logo

కబ్జా చెరలో కొండ భూములు

కాదేదీ కబ్జాకు అనర్హమన్న రీతిలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఏకంగా రూ.15 కోట్ల విలువైన భూములను గుప్పెట్లో పెట్టుకున్నా యంత్రాంగం అటు కన్నెత్తి చూడటంలేదు. కొనకనమిట్ల మండలం వాగుమడుగు పంచాయతీ రేగడపల్లి, అంభాపురం, గనివినపాడు రెవెన్యూ పరిధిలో పెద్దఎత్తున కొండ భూములున్నాయి.

Published : 02 Oct 2022 04:37 IST

687 ఎకరాల్లో తిష్ఠ వేసిన అక్రమార్కులు

కొనకనమిట్ల, న్యూస్‌టుడే:

గనివినపాడు కొండ భూములను ఆక్రమించి వేసిన పత్తి పంట

కాదేదీ కబ్జాకు అనర్హమన్న రీతిలో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. ఏకంగా రూ.15 కోట్ల విలువైన భూములను గుప్పెట్లో పెట్టుకున్నా యంత్రాంగం అటు కన్నెత్తి చూడటంలేదు. కొనకనమిట్ల మండలం వాగుమడుగు పంచాయతీ రేగడపల్లి, అంభాపురం, గనివినపాడు రెవెన్యూ పరిధిలో పెద్దఎత్తున కొండ భూములున్నాయి. ఇవి దొనకొండ పరిశ్రమ కారిడార్‌కు సుమారు 8 కి.మీ దూరంలో ఉండటంతో విలువ పెరిగింది. అంభాపురం సర్వే నంబరు-1లో 573 ఎకరాలు ఉండగా అందులో సుమారు 200 ఎకరాలు, వాగుమడుగు సర్వే నం.2లో 626 ఎకరాలు ఉండగా 300 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. గనివినపాడు సర్వే నం. 61, 69, 79, 86లో ఉన్న 187 ఎకరాలను కొందరు దశలవారీగా ఆక్రమించి పంటలు సాగు చేశారు. గతేడాది కంది, పత్తి పంట వేయగా ఈ సారి ఖరీఫ్‌లో కంది, పత్తి వేయడం గమనార్హం. రీ సర్వేతో వీటికీ పాసు పుస్తకాలు   సృష్టించి సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో  స్థానిక కాపరులు తమ పశువులు, మూగ జీవాలను మేత కోసం ఈ భూముల వద్దకు తీసుకుకెళ్లేవారు. ప్రస్తుతం వీరు అటువైపు రాకుండా ఆక్రమార్కులు అడ్డుకుంటున్నారు.

జాతీయ రహదారికి సమీపంలోనే..: వర్షాలు కురిసినప్పుడు ఈ కొండల్లోంచి సమీప కుంటల్లోకి నీరు చేరేది. ఇవన్నీ ఆక్రమణల్లో ఉండటంతో ప్రస్తుతం ఆ అవకాశం లేకుండాపోయింది. రెవెన్యూ అధికారులు నిత్యం రాకపోకలు సాగించే జాతీయ రహదారికి కూతవేటు దూరంలో ఈ భూములున్నాయి.  గవినినపాడు పంచాయతీలో కొండ భూముల ఆక్రమణపై పలుమార్లు తహసీల్దార్‌, ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన స్పందనలోనూ వినతులు వెళ్లాయి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని సర్పంచి లక్ష్మి వెంకటేశ్వర్లు కోరారు.


నోటీసులు జారీ చేస్తాం

కొండ భూములు ఆక్రమించి పంటలు సాగు చేస్తున్న వారికి నోటీసులిస్తాం.. సమస్యను ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటాం.      

- ప్రసాదరావు, తహసీల్దార్‌, కొనకనమిట్ల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని