logo

ఘరానా దొంగల ముఠా అరెస్టు

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం 24 పరగణాల జిల్లాకు చెందిన కొందరు ఓ ముఠాగా ఏర్పడి చోరీలే వృత్తిగా మలచుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో దొంగతనాలు చేయడం.. దొరికిన సొత్తుతో జల్సాలు చేయడానికి అలవాటు పడ్డారు. పోలీసులకు

Updated : 28 Sep 2022 02:48 IST

 బంగారం.. నగదు స్వాధీనం

స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలను పరిశీలిస్తున్న ఎస్పీ  

మలికా గార్గ్‌.. చిత్రంలో డీఎస్పీ నాగరాజు, తాలూకా సీఐ శ్రీనివాసరెడ్డి

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం 24 పరగణాల జిల్లాకు చెందిన కొందరు ఓ ముఠాగా ఏర్పడి చోరీలే వృత్తిగా మలచుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో దొంగతనాలు చేయడం.. దొరికిన సొత్తుతో జల్సాలు చేయడానికి అలవాటు పడ్డారు. పోలీసులకు పట్టుబడి పలుమార్లు జైలుకెళ్లి తిరిగొచ్చినా చోరీలు షరా మూమూలే. ఈ తరహాలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ పలు చోరీలకు పాల్పడ్డారు. ముగ్గురు సభ్యుల ముఠాను ఒంగోలు తాలూకా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 168 గ్రాముల(21 సవర్లు) బంగారు ఆభరణాలు, రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.11.72 లక్షలు. జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మలికా గార్గ్‌ వివరాలు వెల్లడించారు.

హోమియో వైద్యుడి ఇంట్లో...: ఒంగోలు శ్రీనగర్‌ కాలనీలో హోమియో వైద్యుడు దొరైరాజ్‌ నివాసం ఉంటున్నారు. అతని ఇంట్లో ఈ ఏడాది జులై 20న పట్టపగలే చోరీ చోటుచేసుకుంది. ప్రధాన ద్వారం గడియ పెకిలించి లోపలికి ప్రవేశించిన దొంగలు బీరువాలో దాచి ఉంచిన 140 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.7.50 లక్షల నగదు అపహరించుకుని వెళ్లారు. ఈ సంఘటనపై ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ చోరీకి పాల్పడిన నిందితుల కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. డీఎస్పీ యు.నాగరాజు పర్యవేక్షణలో ఒంగోలు తాలూకా సీఐ వి.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై ఎం.దేవకుమార్‌, సిబ్బంది దర్యాప్తు ముమ్మరం చేశారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాలతో నిందితులు పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం 24 పరగణాల జిల్లాకు చెందిన సుబిద్‌ ఆలీఖాన్‌, జుమ్రతి మొల్ల, అక్కాస్‌ లష్కర్‌లుగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు ఒంగోలులో చేసిన చోరీతో పాటు 2018 నవంబర్‌ 18న మద్దిపాడుకు చెందిన పోలా మస్తాన్‌ ఇంటిలో 28 గ్రాముల బంగారు గొలుసు అపహరించినట్లు విచారణలో వెల్లడించారు.

ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లోనూ...: ఈ దొంగల ముఠా ప్రకాశం జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లోనూ చోరీలకు పాల్పడ్డారు. 2018-19 మధ్యకాలంలో వరంగల్‌ జిల్లాలో ఏడు, ఖమ్మం జిల్లాలో ఈ ముఠా మూడు చోరీలు చేసినట్టు ఎస్పీ గార్గ్‌ తెలిపారు. నిందితుల అరెస్టు, చోరీ సొత్తు రికవరీకి కృషిచేసిన తాలూకా సీఐ వి.శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు ఎం.దేవకుమార్‌, పి.శరత్‌బాబు, పొదిలి ఏఎస్సై కె.సురేష్‌; తాలూకా హెడ్‌ కానిస్టేబుళ్లు కె.రామకృష్ణ, ఆర్‌.రాంబాబు, కానిస్టేబుల్‌ కె.రవికుమార్‌; సీసీఎస్‌ కానిస్టేబుల్‌ సి.హెచ్‌.అంజిబాబు, ఐటీ కోర్‌ టీమ్‌ కానిస్టేబుల్‌ మాలిక్‌, ఫింగర్‌ ప్రింట్స్‌ బ్యూరో ఎం.సురేష్‌రెడ్డిలను ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని