logo

ఏఆర్‌ విభాగంలో బదిలీల రగడ

పోలీసు శాఖలోని ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌(ఏఆర్‌) విభాగంలో బదిలీలు వివాదాస్పదంగా మారాయి. జిల్లాల పునర్విభజన అనంతరం చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలతో ఏర్పాటైన బాపట్ల.. కందుకూరు నియోజకవర్గాన్ని విలీనం చేసుకున్న నెల్లూరు జిల్లాలకు ఆయా నిష్పత్తిని అనుసరించి సిబ్బందిని కేటాయించారు.

Published : 03 Oct 2022 02:21 IST

అన్యాయం జరిగిందంటూ న్యాయస్థానానికి

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే

పోలీసు శాఖలోని ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌(ఏఆర్‌) విభాగంలో బదిలీలు వివాదాస్పదంగా మారాయి. జిల్లాల పునర్విభజన అనంతరం చీరాల, అద్దంకి, పర్చూరు నియోజకవర్గాలతో ఏర్పాటైన బాపట్ల.. కందుకూరు నియోజకవర్గాన్ని విలీనం చేసుకున్న నెల్లూరు జిల్లాలకు ఆయా నిష్పత్తిని అనుసరించి సిబ్బందిని కేటాయించారు. సివిల్‌ విభాగంలోనూ కేటాయింపులు జరిగిన్పటికీ ఆయా స్టేషన్లు వెళ్లిన జిల్లాలకే దాదాపుగా కేటాయించారు. దీంతో పెద్దగా సమస్య ఎదురుకాలేదు. ప్రత్యేకించి ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ విభాగంలో ఈ ప్రక్రియ తేనెతుట్టెను కదిపినట్లయింది. వీరు పూర్తిగా జిల్లాకేంద్రంగానే పనిచేస్తారు. బందోబస్తులు, గార్డు డ్యూటీలు, ఎస్కార్టు విధుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి వస్తుంటారు. ప్రస్తుతం ఒంగోలు కేంద్రంగా ఉన్న డీఆఏర్‌(డిస్ట్రిక్ట్‌ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌) సిబ్బందిని బాపట్ల, నెల్లూరు జిల్లాలకు కేటాయించడంలో జరిగిన అవకతవకలు చర్చకు దారితీశాయి. పోలీసు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరు నిబంధనలు పక్కనబెట్టి ఇష్టారాజ్యంగా జాబితాలు తయారు చేశారనేది కొందరి అభియోగం. నెల్లూరు జిల్లాకు పంపాల్సిన జాబితాను ఒక నెలలో ఏకంగా మూడుసార్లు మార్చివేసి ఉన్నతాధికారులను పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. ఏకపక్షంగా జాబితాలు తయారుచేశారని.. ఉన్నతాధికారులతో మాట్లాడి తమకు న్యాయం చేయాలంటూ కొందరు ఇప్పటికే మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి విన్నవించారు. ఈ విషయంపై వివాదం నడుస్తుండటంతో జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ గత సోమవారం ఏఆర్‌ విభాగానికి చెందిన సిబ్బంది కుటుంబీకులను పిలిపించి మాట్లాడారు. అక్కడ తమ కుటుంబీకుల ఆరోగ్య సమస్యలు, పిల్లల చదువుల వంటి విషయాలను చెప్పిన సిబ్బంది బదిలీలు ఏకపక్షంగా జరిగాయని.. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఇది రాష్ట్ర విధానమని.. ముందు వారికి కేటాయించిన ప్రాంతాల్లో విధుల్లో చేరాలని సూచించారు. దీనికి అంగీకరించని సిబ్బంది కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, మరికొందరు అదేబాటలో ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ఏఆర్‌లో అంతర జిల్లాల బదిలీల ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని