురం గ్రామాల్లో మరో 50 ఎకరాలకు పైగా పశువుల బీడు, వాగు పోరంబోకు, గ్రేజింగ్‌ భూములు, అటవీ పోరంబోకు భూములు ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. వీటిలో కొందరు ఇప్పటికే వరి, పొగాకు, కంది, మినుము పంటలను సాగు చేసుకుంటున్నారు. మరికొందరు ఆన్‌లైన్‌లో పొందిన పట్టాలను చూపుతూ ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణదారుల్లో స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారూ ఉంటున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు స్థానికులు, స్థానికేతరులకు మధ్య వివాదాలూ తలెత్తుతున్నాయి.

చెరువులనూ చెరపడుతూ...: ప్రభుత్వ భూములే కాకుండా చెరువులనూ అక్రమార్కులు వదలడం లేదు. కనిగిరి మండలం ఎన్‌.గొల్లపల్లి చెరువు పైభాగాన 50 ఎకరాలకు పైగా వెలిగండ్ల మండలానికి చెందిన కొందరు ఆక్రమించి సాగు చేస్తున్నారు. కనిగిరి పెద్ద చెరువు, మోపాడు జలాశయం పైభాగాన కొంత చెరువు భాగాన్నీ ఆక్రమించారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి రైతులు తీసుకెళ్లినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో చూసీచూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే ఆసరాగా ఆక్రమణదారులు మరింత రెచ్చిపోతున్నారు.

విచారించి తిరిగి స్వాధీనం...
ప్రభుత్వ, వాగు పోరంబోకు, పశువుల బీడు, గ్రేజింగ్‌ భూములు ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురయ్యాయో విచారిస్తున్నాం. కొన్ని న్యాయస్థానాల పరిధిలో ఉన్నాయి. అవి కాకుండా మిగిలిన చోట్ల ఆక్రణలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటాం. అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటాం.

- వి.పుల్లారావు, తహసీల్దార్‌ కనిగిరి, వెలిగండ్ల (ఇన్‌ఛార్జి)

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని