logo

Chinta Mohan: జగనన్న ఉత్సవాలా.. శ్రీవారి బ్రహ్మోత్సవాలా?: చింతా మోహన్‌

తిరుమలలో వేంకటేశ్వరస్వామి చిత్రమే కనిపించకుండా వేల సంఖ్యలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీలతో నింపేశారని, అక్కడ జరుగుతున్నవి శ్రీవారి

Updated : 29 Sep 2022 07:38 IST

కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌ విమర్శ

మాట్లాడుతున్న చింతా మోహన్‌.. చిత్రంలో కాంగ్రెస్‌ నాయకులు

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: తిరుమలలో వేంకటేశ్వరస్వామి చిత్రమే కనిపించకుండా వేల సంఖ్యలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీలతో నింపేశారని, అక్కడ జరుగుతున్నవి శ్రీవారి బ్రహ్మోత్సవాలా..జగనన్న ఉత్సవాలా? అనేది తెలియని దుస్థితి నెలకొందని కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్‌ విమర్శించారు. బుధవారం ఒంగోలు ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయన్నారు. ఒకవైపు రోజుకు రూ.100 సంపాదించలేనివారు ఉంటే, అదే రోజుకు రూ.వెయ్యి కోట్లు సంపాదించే అదానీ వంటివారు ఉన్నారన్నారు. కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న ఎన్డీయే ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనలో కేవలం ఎనిమిది చిరుత పులులను సాధించిందని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని 5 కోట్ల మందిలో కోటి మంది కూడా సంతృప్తికరంగా భోజనం చేయలేని పరిస్థితి ఉందన్నారు. మూడున్నరేళ్ల వైకాపా పాలనలో విద్యాప్రమాణాలు పడిపోయాయని విమర్శించారు. జగనన్న కానుకల పేరుతో ఉపాధ్యాయులను తల్లిదండ్రుల వద్దకు పంపి రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని.. పాఠశాలల్లో బోధన జరగక విద్య పూర్తిగా కుంటుపడిందన్నారు.. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు లేక నర్సులే వైద్యం చేస్తున్నారని.. సూది, దూది, మందులు లేవన్నారు. అనేక ప్రాజెక్టులు నిర్వీర్యం అయిపోయాయని.. ఒక్కటి కూడా నూతనంగా ప్రారంభించలేదన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడాన్ని ఖండించారు. రాజధాని, విశాఖ ఉక్కు, పోలవరం వంటి రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడే శక్తి జగన్‌మోహన్‌రెడ్డికి లేదన్నారు. ‌్ర కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘భారత్‌ జోడో యాత్ర’ అక్టోబరు 20, 21, 22, 23 తేదీల్లో కర్నూలు జిల్లాలో ఉంటుందన్నారు. ప్రజాహితవాదులందరినీ సంఘటితం చేసి యాత్రకు ఆహ్వానిస్తామన్నారు. 2024లో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని