logo
Published : 13 Aug 2022 05:22 IST

కీలక శాఖలో ఖాళీల వెక్కిరింత

ఇన్‌ఛార్జుల పాలనలోనే రెవెన్యూ

13 మండలాల్లో అదనపు బాధ్యతలు

కొత్తపట్నం, న్యూస్‌టుడే:

ఒంగోలు మండల తహసీల్దార్‌ కార్యాలయం

సులభతర పాలన.. నిరంతర పర్యవేక్షణ.. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 56 మండలాలుండగా.. ప్రస్తుతం 38 మండలాలకు పరిధి తగ్గింది. తద్వారా జిల్లా అధికార యంత్రాంగానికి పర్యవేక్షణ సులువైంది. ప్రభుత్వ శాఖల్లో రెవెన్యూ ఎంతో కీలకం. అందులో అందుతున్న సేవలపై ప్రజలు సంతృప్తి చెందారు అంటే అధికార యంత్రాంగం పనితీరు బాగున్నట్లే అని భావిస్తారు. కానీ జిల్లా నుంచి పరిష్కారం కోరుతూ వచ్చే అర్జీల్లో సింహభాగం ఆ శాఖవే. జిల్లాలోని మూడో వంతు తహసీల్దార్లు మరో మండలానికి కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో పని ఒత్తిడితో సరైన న్యాయం చేయలేక పోతున్నామని సహచర ఉద్యోగుల వద్ద వాపోతున్నారు. సకాలంలో సేవలందకపోవడంతో అర్జీదారులు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

* బాబోయ్‌ పనిభారం...: జిల్లాలో 38 మండలాలుండగా.. పదమూడింటికి ఇన్‌ఛార్జి తహసీల్దార్లే కొనసాగుతున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలుతో పాటు, నాగులుప్పలపాడు, సంతనూతలపాడు, సీఎస్‌పురం, దర్శి, పామూరు, పొదిలి, వెలిగండ్ల, బేస్తవారపేట, పెద్దదోర్నాల, కొమరోలు, పెద్దారవీడు, యర్రగొండపాలెం మండల తహసీల్దారు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేకించి ఒంగోలు తహసీల్దార్‌కు పని భారంతో పాటు, ప్రోటోకాల్‌ ఖర్చులు కూడా ఎక్కువగానే ఉండటంతో అక్కడకు వచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రతి సోమవారం వచ్చే స్పందన అర్జీలు, ఇతరత్రా భూ సమస్యలు, పౌర సరఫరాలు, ధ్రువీకరణ పత్రాలు, శాఖల మధ్య సమన్వయం, అత్యవసర సమయాల్లో శాంతి భద్రతలు నెలకొల్పడంలో కీలకమైన నిర్ణయాధికారం కలిగిన తహసీల్దార్లు అందుబాటులో లేకపోవడమే సమస్యగా మారింది. ప్రస్తుతం గ్రామాల్లో చేపట్టిన భూ రీ సర్వే దగ్గర నుంచి ప్రభుత్వ భవనాలతో పాటు, ఇతర రహదారులు, ప్రాజెక్ట్‌లకు స్థల సేకరణ చేయాల్సి రావడంతో వాటి పురోగతికి సంబంధించి ప్రతి వారం ప్రగతి నివేదికలపై సమీక్ష ఉంటుంది. 13 మంది తహసీల్దార్లు పక్క మండలాలను కూడా పర్యవేక్షించాల్సి రావడంతో సకాలంలో నిర్ణయం తీసుకోలేక పోతున్నారు. అదే సమయంలో ప్రకాశం భవన్‌తో పాటు, ఆర్డీవో కార్యాలయాలు, ఇతర భూ సేకరణ ప్రాజెక్ట్‌లు, మండల తహసీల్దార్‌ కార్యాలయాల్లో మరో 60 సీనియర్‌ సహాయకులు, 17 మంది జూనియర్‌ సహాయకుల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. రెగ్యులర్‌ తహసీల్దార్‌ పోస్టులను భర్తీ చేసి ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం చూపేలా ఉన్నతాధికారులు చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని