logo

మాయమైన పరివర్తకాల లెక్క తేలుస్తాం

విద్యుత్తు పరివర్తకాల పంపిణీలో అవకతవకలకు పాల్పడిన వారితోనే... వాటిని తిరిగి తెప్పించి లెక్క తేలుస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. మేడపి విద్యుత్తు ఉప కేంద్రంలో గురువారం నిర్వహించిన పరివర్తకాల మేళాలో ఆయన మాట్లాడారు.

Published : 30 Sep 2022 06:39 IST

మంత్రి సురేష్‌

పరివర్తకాల లోడుతో ఉన్న ట్రాక్టర్‌ను నడుపుతున్న మంత్రి సురేష్‌, చిత్రంలో విద్యుత్తు ఎస్‌ఈ సత్యనారాయణ తదితరులు

త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే: విద్యుత్తు పరివర్తకాల పంపిణీలో అవకతవకలకు పాల్పడిన వారితోనే... వాటిని తిరిగి తెప్పించి లెక్క తేలుస్తామని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. మేడపి విద్యుత్తు ఉప కేంద్రంలో గురువారం నిర్వహించిన పరివర్తకాల మేళాలో ఆయన మాట్లాడారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు గుంజడం హేయమని అన్నారు. పక్కదారి పట్టిన పరివర్తకాలను తిరిగి రైతులకు ఇప్పిస్తామని... అవసరమైతే బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని తెలిపారు. కాలిపోయిన పరివర్తకాలను రైతులే సొంత ఖర్చుతో కేంద్రానికి తీసుకువెళ్లి మరమ్మతులు చేయించుకోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మొత్తం 39 ఉప కేంద్రాలు ఉన్నాయని... లో వోల్టేజీ సమస్యను అధిగమించేందుకు మరో ఆరు కేంద్రాలను అక్టోబరులో నిర్మించనున్నట్లు చెప్పారు. డిస్కమ్‌లు నష్టాల్లో ఉన్నా... ప్రభుత్వం రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తోందన్నారు. అయినప్పటికీ ప్రతిపక్షం అనవసర విమర్శలు చేస్తోందన్నారు. ఎస్‌ఈ కేవీజీ సత్యనారాయణ మాట్లాడుతూ... త్రిపురాంతకం మండలంలో పరివర్తకాల మంజూరులో అవకతవకలు చోటుచేసుకున్న మాట వాస్తవమేనన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21 వరకు డీడీలు తీసిన రైతులకు 169 పరివర్తకాలు అందించే ఉద్దేశంతో మేళా నిర్వహించినట్లు చెప్పారు. 29 పరివర్తకాల లెక్క తేలడం లేదని... వాటిని కూడా మూడు నెలల్లో అందిస్తామన్నారు. మంజూరైనా రైతులకు అందకపోతే ఫిర్యాదు చేయాలన్నారు. పరిశీలించి న్యాయయం చేస్తామన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ రైతులకు పంపిణీ చేసిన పరివర్తకాల లోడ్‌ ట్రాక్టర్‌ను కొద్దిసేపు నడిపారు. ఎంపీపీ కోట్ల సుబ్బారెడ్డి, మార్కాపురం డీఈఈ నాగేశ్వరావు, ఏడీఈ రాఘవేంద్రరావు, మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ ఉడుముల శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు మాకం జాన్‌పాల్‌, వైకాపా మండల కన్వీనర్‌ పోలిరెడ్డి, బీసీ కమిటీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్వీ పిచ్చయ్య, ఏఈఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని