logo

నేర్వని పాఠం... వానొస్తే భయం

జిల్లా కేంద్రం ఒంగోలు శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు గజగజ వణికిపోయింది. భారీ వర్షానికి అన్ని మార్గాలు తటాకాలను తలపించిన విషయం తెలిసిందే. నిత్యం నగరంలో తిరిగేవారు ఈ ప్రవాహాన్ని చూసి ఉలిక్కిపడ్డారు.

Published : 03 Oct 2022 02:21 IST

ఒంగోలులో  చేతులెత్తేస్తున్న వ్యవస్థలు

రూ.252 కోట్ల నిధులొస్తేనే ఊరట

- న్యూస్‌టుడే, ఒంగోలు నగరం

ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో శనివారం నాటి పరిస్థితి ఇది

జిల్లా కేంద్రం ఒంగోలు శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు గజగజ వణికిపోయింది. భారీ వర్షానికి అన్ని మార్గాలు తటాకాలను తలపించిన విషయం తెలిసిందే. నిత్యం నగరంలో తిరిగేవారు ఈ ప్రవాహాన్ని చూసి ఉలిక్కిపడ్డారు. వరద నీటి కాలువల వ్యవస్థ లేకపోవడం..ప్రతిపాదనలున్నా నిధులు రాకపోవడం ఈ నగరానికి శాపంగా మారింది. సమస్యను చక్కదిద్దేందుకు నగర పాలక సంస్థ ఆపసోపాలు పడింది. ఇదే తరహాలో మళ్లీ భారీ వర్షాలొస్తే పరిస్థితి ఏమిటన్నదానికి ఆ సంస్థ వద్ద సమాధానం లేదు.

నగరంలో మురుగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కాగితాలకే పరిమితమైపోయింది. భారీవర్షం కురిసినప్పుడల్లా కాలువలు పొంగి వీధుల్లోకి చేరడం, నెలల తరబడి నిలిచి దోమలు పెరగడం సాధారణమైంది. కార్పొరేషన్‌ పాలకవర్గాలు మారినా పరిస్థితిలో మార్పు లేదు. భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ (యూజీడీ) కోసం గత ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించారు. నగర భౌగోళిక పరిస్థితి దృష్ట్యా అది సాధ్యపడదని ఇంజినీర్లు నివేదిక ఇవ్వడంతో పక్కన పెట్టారు. ఓ వైపు ఒంగోలు క్రమేణా విస్తరిస్తోంది. కొప్పోలు రోడ్డు, క్విస్‌ కళాశాల రోడ్డు వైపు కొత్త కాలనీలు వచ్చాయి. ఇక ఒంగోలులో ఆవాసాల సంఖ్య గత కొన్నాళ్లలో 54 వేల నుంచి 64 వేలకు పెరిగింది.

పాత నగరంలో దెబ్బతిని..

కార్పొరేషన్‌ బడ్జెట్‌లో ఏటా రూ.10 కోట్లు మురుగు కాలువల నిర్మాణానికి కేటాయిస్తున్నారు. అవి కూడా అసలు కాలువలు లేని శివారు కాలనీల్లో చేపడుతున్నారు. దీంతో దీర్ఘకాలంగా ఉన్న అసలు సమస్య తీరడంలేదు. పాత నగరంలో పూర్వం నిర్మించిన కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కర్నూలు రోడ్డులో పదేళ్లక్రితం నిర్మించినవి నీటి పారుదలకు అనువుగా లేవు. కాలువ కన్నా రోడ్డు ఎత్తు పెరిగిపోయింది. చెత్తచెదారం మొత్తం దానిలో చేరిపోతుంది. ఆక్రమణల వల్ల ఏడాదిలో ఒక్కసారి కూడా శుభ్రం చేయడం లేదు. ఫలితంగా ఒక మాదిరి వర్షం కురిసినా రహదారిపై నీరు ప్రవహిస్తోంది. దీనివల్ల ఆర్టీసీ బస్టాండ్‌, కూరగాయల మార్కెట్‌ ప్రాంతంలోనూ నీరు ముందుకు కదలడంలేదు.

దోమల ఉత్పత్తి కేంద్రాలుగా..

కాలువల నిర్మాణ సమయంలో సరైన ప్రణాళిక అమలు చేయడంలేదు. ఎత్తుపల్లాలు చూడకుండా ఇష్టారీతిన చేపడుతున్నారు. దీనివల్ల ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోతుంది. రామనగర్‌, మంగమూరు రోడ్డు, శివాజీనగర్‌, సుజాతనగర్‌ ప్రధాన రహదారిలో ఇదే పరిస్థితి. సమతానగర్‌లో అసలు కాలువల ఉనికే కనిపించదు. పూర్తిగా పూడికపోయాయి. ఖాళీ స్థలాల్లో నీరంతా నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. దీంతో అవి దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారి చుట్టుపక్కల నివాసితులు వ్యాధుల బారిన పడుతున్నారు.

వారికి ప్రత్యామ్నాయం చూపితేనే..

ఒంగోలులో మురుగు, వరద నీటి పారుదల సక్రమంగా ఉండాలంటే పోతురాజు కాలువే పరిష్కార మార్గమన్నది యంత్రాంగం చెప్పే మాట. మొత్తం 7 కి.మీ. పొడవున దీని నిర్మాణం అవసరం. అనేకచోట్ల ఆక్రమించి దాదాపు 300 ఇళ్లు వెలిశాయి. వారికి ప్రత్యామ్నాయం చూపకుండా పనులు చేపట్టలేని పరిస్థితి. రూ.69 కోట్ల ప్రతిపాదిత వ్యయంలో రూ.32 కోట్ల మేర విలువైన పనులు(చెట్ల తొలగింపు, పూడిక తొలగింపు, రివిట్‌మెంట్ల నిర్మాణం) జరిగాయి. 30 శాతం బిల్లులు ఇంకా రాలేదని తెలుస్తోంది. కాలువలో తవ్విన మట్టి దిబ్బలు తొలగించకుండా ఉంచడం వల్ల పరివాహక ప్రాంత కాలనీల్లో నీరు నిలిచిపోతుంది. దీనికితోడు కాలువ పొడవునా ఆక్రమణలు, ప్రధానరహదార్లలో ప్రణాళిక లేకుండా నిర్మించిన భవనాలు, ర్యాంపులు అడ్డంకిగా మారాయి.

తాత్కాలిక మరమ్మతులతో..  

ప్రస్తుత ముంపు సమస్య పరిష్కరించడానికి బిలాల్‌నగర్‌, నెహ్రూనగర్‌, వెంకటేశ్వరకాలని, కొప్పోలు ఎస్సీ కాలనీ, కరవదిడొంక ప్రాంతాల్లో తాత్కాలికంగా పనులు చేపట్టారు. లోతట్టు కాలనీల్లో నీటిని తొలగించడానికి 20 జేసీబీలను ఏర్పాటు చేశారు. కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో చెత్తచెదారం తొలగించి నీరు పోయే ఏర్పాట్లు చేస్తున్నారు.

తాత్కాలిక మరమ్మతు పనులను పరిశీలిస్తున్న కమిషనర్‌


24 శాతం ప్రాంతాలకు అసలు కాలువల వ్యవస్థ లేదు కొప్పోలు, మధర్‌థెరిస్సా కాలనీ, అరవకాలనీ, శ్రీనివాస కాలనీ, కరవది డొంక ప్రాంతాల్లో వరదనీటి కాలువలు నిర్మించాల్సిన అవసరం ఉంది.


నగరంలో పాత కాలువల స్థానంలº కొత్తవాటి నిర్మాణం, అసలు లేనిచోట ఏర్పాటుకు ఇటీవల అంచనాలు వేసి ప్రభుత్వానికి పంపారు. అన్ని పనులకూ కలిపి రూ.252 కోట్ల నిధులు అవసరం. ఇందులో రూ.120 కోట్లు కేవలం కాలువలకే కావాలి. ఇంతవరకు ఉలుకూపలుకూ లేదు.


 

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts