logo

సోదరుడి కుమారుడినంటూ మోసానికి యత్నం

సోదరుడి కుమారుడిని అంటూ ఫోన్‌ చేసిన ఆగంతుకుడు... ఓ పారిశ్రామికవేత్త నుంచి డబ్బు కాజేసేందుకు ప్రయత్నించాడు. చివరి నిమిషంలో విషయం గుర్తించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రోత్‌సెంటర్‌లో కర్మాగారం నిర్వహిస్తున్న మండవ రత్నాకరరావుకు...

Updated : 30 Sep 2022 06:54 IST

చివరి నిమిషంలో గుర్తించి పోలీసులకు ఫిర్యాదు

మద్దిపాడు, న్యూస్‌టుడే: సోదరుడి కుమారుడిని అంటూ ఫోన్‌ చేసిన ఆగంతుకుడు... ఓ పారిశ్రామికవేత్త నుంచి డబ్బు కాజేసేందుకు ప్రయత్నించాడు. చివరి నిమిషంలో విషయం గుర్తించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రోత్‌సెంటర్‌లో కర్మాగారం నిర్వహిస్తున్న మండవ రత్నాకరరావుకు... ఈ నెల 27న మధ్యాహ్నం ఫోన్‌ వచ్చింది. అవతలి వ్యక్తి గొంతు మార్చి... ఆయన సోదరుడి కుమారుడిలా మాట్లాడాడు. చిన్న సమస్య ఉంది... రూ.60 వేలు కావాలని అడిగాడు. వెంటనే ఫోన్‌పే చేయాలని కోరాడు. సోదరుడి కుమారుడిగానే భావించిన రత్నాకరరావు... ప్రస్తుతం తన వద్ద అంత మొత్తం లేదని, ఇంటికి వెళ్లి తీసుకోవాలని చెప్పారు. తాను ప్రస్తుతం విజయవాడలో ఉన్నానని, ఖాతాలో జమ చేయాలని చెప్పి ఓ నంబరు పంపించాడు. అది వేరేవారి ఖాతా కావడంతో... ఇది ఎవరిదని అడిగారు. అది తన స్నేహితుడిదని చెబుతూ అవతలి వ్యక్తి తడబడడంతో... రత్నాకరరావు అనుమానించారు. వెంటనే తన సోదరుడి ఇంటికి ఫోన్‌ చేయగా... వారి కుమారుడు బెంగళూరులో ఉన్నట్లు చెప్పారు. ఫోన్‌ చేసింది కూడా ఆయన కాదని తేలింది. ఇంతలో ఆగంతుకుడి నుంచి మళ్లీ ఫోన్‌ వచ్చింది. నా స్నేహితుడు దుబాయ్‌ నుంచి బంగారం తెచ్చాడని... తక్కువ ధరకే ఇస్తాం, తీసుకుంటారా అని అడిగాడు. తన దగ్గరకు వస్తే తీసుకుంటానని చెప్పగా... మీరే రూ.5 లక్షలు తీసుకుని రావాలని చెప్పాడు. ఇంతకీ నువ్వు ఎవరివని రత్నాకరరావు గట్టిగా నిలదీయడంతో ఫోన్‌ స్విచాఫ్‌ చేశాడు. ఇచ్చిన బ్యాంకు ఖాతా నంబరు ఆధారంగా ఆరా తీయగా... మేదరమెట్లకు చెందిన వ్యక్తిగా తేలింది. ఇదే తరహాలో ఓ వ్యక్తి నుంచి రూ.లక్షకు పైగా నగదు కాజేసినట్లు తేలింది. ఘటనపై మద్దిపాడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని