logo

అభివృద్ధి చేస్తే అంతుచూస్తా...

తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే బడి నివాసాలకు సమీపంలో ఉంటే బాగుంటుందని ఎవరైనా కోరుకుంటారు. అందుకు భిన్నంగా ఆ నాయకుడు వ్యవహరిస్తున్నారు. ఏడు

Published : 26 Sep 2022 02:11 IST

ప్రభుత్వ బడి మార్పునకు వార్డు ప్రజాప్రతినిధి పట్టు

నాడు-నేడు పనులూ అడ్డగింత

తరగతి గదిలోనే కూర్చుని భోజనం చేస్తున్న విద్యార్థులు

మార్కాపురం అర్బన్‌, న్యూస్‌టుడే: తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే బడి నివాసాలకు సమీపంలో ఉంటే బాగుంటుందని ఎవరైనా కోరుకుంటారు. అందుకు భిన్నంగా ఆ నాయకుడు వ్యవహరిస్తున్నారు. ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న పాఠశాల భవనం లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిత్యం ఏదో రూపంలో నానా యాగీ చేస్తుండటంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ పరిణామాలతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికే పంపించడమే మానేశారు. నాడు- నేడు కింద అదనపు గదుల నిర్మాణానికి  నిధులు మంజూరైనా అడుగు ముందుకు పడలేదు. పనులు ప్రారంభిస్తే అంతు చూస్తాననే స్థానిక నాయకుడి హెచ్చరికలే ఇందుకు కారణం.

తీగల తొలగింపునకూ ససేమిరా...: మార్కాపురం పట్టణంలోని 5వ వార్డు పరిధిలో మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల(ఏబీఎం) 1952లో ఏర్పాటైంది. 1 నుంచి 5వ తరగతి వరకు 61 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. సమీప వీధుల్లో నివాసం ఉండే వారికి ఇది ఎంతో సౌకర్యవంతంగా ఉండటంతో  తమ పిల్లల్ని ఇక్కడికే పంపిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. 70 ఏళ్ల నుంచి అవే నివాస ప్రాంతాల్లో నడుస్తున్న పాఠశాలకు ఇప్పుడు స్థానిక వార్డు ప్రజాప్రతినిధి లేనిపోని అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. పాఠశాల మార్పునకు పట్టుబడుతున్నారు. తన అనుచరులతో నిత్యం ఏదో ఒక రూపంలో హంగామా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పాఠశాల పైభాగంలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు తీగలను తొలగింపునకు ప్రధానోపాధ్యాయుడు విద్యుత్తు శాఖకు నిర్ణీత రుసుం చెల్లించారు. తీగలు తొలగించేందుకు వచ్చిన అధికారులను కొందరు అడ్డుకోవడంతో వెనుదిరిగి వెళ్లాల్సిన దుస్థితి. మిద్దెపై తీగలుండటంతో అదనపు తరగతి గదుల నిర్మాణం నిలిచిపోయి విద్యార్థులు ఇరుకు గదుల్లో మగ్గాల్సి వస్తోంది.

అడ్డుకోవడంతో వెనుదిరిగిన అధికారులు...: మున్సిపల్‌ పాఠశాలలో మూడు తరగతులకు రెండు గదులున్నాయి. ఒక గదిలో పిల్లల చదువులు సాగుతుండగా.. ఇంకో గదిలో తరగతులతోపాటు వంట వండి అక్కడే వడ్డిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి నాడు-నేడు కింద అవసరమైన నిధులను రెండు నెలల క్రితం మంజూరు చేసింది. రూ.16 లక్షల నిధులున్నప్పటికీ పనులు చేపట్టేందుకు ప్రధానోపాధ్యాయుడు సాహసించడం లేదు. జులై 1న పనులు చేపట్టేందుకు ముందస్తు పరిశీలనకు జిల్లా అధికారులు వచ్చారు. విషయం తెలుసుకున్న నాయకుడు వారిపై చిందులు తొక్కడంతో చేసేది లేక వెనుదిరిగారు.

పనులు ప్రారంభం కాని మాట నిజమే...
మార్కాపురం పట్టణంలోని మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలకు సంబంధించి నాడు- నేడు పనులకు స్థానికుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ కారణంగా పనులు ప్రారంభించలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులతో పాటు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాం. సమస్య పరిష్కారం అయిన వెంటనే పనులు ప్రారంభిస్తాం.

- రాందాస్‌ నాయక్‌, ఎంఈవో, మార్కాపురం
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని