logo

నిర్వహణ లేదు.. నీరందదు

కాలువల గుండా సాగర్‌ నీరు వస్తుందన్న సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ప్రభుత్వం నిర్వహణను గాలికొదిలేయడం, సిబ్బందిని నియమించకపోవడంతో ఆయకట్టు చివరి భూములకు నీరందక రైతులు తీవ్ర

Updated : 29 Sep 2022 05:36 IST

అధ్వానంగా సాగర్‌ కాలువలు.. వేలాది రైతుల అవస్థ

ముడివేముల మేజర్‌ కాలువలో ఎటుచూసినా పిచ్చి మొక్కలే

కాలువల గుండా సాగర్‌ నీరు వస్తుందన్న సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ప్రభుత్వం నిర్వహణను గాలికొదిలేయడం, సిబ్బందిని నియమించకపోవడంతో ఆయకట్టు చివరి భూములకు నీరందక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. త్రిపురాంతకం ఎన్నెస్పీ సబ్‌ డివిజన్‌లోని 12 మేజర్‌ కాలువల పరిస్థితి ఇది.

- న్యూస్‌టుడే, త్రిపురాంతకం గ్రామీణం

జిల్లాలో 14 మండలాల్లోని 2.55 లక్షల ఎకరాలకు సాగర్‌ నీరే ఆధారం. గత నాలుగేళ్లుగా ప్రధాన కాలువల నిర్వహణను పట్టించుకోలేదు. దీంతో వాటి నిండా పిచ్చి మొక్కలు పెరిగి ప్రవాహానికి అడ్డుగా ఉన్నాయి. ఫలితంగా తక్కువ నీటిని విడుదల చేస్తే ఎగువ రైతులకే సరిపోతుంది. కేటాయింపు ప్రకారం అందిస్తే అడుగడుగునా పిచ్చి కంప అడ్డుగా ఉండి ముందుకు పారక కరకట్టల మీదకు వచ్చేస్తుంది. ఫలితంగా ఎప్పుడు ఎక్కడ గండ్లు పడతాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తగినంత సిబ్బంది లేక 

చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందాలంటే లస్కర్ల వ్యవస్థ ప్రధానం. పిచ్చి మొక్కలతో పాటు సరఫరాకు అడ్డుగా ఉన్న చెత్తా చెదారాన్ని వీరు తొలగిస్తుంటారు. త్రిపురాంతకం ఎన్నెస్పీ సబ్‌డివిజన్‌ వరకు చూస్తే 12 మేజరు కాలువలు, మైనర్‌, పిల్ల కాలువల నిర్వహణకు గతంలో దాదాపు 25 మంది లస్కర్లు ఉండేవారు. పదవీ విరమణ చేసినవారి స్థానంలో మళ్లీ నియామకాలు లేవు. ముగ్గురు వర్క్‌ ఇనస్పెక్టర్లు, ముగ్గురు లస్కర్లు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. వీరి కొరతకు తోడు ప్రభుత్వం నిధులూ మంజూరు చేయలేదు.

కాలువ కట్ట మీద నడిచేందుకు వీల్లేని విధంగా పిచ్చి మొక్కలు

కరకట్టల మీదుగా 

ముడివేముల మేజర్‌ కాలువ 11 కి.మీ ఉండగా దాని పరిధిలో గణపవరం, త్రిపురాంతకం, మేడపి, నాసర్‌రెడ్డి నగర్‌, ఒడ్డుపాలెం, ముడివేముల, పాపన్నపాలెం, గుట్లపల్లి రైతులకు చెందిన 10 వేల ఎకరాల పొలాలు ఉన్నాయి. వేసవిలో ఎన్‌ఆర్జీఎస్‌ పథకం ద్వారా కూలీలతో నరికించిన కంపను కాలువలో అలాగే వదిలేశారు. దీంతో పూడిక ఏర్పడి నీరు దిగువకు వెళ్లడంలేదు. కేటాయింపు ప్రకారం ఈ కాలువ ద్వారా నీటిని విడిచిపెట్టగా బుధవారం కరకట్టల మీదుగా ప్రవహించడంతో రైతులు ఎన్నెస్పీ సిబ్బందికి సమాచారమందించారు. అనంతరం వారు సరఫరాను తగ్గించడంతో ఊపిరి పీల్చుకున్నారు. డీఈఈ ఆంజనేయ ప్రసాద్‌ మాట్లాడుతూ రైతుల సహకారంతో రెండు రోజుల్లో పిచ్చి కంపను తొలగించి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.్చ

ఎంతో అసౌకర్యం 

రైతు కె.సూర్యనారాయణ మాట్లాడుతూ ‘‘ముడివేముల మేజర్‌ కాలువ పరిధిలో నాకు ఐదెకరాల పొలం ఉంది. ఏటా వరి వేస్తుండగా ఈసారి మెట్ట పంట వేయాలని తూమును మూసివేశాం. నాలుగేళ్ల నుంచి కాలువల్లో పెరిగిన పిచ్చి మొక్కలు తొలగించకపోవడంతో కొద్దిపాటి నీరు వచ్చినా ముందుకు వెళ్లడం లేదు. ఎప్పుడూ అద్దంలా ఉండే కరకట్ట దారి మూసుకుపోయింది. నడక కూడా సాగించలేం. కాలువ అత్యంత నిడివి ఉండటంతో నీటి కోసం ఎగువ వరకు వెళ్లాలంటే అసౌకర్యంగా ఉంది.’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని