logo

విచారణకూ వాయిదాలెందుకు!

దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాత సింగరాయకొండ నరసింహ స్వామి దేవాలయంలో నిధుల గోల్‌మాల్‌పై విచారణ చేయడంలోనూ అధికారులు తాత్సారం చూపుతున్నారు. గత మంగళవారం(సెప్టెంబర్‌

Updated : 29 Sep 2022 05:37 IST

నరసింహ స్వామి ఆలయ నిధులు కాజేసిన అధికారి

సింగరాయకొండ గ్రామీణం, న్యూస్‌టుడే: దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన పాత సింగరాయకొండ నరసింహ స్వామి దేవాలయంలో నిధుల గోల్‌మాల్‌పై విచారణ చేయడంలోనూ అధికారులు తాత్సారం చూపుతున్నారు. గత మంగళవారం(సెప్టెంబర్‌ 27) జరగాల్సిన విచారణకు నోటీసులు అందుకున్న 27 మందికి కేవలం ఆరుగురే హాజరవ్వడం, విచారణ చేయాల్సిన అధికారే గైర్హాజరవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ఏం జరిగిందంటే...: నరసింహ స్వామి దేవాలయంలో గత జూన్‌ నెల 9 నుండి 19వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. అప్పుడు ఇక్కడ పనిచేసిన కార్యనిర్వహణాధికారి పరిమితికి మించి నిధులు ఖర్చు చేసి దస్త్రాల్లో నమోదు చేయకుండా సుమారు రూ.15 లక్షలు పైగా స్వాహా చేసినట్లు గత నెల 27వ తేదీన జరిగిన విచారణలో అధికారులు తేల్చారు. ఉత్సవాలకు రూ.7 లక్షలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉండగా, ఉన్నతాధికారుల అనుమతులు తీసుకోకుండా అధికమొత్తంలో ఖర్చు పెట్టినట్లు బయటపడింది. సదరు ఈవోతోపాటు బ్రహ్మోత్సవాల్లో పనులు చేసినట్లు చెక్కులు తీసుకున్న 27 మంది, ఆలయ సిబ్బందికి ఈ నెల 27వ తేదీన విచారణకు హాజరు కావాలని ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే మంగళవారం వారిలో ఆరుగురు మాత్రమే వచ్చారు. ఒంగోలు నుంచి వచ్చి విచారణ చేయాల్సిన అధికారి కూడా రాకపోవడంతో వచ్చిన వారు వెనుదిరిగారు. స్వామి వారి నిధులు కాజేసినప్పుడు నిర్లిప్తంగా ఉండి, విచారణలోనూ అధికారులు తాత్సారం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ముడుపులు అందాయని ఆరోపణలు...: నిధుల గోల్‌మాల్‌పై కొంతమంది అధికారులకు ముడుపులు అందాయని, అందుకే జమా ఖర్చుల విచారణకు అధికారులు ముఖం చాటేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆలయ సిబ్బందికి దేవాదాయ శాఖ నుంచి సుమారు రూ.10 లక్షలు వరకు వేతన బకాయిలు రావాల్సి ఉన్నాయి. నేటికీ స్వామి వారికి నైవేద్యం సమర్పించేందుకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. అన్నదానం కోసం దాతలు అందజేస్తున్న విరాళాలు సైతం కొందరి సొంత ఖాతాలకు వెళుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఒంగోలు నుంచి నిధుల గోల్‌మాల్‌ విచారణకు రావాల్సిన అధికారి వివరణ కోరేందుకు ‘న్యూస్‌టుడే’ చరవాణి ద్వారా ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని