logo

ఆ విద్యార్థులంతా ఏరీ!

పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం ద్వారా వివిధ అభివృద్ధి పనులు చేపట్టి అనేక సంస్కరణలు తీసుకువచ్చామని ఓ వైపు ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ క్షేతంలో పరిస్థితి చూస్తే ఆయా బడులకు వచ్చేవారి

Updated : 29 Sep 2022 05:33 IST

ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిన వైనం

పాఠశాలల్లో నాడు-నేడు కార్యక్రమం ద్వారా వివిధ అభివృద్ధి పనులు చేపట్టి అనేక సంస్కరణలు తీసుకువచ్చామని ఓ వైపు ప్రభుత్వం ప్రకటిస్తోంది. కానీ క్షేతంలో పరిస్థితి చూస్తే ఆయా బడులకు వచ్చేవారి సంఖ్యలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేవారు గణనీయంగా తగ్గిపోగా అదే సమయంలో ప్రైవేటులో చేరిన పిల్లల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది.

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు; న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

కొవిడ్‌ కారణంగా గతయేడాది ప్రైవేట్‌ నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వచ్చిన విద్యార్థుల్లో చాలామంది తిరిగి ప్రైవేట్‌ బాట పట్టినట్లు తెలుస్తోంది.  3, 4, 5 తరగతుల విలీనం, ఉపాధ్యాయుల కొరత..ఈ సందర్భంగా తలెత్తిన వివిధ గందరగోళ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. విలీనమైన ఉన్నత పాఠశాలలకు విద్యార్థులంతా వెళ్లలేదని స్పష్టమవుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో మిగిలిన పిల్లల్లో కూడా కొందరు ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరిపోయారు. 2021లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మొత్తం ప్రభుత్వ పాఠశాలల్లో 4.80 లక్షల మంది ఉండగా ఈసారి 4.45 లక్షలకు తగ్గినట్లు సమాచారం. పునర్విభజన అనంతరం జిల్లాలోని 38 మండలాల వరకు తీసుకుంటే ఈ ఏడాది 3,20,337 మంది విద్యార్థులు ఉన్నారు. విలీనం కారణంగా ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులు..పది మంది లోపు ఉన్న పాఠశాలలు కూడా జిల్లాలో అనేకం కనిపిస్తున్నాయి.

చిరునామా లేనివారు 3,084 మంది
రెండు మాసాల క్రితం మధ్యలో బడి మానేసినపిల్లలపై సమగ్రశిక్ష ద్వారా సర్వే చేశారు. 3,084 మంది చిరునామా కనిపించలేదని తేలింది. అందులో 7, 8 తరగతుల విద్యార్థులే ఎక్కువ. పేదరికం కారణంగా కొంతమంది తల్లిదండ్రులు తమతో పాటు పిల్లలను పనికి తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినవారు 2,904 మంది ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. వీరిలో బాల్య వివాహాలు 64 మందికి జరగ్గా, వైకల్యం వల్ల 106, అనారోగ్య సమస్యతో 234, చదువుపై ఇష్టంలేక మానేసినవారు 145 మంది, కుటుంబంతోపాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లినవారు 721, అనాథలు 10, రవాణా సమస్యతో మానేసినవారు 387 మంది ఉన్నట్లు చెబుతున్నారు.. 69 మంది పిల్లలు పాఠశాలల్లో చదువుతూ వివిధ కారణాలతో మృత్యువాత పడ్డారు. ఇలా వీరందరినీ మినహాయించి రాష్ట్రంలో ఉన్నవారిని ఏదో ఒకచోట బడిలో చేరేలా చూడాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. రవాణా సమస్య చెప్పినవారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారు. తాజా డ్రైవ్‌పై కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సమీక్షించారు.

13 వేల మంది ఎక్కడో తెలియక..
జిల్లాలోని 38 మండలాల్లో 13,923 మంది పిల్లలు బడి మానేసినట్లు అధికారులు గుర్తించారు. వారిని వెంటనే తిరిగి చేర్పించాలని ఆదేశాలు రావడంతో బుధవారం అన్ని మండలాల్లో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టారు. ఎంఈవోల పర్యవేక్షణలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్‌ సమన్వయకులు, సీఆర్‌పీలు ఫోన్లు చేసి ఆ పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. మొత్తం మీద తొలిరోజు 311 మంది పిల్లలను గుర్తించి వారికి పునఃప్రవేశాలు కల్పించారు. దసరా సెలవులు ఇచ్చినందున ప్రధానోపాధ్యాయులతో మాట్లాడి వారిని బడిలో చేరేలా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. డ్రాపవుట్స్‌ అందరినీ చేర్చాలని ఆదేశాలిచ్చారు.

ముండ్లమూరు మండలం కొత్తూరు ప్రాథమిక పాఠశాల

ఇదీ పరిస్థితి
* ముండ్లమూరు మండలం కొత్తూరు ప్రాథమిక పాఠశాలలో 2021లో 95మంది ఉన్నారు. ఈ ఏడాది విలీనంతో 3, 4, 5 తరగతుల విద్యార్థులు వెళ్లిపోగా ప్రస్తుతం 21 మంది మిగిలారు. వీరిలో పదిమంది వస్తుండగా మిగిలిన 11మంది సమీప ప్రైవేటు పాఠశాలలో చేరారు. గతంలో ఇక్కడ నలుగురు ఉపాధ్యాయులు ఉండగా ప్రస్తుతం ఒకరే ఉన్నారు.

* దర్శి మండలం చందలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో గతేడాది 410 మంది విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు 378 మంది మాత్రమే కనిపిస్తున్నారు. వివిధ కారణాలతో పలువురు పైవేటు పాఠశాలల్లో చేరారు. 2 టంగుటూరు మండలం పురం సెంటర్‌లోని ప్రాథమిక పాఠశాలలో 211 మంది విద్యార్థులకు గాను విలీనమైన తరగతులు పోగా 72 మంది మిగిలారు. వీరిలో కూడా 30 మంది టీసీలు తీసుకెళ్లారు. మరో 15 మంది ఆలకూరపాడు పాఠశాలలో చేరారు. డీఈవో విజయభాస్కర్‌ మాట్లాడుతూ గతేడాదితో పోల్చితే జిల్లాలో ఈసారి ఒకటి రెండు తరగతుల్లో విద్యార్థులు తగ్గారని, మిగిలిన తరగతుల్లో మాత్రం పెరిగారన్నారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts