logo

పండగ వేళ పప్పు, పంచదార లేదు!

గత నెల వినాయక చవితి, వచ్చే నెలలో దసరా, దీపావళి... ఇలా వరుస పండగల వేళ పౌరసరఫరాల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన కందిపప్పు, పంచదార సరఫరా నిలిచిపోయింది. బయట

Updated : 29 Sep 2022 05:38 IST

గత నెల ఇవ్వలేదు... వచ్చే నెల రేషన్‌లోనూ అనుమానమే

ఒంగోలు గిడ్డంగి నుంచి రేషన్‌ దుకాణాలకు తరలించేందుకు ట్రాక్టర్‌కు బియ్యం ఎత్తుతున్న హమాలీలు

గత నెల వినాయక చవితి, వచ్చే నెలలో దసరా, దీపావళి... ఇలా వరుస పండగల వేళ పౌరసరఫరాల దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన కందిపప్పు, పంచదార సరఫరా నిలిచిపోయింది. బయట మార్కెట్‌లో వాటి ధరలు మండుతుండడంతో... పేదలకు పండగ సంతోషం దూరమవుతోంది. గత ఎనిమిది నెలలుగా వీటి సరఫరా సక్రమంగా లేకపోవడం గమనార్హం. ఇప్పటికే సరకులపై ఇచ్చే రాయితీ తగ్గించారు. ప్రస్తుతం పూర్తిగా సరకులే ఇవ్వకుండా కోత పెడుతుండడంపై కార్డుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత బియ్యం పంపిణీలోనూ చాలా కుటుంబాలకు కోత విధించారు.

న్యూస్‌టుడే - ఒంగోలు గ్రామీణం

జిల్లాల పునర్విభజన తరువాత ప్రకాశం జిల్లాలో 6,55,525 బియ్యం కార్డులు ఉన్నాయి. ఆయా కుటుంబాలకు ప్రతి నెలా అర కిలో చక్కెర, కిలో కందిపప్పుతో పాటు... మనిషికి అయిదు కిలోల చొప్పున బియ్యాన్ని రాయితీపై ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. పౌర సరఫరాల శాఖ అధికారుల అంచనా ప్రకారం ప్రతి నెలా కార్డుదారులకు సరఫరా చేసేందుకు 655 టన్నుల కందిపప్పు, 344 టన్నుల పంచదార అవసరం. గత నెలలో ఈ సరకులు ఇవ్వలేదు. వచ్చే నెలకు సంబంధించి పంపిణీ సమయం సమీపిస్తున్నా... నేటికీ ఆయా సరకులు జిల్లాకు చేరలేదు. వీటి పంపిణీపై పౌరసరఫరాల శాఖ అధికారులకే సరైన సమాచారం లేకపోవడం గమనార్హం. ఇప్పటికే ఆయా గోదాముల నుంచి జిల్లాలోని సగం చౌక దుకాణాలకు బియ్యం సరఫరా పూర్తయింది. దీంతో దసరా వేళ బియ్యంతోనే సరిపెడతారన్న ప్రచారం జరుగుతోంది.

ఎనిమిది నెలలుగా ఇదే తీరు...
గత ఎనిమిది నెలలుగా కందిపప్పు, పంచదార పంపిణీ అరకొరగానే ఉంటోంది. వీటిలో ఏదో ఒకటే ఇస్తున్నారని... అది కూడా అందరికీ ఇవ్వడం లేదని కార్డుదారులు చెబతున్నారు. ప్రస్తుత పండగల సమయంలో ఆ కొద్దిపాటి భాగ్యమూ కరవైంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో నాణ్యతను బట్టి కందిపప్పు కిలో రూ.115 నుంచి రూ.120 వరకు ధర పలుకుతోంది. చౌక దుకాణాల ద్వారా కిలో రూ.67కే ఇచ్చేవారు. అరకిలో పంచదార రూ.17కు వచ్చేది. మామూలు సమయాల్లో పరిస్థితి ఎలా ఉన్నా... పండగ వేళ ఇవి అందకపోవడంతో తప్పనిసరిగా బయట కొనుగోలు చేయాల్సి వస్తోందని పేదలు వాపోతున్నారు. గత ఏడాది కూడా నవంబరు నెలలో పంచదార పూర్తిగా ఇవ్వలేదు. అక్టోబర్‌, డిసెంబర్‌ నెలల్లో సగం మందికే పంపిణీ చేశారు. ఈ విషయమై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్యామ్‌కుమార్‌ను సంప్రదించగా... గత నెలలో కందిపప్పు, పంచదార రాకపోవడంతో ఇవ్వలేకపోయామన్నారు. ఈ నెలలోనూ పైనుంచే సరకులు రాలేదని... రాగానే దుకాణాలకు సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

* బయటి మార్కెట్లో కందిపప్పు ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటున్నాయి. వాటి సరఫరా నిమిత్తం రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోనే మూడు నెలలకోసారి టెండర్లు పిలుస్తున్నట్లు సమాచారం. నిధుల కొరత కారణంగా గుత్తేదారులకు బిల్లులు చెల్లింపులో జాప్యం చోటుచేసుకోవడంతో... వారు ముఖం చాటేస్తున్నట్లు ఆ శాఖలోనే ప్రచారం జరుగుతోంది. ఆ కారణంగానే సరకులు రావడం లేదని చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని