logo

చిన్నారులకు ఆరోగ్య యోగం

ఆరోగ్యకర జీవనానికి యోగ దోహదపడుతుంది. విద్యార్థి దశ నుంచే చిన్నారులకు యోగా నేర్పితే వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు యోగా పాఠాలు నేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Published : 28 Sep 2022 02:25 IST

17 ఉన్నత పాఠశాలల్లో ఉత్సాహంగా తర్ఫీదు
పెద్దదోర్నాల, న్యూస్‌టుడే

దోర్నాలలో యోగా సాధన చేస్తున్న విద్యార్థులు

ఆరోగ్యకర జీవనానికి యోగ దోహదపడుతుంది. విద్యార్థి దశ నుంచే చిన్నారులకు యోగా నేర్పితే వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుందని భావించిన కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు యోగా పాఠాలు నేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయుష్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 312 పాఠశాలల్లో బుద్ధ యోగా పౌండేషన్‌ ఆధ్వర్యంలో తరగతులు నిర్వహిస్తోంది. మన జిల్లాలో 17 ఉన్నత పాఠశాలల్లో శిక్షణ ఇస్తోంది. దీని కోసం బోధకులను నియమించారు. యోగాతో కలిగే ఆరోగ్యం, దాని విలువలను ఉదయం వేళల్లో వివరిస్తారు. సాయంత్రం ఆసనాలు నేర్పిస్తారు. శిక్షకులకు వేతనాన్ని ఫౌండేషన్‌ అందిస్తుంది.
యోగా నేర్పుతున్న జడ్పీ ఉన్నత పాఠశాలలు: దోర్నాల, పెద్దబొమ్మలాపురం, అమానిగుడిపాడు, వీరభద్రాపురం, పిడికిటివారిపల్లె, మార్కాపురం, దరిమడుగు, వేములకోట,  బోగోలు, గిద్దలూరు, ముండ్లపాడు, కేఎస్‌పల్లి, కొమరోలు, రాజుపాలెం, కొత్తపేట, తెల్లబాడు, రాచర్ల.


శిక్షణ ఇస్తున్న ఆసనాల్లో కొన్ని.. ప్రయోజనం

తాడాసనం: ఎత్తు పెరగడం, మంచి రక్త ప్రసరణ కిడ్నీ సమస్యలు దూరం, దృఢమైన కండరాలు

వృక్షాసనం: వెెన్నెముక దృఢత్వం, భుజాల సత్తువ పెరుగుదల, ఏకాగ్రత, నడుము నొప్పి దూరం

ఉత్కటాసనం: వెన్నెముక, పాదాలకు బలం


ప్రశాంతంగా చదువుకుంటున్నాం

ప్రతి రోజు యోగా తరగతులు వినడమే కాకుండా ఆచరిస్తున్నాం. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటోంది. ఒత్తిడి లేకుండా చదువుకోగలుగుతున్నాం. ఆరోగ్యంపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పడింది. సమస్యలను ఎదుర్కొనే ఆత్మస్థైర్యం కలిగింది. శారీరకంగాను, మానసికంగాను దృఢంగా మారాను.

- వీరాంజనేయులు, విద్యార్థి


ఒత్తిడి దూరం...

నేటి జీవన విధానం ఉరుకులు, పరుగులతో సాగుతోంది. దీంతో ఒత్తిడికి లోనై అనారోగ్యం పాలవుతున్నారు. ప్రతి చిన్నదానికి మందులు వాడేస్తున్నారు. విద్యార్థి దశ నుంచే ఆరోగ్యంపై శ్రద్ధ చూపే విధంగా కేంద్ర ప్రభుత్వం యోగా తరగతులు నిర్వహిస్తోంది. చిన్నారులు ఎంతో శ్రద్ధగా తరగతులు వినడంతో పాటు యోగా నేర్చుకుంటున్నారు. వారికి ఆరోగ్యపరంగా ప్రయోజనం చేకూరుతోంది.

- మహేశ్వరరెడ్డి, యోగా శిక్షకుడు, దోర్నాల
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని