logo

పన్నులు పెంచారు... వసతులు మరిచారు!

ఒంగోలు మున్సిపాలిటీని నగర పాలక సంస్థగా మార్చే క్రమంలో సమీపంలోని ఎనిమిది పంచాయతీలను దశాబ్దం క్రితం విలీనం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా... పంచాయతీలుగా ఉన్న సమయంలో నిర్మించిన రహదారులు, కాలువలు, నీటి సరఫరానే తప్ప... కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో వసతుల కల్పనకు ప్రత్యేకంగా తీసుకున్న చర్యలేవీ లేవు.

Published : 30 Sep 2022 06:39 IST

పదేళ్లుగా అల్లాడుతున్న విలీన గ్రామాల ప్రజలు

న్యూస్‌టుడే - ఒంగోలు అర్బన్‌, ఒంగోలు గ్రామీణం

డంపింగ్‌ యార్డులా మారిన పేర్నమిట్ట చెరువు

ఒంగోలు మున్సిపాలిటీని నగర పాలక సంస్థగా మార్చే క్రమంలో సమీపంలోని ఎనిమిది పంచాయతీలను దశాబ్దం క్రితం విలీనం చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా... పంచాయతీలుగా ఉన్న సమయంలో నిర్మించిన రహదారులు, కాలువలు, నీటి సరఫరానే తప్ప... కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో వసతుల కల్పనకు ప్రత్యేకంగా తీసుకున్న చర్యలేవీ లేవు. మరోవైపు... పన్నుల భారం మాత్రం భారీగా పెరిగిందని ఆయా గ్రామాల వారు వాపోతున్నారు. నగరంలో కలపడం వల్ల ఉపాధి హామీ ద్వారా అభివృద్ధి చేసుకునేందుకూ అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కానరాని పక్కా కాలువలు...

మద్యం గోదాముకు వెళ్లే మార్గంలో నిత్యం ఇదే పరిస్థితి

విలీన పంచాయతీల్లో కొత్తగా పక్కా కాలువలు నిర్మించిన దాఖలాలు లేవు. పైపెచ్చు ఉన్న వాటి నిర్వహణా సరిగా లేక శిథిలావస్థకు చేరుతున్నాయి. శివారు గ్రామాల్లో చాలా వరకు కచ్చా కాలువలే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో మురుగు పేరుకుపోయి కుంటలను తలపిస్తోంది. వర్షం పడితే పరిస్థితి మరి చెప్పనవసరం లేదు. పేర్నమిట్టలో కర్నూలు రోడ్డు వెంబడి కాలువలు పూడిపోయి... అటు మద్యం గోదాముకు వెళ్లే ప్రాంతం, ఇటు పోలేరమ్మ ఆలయ సమీపంలో నిత్యం మురుగు నిలిచిపోతోంది. క్రిస్టియన్‌పాలెం, పీర్లమాన్యం తదితర ప్రాంతాల గురించి చెప్పనవసరం లేదు. చెరువుకొమ్ముపాలెం, కొప్పోలు, ముక్తినూతలపాడు, పెళ్లూరు, త్రోవగుంటలో కాలువల నిర్మాణం అరకొరగానే ఉంది. పూడికతీత పనులూ సరిగా సాగడం  లేదు. దీంతో దోమల సమస్యా పెరిగి... నివాసితులు తీవ్ర ఇబ్బందులు  పడుతున్నారు.


అంతర్గత దారుల ఊసేదీ...

పేర్నమిట్టలో అంతర్గత రహదారి దుస్థితి

ప్రస్తుతం ఏ పల్లెకు వెళ్లినా సిమెంట్‌ రహదారులే కనిపిస్తాయి. గతంలో ఉపాధి హామీ నిధులతో పెద్ద ఎత్తున వీటి నిర్మాణం చేపట్టారు. నగర పాలక సంస్థలో భాగంగా ఉన్న విలీన పంచాయతీల్లో మాత్రం ఒక్క దారీ సరిగా లేదు. ఈ దశాబ్దకాలంలో కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో వేసిన రోడ్లును వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. మరోవైపు నగరం విస్తరిస్తున్న క్రమంలో కొప్పోలు, పెళ్లూరు, వెంగముక్కపాలెం, పేర్నమిట్ట పరిధిలో పెద్ద ఎత్తున బహుళ అంతస్తుల భవనాలు, నూతన కాలనీలు వెలుస్తున్నాయి. పంచాయతీల హయాంలో వేసిన రహదారులే నేటికీ ప్రధాన ఆధారంగా ఉన్నాయి. వాటిని కూడా చాలాచోట్ల పైపులైను, ఇతరత్రా పనుల నిమిత్తం ధ్వంసం చేశారు. పేర్నమిట్ట ప్రధాన గ్రామంలోని దాదాపు అన్ని వీధి మార్గాలూ నిలువుగా చీలి, నిండా గోతులతో దర్శనమిస్తున్నాయి. అయినప్పటకీ కనీస మరమ్మతులు లేవు.

* ఒంగోలు నుంచి ముక్తినూతలపాడు, గుడిమెళ్లపాడు వెళ్లే రహదారి పనులకు గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. ప్రభుత్వం మారాక ఆ పనులు రద్దయ్యాయి. తరువాత పట్టించుకున్న దాఖలాలు లేవు. శిథిల దారిలో వాహన చోదకులు అవస్థల పయనం సాగిస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులైనా చేపట్టాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.


తాగు నీరు కొనుగోలు చేయాల్సిందే

పంచాయతీలుగా ఉన్న సమయంలో కొనసాగుతున్న నీటి సరఫరానే నేటికీ విలీన గ్రామాల్లో కొనసాగుతోంది. కొత్తగా పైపులైన్లు వేసి మెరుగుపరిచిందేమీ లేదు. చెరువులకు సాగర్‌ నీరు పెడుతున్నా ఫిల్టర్‌ బెడ్‌లు లేక... శుద్ధి చేయకుండా నేరుగా ఆ నీటినే విడుదల చేస్తున్నారు. పేర్నమిట్ట పరిస్థితి మరీ దారుణం. ఈ పరిధిలో ముప్పై వేలకు పైగా జనాభా ఉన్నా... నేటికీ సాగర్‌ జలాలు అందడం లేదు. చెరువు పక్కన బోర్లు వేసి ఆ నీటినే ట్యాంకు ద్వారా పంపిణీ చేస్తున్నారు. అదీ మూడు రోజులకు ఓసారి ఇస్తున్నారు. పైపులైన్లు లేక శివారు కాలనీలకు ఆ భాగ్యమూ లేదు. ముక్తినూతలపాడులో అమృత్‌ పథకం కింద ట్యాంకు నిర్మించినా పైపులైను కనెక్షన్‌ ఇవ్వక నిరుపయోగంగా మారింది. చెరువుకొమ్ముపాలెంలో ట్యాంకు నిర్మించినా నీటి వనరుల లభ్యత లేదు. దాదాపుగా విలీన గ్రామాల ప్రజలంతా డబ్బా నీటిని కొనుగోలు చేసి తాగునీటి అవసరాలను తీర్చుకుంటున్నారు.

* ఒంగోలు మండలంలోని కొప్పోలు, పెళ్లూరు, త్రోవగుంట, ఎన్‌.అగ్రహారం, ముక్తినూతలపాడు, చెరువుకొమ్ముపాలెం, వెంగముక్కపాలెం; సంతనూతలపాడు మండలంలోని పేర్నమిట్ట పంచాయతీలను... 2012లో నగరపాలక సంస్థలో విలీనం చేశారు. దశాబ్దం గడిచినా... నేటికీ ఈ ప్రాంతాల్లో కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో చెప్పుకోదగిన పనేదీ చేయకపోవడం గమనార్హం.

* విలీన పంచాయతీల్లో పెద్ద విస్తీర్ణం కలిగిన చెరువులు ఉన్నా... వాటి అభివృద్ధి దిశగా కనీస ఆలోచన చేయడం లేదు. నగరంలో భాగం కావడంతో ఉపాధి హామీ పథకం పనులకూ అవకాశం లేకుండా పోయింది. పేర్నమిట్టలోని 190 ఎకరాల చెరువును ఎస్‌ఎస్‌ ట్యాంకుగా అభివృద్ధి చేస్తే ఒంగోలు నగర అవసరాలను పూర్తిగా తీర్చే అవకాశం ఉన్నా కార్యాచరణ కొరవడింది. ప్రస్తుతం ఇందులో నిర్మాణ, గ్రానైట్‌ వ్యర్థాలు పారబోస్తుండడంతో డంపింగ్‌యార్డులా మారింది.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని