logo

బాపూజీ స్ఫూర్తి.. ప్రకాశించే ఉద్యమ దీప్తి

75 వసంతాల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం పేరుతో దేశ ప్రజలమైన మనం సంబరంగా నిర్వహించుకుంటున్నాం. వీటి వెనుక ఎందరో మహానుభావుల త్యాగాలు ఇమిడి ఉన్నాయి. జిల్లాకు చెందిన పలువురు పలువురు త్యాగధనులు స్వాతంత్య్ర ఉద్యమం, దేశ సేవలో తరించి నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

Updated : 13 Aug 2022 06:53 IST

స్వాతంత్య్ర సమరంలో మహనీయులు

జిల్లాలో మరపురాని మహాత్ముని స్మృతులు

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు:

‘సైమన్‌ గో బ్యాక్‌’ అంటూ బ్రిటిష్‌ పోలీసుల తుపాకులకు గుండె చూపుతున్న టంగుటూరి ప్రకాశం పంతులు

75 వసంతాల స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం పేరుతో దేశ ప్రజలమైన మనం సంబరంగా నిర్వహించుకుంటున్నాం. వీటి వెనుక ఎందరో మహానుభావుల త్యాగాలు ఇమిడి ఉన్నాయి. జిల్లాకు చెందిన పలువురు పలువురు త్యాగధనులు స్వాతంత్య్ర ఉద్యమం, దేశ సేవలో తరించి నేటి తరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. వీరిలో పలువురు మహాత్మా గాంధీ పిలుపు మేరకు దేశం కోసం సాగిన సంగ్రామంలో భాగస్వాములయ్యారు. వీరిలో సైమన్‌ గో బ్యాక్‌ అంటూ బ్రిటిష్‌ పోలీసుల తుపాకులకు గుండె ఎదురొడ్డిన టంగుటూరి ప్రకాశం పంతులు చిరస్మరణీయం. అలాగే కంభంలోని లింగాపురంలో జన్మించిన కందుల ఓబుల్‌రెడ్డి, రాచర్లకు చెందిన పిడతల రంగారెడ్డి, ధేనువుకొండ వాసి నాగినేని వెంకయ్య చౌదరి వంటి ఎందరో త్యాగధనులున్నారు.

* ఆ అడుగులు అజరామరం...: మహాత్మాగాంధీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పలుసార్లు పర్యటించారు. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో చీరాల- పేరాల వాసులు ఉద్యమించారు. పన్నులు చెల్లించకుండా బ్రిటిష్‌ ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేశారు. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య కోరిక మేరకు గాంధీ తొలిసారిగా 1921లో చీరాల వచ్చారు. ఉద్యమానికి మద్దతు పలికి రామనగర్‌కు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ నిర్బంధానికి గురైన 13 మందిని సన్మానించారు.

1929 ఏప్రిల్‌ 18న వేటపాలెంలోని సారస్వత నికేతన్‌ భవన నిర్మాణానికి గాంధీ శంకుస్థాపన చేశారు.

* ఒంగోలు మీదుగా గాంధీ ప్రయాణిస్తున్న విషయం తెలుసుకున్న పలువురు ఆయన్ను చూసేందుకు రైల్వే స్టేషన్‌కు 1946 జనవరి 21న తండోపతండాలుగా తరలివచ్చారు. టంగుటూరు వాసులు ట్రాక్‌పై ఎర్రజెండాలు పాతి రైలును నిలిపివేయించి మహాత్ముడిని కనులారా తిలకించారు.

* గాంధీ స్ఫూర్తితో జిల్లాలో విదేశీ వస్తువుల బహిష్కరణ సాగింది. గొల్లపూడి సీతారామశాస్త్రి ఆధ్వర్యంలో నిరసనాందోళన చేపట్టారు. అంటరానితనం నిర్మూలన ఉద్యమంలోనూ జిల్లా వాసులు కదం తొక్కారు. పలు ప్రాంతాల్లో సహపంక్తి భోజనాలు చేశారు.

* ఉప్పుసత్యాగ్రహంలో భాగస్వాములయ్యారు. దేవరంపాడులోని టంగుటూరి ప్రకాశం పంతులు నివాసమే సత్యాగ్రహ శిబిరమైంది.

* ఉద్యమ సింహాలు.. జిల్లా వాసులు...: టంగుటూరి ప్రకాశం పంతులు 1872 వినోదరాయునిపాలెంలో జన్మించారు. న్యాయవాద వృత్తిలో నాటి మద్రాసులో ఉన్న సమయంలో సైమన్‌ కమిషన్‌కు వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తాయి. మద్రాసులో ప్రదర్శనగా వస్తున్న ప్రకాశం పంతులును పోలీసులు అడ్డుకుని కాల్చేస్తామని హెచ్చరించారు. అయినా ఆయన లెక్క చేయకుండా ‘దమ్ముంటే ఇక్కడ కాల్చండి’రా అంటూ బ్రిటిష్‌ పోలీసుల తుపాలకు తన గుండెను చూపించారు. ఆయన ధైర్యాన్ని చూసిన జనమంతా ఆంధ్రకేసరి జిందాబాద్‌ అంటూ నినదించారు. తమిళనాడులో బిపిన్‌చంద్ర పాల్‌ ప్రసంగాన్ని విని రాజకీయాల వైపు వచ్చిన ఆయన 1935లో ఉమ్మడి మద్రాసు మంత్రి, ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆయన స్మృత్యర్థం 1972లో జిల్లాకు ప్రకాశం పేరు పెట్టారు.


క్విట్‌ ఇండియాలో కీలకం

కంభంలోని లింగాపురంలో 1910లో జన్మించిన కందుల ఓబుల్‌రెడ్డి విద్యార్థి దశలో బాలగంగాధర్‌ తిలక్‌, గాంధీ ఉపన్యాసాలకు ఆకర్షితులయ్యారు. మహాత్ముని పిలుపుతో 1930-33లో సహాయ నిరాకంణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఖద్దరు ధరించడం ప్రారంభించారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని రెండు సంవత్సరాలపాటు తంజావూరు జైలులో శిక్ష అనుభవించారు. నైజాం సంస్థానం భారతదేశంలో విలీనం సమయంలో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌తో సన్నిహితంగా మెలిగారు. 1957లో స్వతంత్ర పార్టీ నుంచి మార్కాపురం శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1962లో కాంగ్రెస్‌ తరఫున మార్కాపురం, 1972లో యర్రగొండపాలెం, 1978లో కంభం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు.


కల్లు, సారాను తరిమారు

నాగినేని వెంకయ్య చౌదరి 1913లో అద్దంకి మండలం ధేనువుకొండలో జన్మించారు. గాంధీ పిలుపుతో స్వాతంత్య్ర ఉద్యమంలోకి వచ్చారు. గ్రామాభ్యుదయం, ఖాదీ ఉత్పత్తి, మద్యనిషేధం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ధేనువుకొండ పరిసర గ్రామాల ప్రజలను చైతన్యం చేసి కల్లు, సారాను మాన్పించారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆయన జైలు శిక్ష అనుభవించారు. రాయవేలూరు, తిరుచిరాపల్లిలో జైలు జీవితం గడిపారు. స్వాతంత్య్రం అనంతరం గ్రంథాలయోధ్యమంలో భాగంగా విద్యాలయాలు, గ్రంథాలయాలు నెలకొల్పారు.


సత్యాగ్రహం చేపట్టి

1917లో రాచర్ల మండలం అనుమలవీడులో పిడతల రంగారెడ్డి జన్మించారు. తెల్లవారి పాలనకు వ్యతిరేకంగా ‘వ్యక్తి సత్యాగ్రహం’ ప్రారంభించారు. పోలీసులు దాడి చేసి రంగారెడ్డిని అరెస్టు చేసి మార్కాపురం కోర్టులో హాజరుపరిచ్చారు. న్యాయమూర్తి ఆయనకు ఏడాది జైలు, రూ.500 జరిమానా విధించి బళ్లారి జైలుకు పంపారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పలు సేవా కార్యక్రమాలు చేశారు. అనుమలవీడులోని తన అయిదు ఎకరాల భూమిలో పటేల్‌ బిల్డింగ్స్‌ పేరుతో పాఠశాల, వైద్యశాలను ఏర్పాటు చేసి నిర్వహించారు. గిద్దలూరులో ఆర్టీసీ డిపో, బస్టాండు నిర్మించేలా చూశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని