logo
Updated : 14 Aug 2022 06:47 IST

వన్యప్రాణులతో ముప్పా..!

పరిహారం పొందే అవకాశం
పెద్దదోర్నాల, న్యూస్‌టుడే

మానవ మనుగడకు ప్రకృతిలో జీవ వైవిధ్యం ఎంతో అవసరం. మానవుడు నాగరికత పేరుతో అవసరాల కోసం అడవులను నాశనం చేస్తున్నారు. దీంతో వాటిలో నివసిస్తున్న వన్యప్రాణులు అంతరిస్తున్నాయి. వాటిని సంరక్షించి అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వన్యప్రాణి సంరక్షణ చట్టం అమలు చేస్తోంది. వాటికి ఇబ్బంది కలిగిస్తే చర్యలు తీసుకుంటుంది. అలాగే వాటి ద్వారా ప్రజల ఆస్తులకు, పశువులకు నష్టం కలిగితే పరిహారం అందజేస్తోంది. మూడు నెలల క్రితం దోర్నాల రేంజ్‌ లోని పెద్దబొమ్మలాపురం బీటు సట్టుతండా సమీపంలోని మిరప పంటను అడవి పందులు నాశనం చేశాయి. గత నెలలో అదే బీటులో పెద్దపులి ఆవును చంపింది. వారం క్రితం గంజివారిపల్లె రేంజ్‌లో పాలుట్ల సమీపంలో పెద్దపులి మనిషి పై దాడి చేసి గాయపరచింది. పెద్దపులి, చిరుతల దాడిలో చనిపోయిన పశువులకు, మనుషులకు, ఎలుగుబంటి దాడిలో గాయపడిన వారికి, అడవి పందులు, దుప్పులతో పాటు ఇతర వన్యప్రాణుల కారణంగా పంటలకు నష్టం కలిగితే తీసుకోవాల్సి జాగ్రత్తలపై కథనం.

అర్హతలు ఇవీ....
పెద్దపులులు, చిరుతలు దాడి చేసి చంపిన పశువుల సమాచారాన్ని బాధితుడు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి. అటవీ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తారు. పెద్దపులులు, చిరుతల అడుగులను పరిశీలిస్తారు. మిగిలిన కళేబరాన్ని అక్కడే ఉంచుతారు. ఆ ప్రాంతాల్లో కెమెరా ట్రాప్‌లు బిగిస్తారు. ఆ కళేబరాన్ని చంపిన వన్యప్రాణి మళ్లీ వచ్చి తింటుంది. ఆ సమయంలో కెమెరాలో వాటి ఫొటోలు చిత్రీకరిస్తారు. పశువైద్యాధికారి మిగిలిన కళేబరానికి పోస్టుమార్టం నిర్వహిస్తారు. ః ఆ బీట్‌ పరిధిలోని గూడేలకు చెందిన పశువులకు మాత్రమే పరిహారం అందిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మరణించిన వాటికి పరిహారం ఇవ్వరు.

* పరిహారం అందించేందుకు కేంద్రప్రభుత్వం 2011లో జీవో 90 విడుదల చేసింది. 2014లో దానిని సవరించి 57 జీవో విడుదల చేసింది. దాని ప్రకారం జంతువులు చనిపోతే మార్కెటులో దానికి ఉండే ధరను చెల్లిస్తారు. మనిషి చనిపోతే రూ.5 లక్షలు, తీవ్ర గాయాలైతే రూ.75వేలతో పాటు చికిత్సకు అయ్యే ఖర్చు చెల్లిస్తారు. పంట నష్టానికి హెక్టారుకు రూ.ఆరు వేలు, ఉద్యాన పంటలకు హెక్టారుకు రూ.75వేలు అందజేస్తారు.


ఎనిమిదేళ్లలో రూ.22 లక్షలు..


బాధితులకు పరిహారం అందజేస్తున్న దోర్నాల అటవీ క్షేత్ర అధికారి విశ్వేశ్వరరావు

మార్కాపురం డివిజన్‌లో దోర్నాల, గంజివారిపల్లె, యర్రగొండపాలెం, వీపీసౌత్‌ రేంజ్‌లో నల్లమల విస్తరించి ఉంది. దానిలో అధికభాగం దోర్నాల, గంజివారిపల్లె రేంజ్‌లో మేత కోసం వెళ్లిన ఆవులు, గేదెలు, ఎద్దులపై పెద్దపులులు, చిరుతలు దాడి చేసి చంపి తింటున్నాయి. దోర్నాల రేంజ్‌ పరిధిలో ఎనిమిదేళ్లలో 122 కేసులు నమోదయ్యాయి. వాటికి పరిహారంగా బాధితులకు రూ.22,04,900 పరిహారం అందజేశారు.


నష్టం వాటిల్లితేనే..

వన్యప్రాణులతో ప్రజలకు, పశువులకు, పంటలకు నష్టం జరిగితే పరిహారం అందజేస్తున్నాం. పెద్దపులి, చిరుతలు వాటి ఆవాసాల్లోకి గేదెలు, ఆవులు, ఎద్దులు వెళ్లడంతో చంపి తింటున్నాయి. పశుపోషకులు వాటిని ఆ ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. రాష్ట్రంలో తొలిసారిగా పెద్దపులి మనిషి పై దాడి చేసింది. అది పిల్లలతో ఉండటమో, తనకు హాని తలపడతాడనే భావనతో దాడి చేసి ఉంటుంది. వన్యప్రాణులతో ఆస్తి, పశు నష్టం జరిగితే తక్షణమే స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలి. ఆ ప్రాంతాన్ని పరిశీలించి పరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదిస్తాం. నిధులు మంజూరైన వెంటనే చెక్కుల రూపంలో అందిస్తాం.

- విశ్వేశ్వరరావు, దోర్నాల అటవీ క్షేత్రాధికారి

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని