logo

వన్యప్రాణులకు.. వాహన గండం

నల్లమల అటవీ ప్రాంతంలోని రహదారుల్లో వన్యప్రాణులు ఎక్కువగా మృత్యువాతపడుతున్నాయి. వీటి సంరక్షణకు ప్రభుత్వం, అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. కొన్ని ప్రాణులు వేటగాళ్ల చేతితో హతమవుతుంటే..

Updated : 03 Oct 2022 05:01 IST

మృత్యువాత పడుతున్న చుక్కల దుప్పులు

పెద్దదోర్నాల, న్యూస్‌టుడే:  

తుమ్మలబైలు సమీపంలో మృతి చెందిన దుప్పిని పరిశీలిస్తున్న అటవీ అధికారులు (పాతచిత్రం)

నల్లమల అటవీ ప్రాంతంలోని రహదారుల్లో వన్యప్రాణులు ఎక్కువగా మృత్యువాతపడుతున్నాయి. వీటి సంరక్షణకు ప్రభుత్వం, అటవీశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది. కొన్ని ప్రాణులు వేటగాళ్ల చేతితో హతమవుతుంటే..మరికొన్ని  రహదారుల ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి. చోదకులు మితిమీరిన వేగంతో వాహనాలు నడపటంతో నోరు లేని మూగజీవాలు ఢీ కొని మృతి చెందుతున్నాయి. పెద్దదోర్నాల వద్ద ఆదివారం గుర్తుతెలియని వాహనం ఢీ కొని చుక్కల దుప్పి గాయపడి చనిపోయింది. ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్న వేళ ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఏడాదిలో ఇది రెండో సంఘటన. జనవరి 23న తుమ్మలబైలు సమీపంలో జరిగిన ప్రమాదంలో చుక్కల దుప్పి మృతి చెందింది.

ప్రమాదకరంగా శ్రీశైలం ఘాట్ రహదారి

నల్లమల సిగలో ఉన్న శ్రీశైల మల్లన్నను దర్శించుకోవాలంటే రాష్ట్ర నలుమూలల ఉన్న భక్తులు పెద్దదోర్నాల-శ్రీశైలం ఘాట్ రహదారిలో ప్రయాణించాల్సి ఉంది. 45 కి.మీల పొడవు ఉన్న ఈ రహదారిలో ఎతైన కొండలు, లోయలు, మలుపులు ఉన్నాయి. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వాహనాల్లో వస్తుంటారు. చోదకులకు రహదారిపై సరైన అవగాహన లేకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కార్తీకమాసం, దసరా, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వేళల్లో ఈ రహదారిలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. ఆ సమయాల్లో చుక్కల దుప్పులు, నెమళ్లు, చిరుత పిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. ఇదే పరిస్థితి పెద్దదోర్నాల-ఆత్మకూరు రహదారిలో ఉంది. వన్యప్రాణుల సంచారం పరిశీలిస్తూ చోదకులు పరిమిత వేగంతో వాహనాలు నడిపితే ప్రమాదాలను అరికట్టవచ్చు.

ప్రత్యేక పర్యవేక్షణ ఉన్నా...: నల్లమల రహదారిలో ప్రయాణించే వాహనాలపై అటవీశాఖ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ ఉన్నా... ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద వాహనాల నుంచి పర్యావరణ రుసుం వసూలు చేసి మితిమీరిన వేగంతో వెళ్ల వద్దని అటవీ సిబ్బంది చోదకులకు సూచనలు ఇస్తుంటారు. పెద్దదోర్నాల చెక్‌పోస్టు నుంచి శిఖరం చెక్‌పోస్టు వరకు 40 కి.మీల దూరం ఉంది. ఆ దూరాన్ని ఒక గంటలోపు చేరుకుంటే రూ.500 అపరాధ రుసుం వేస్తున్నారు. రహదారి వెంట ఉన్న ప్లాస్టిక్‌, వ్యర్థ పదార్థాలను తొలగించే స్వచ్ఛ సేవకులు వాహనచోదకులకు వేగంగా వెళ్ల వద్దని హెచ్చరిస్తుంటారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రహదారిలో పలు చోట్ల బోర్డులు ఏర్పాటు చేశారు. త్వరలో మూడు స్పీడ్‌ గన్లను తీసుకుని వస్తున్నామని వీటితో వాహనాల వేగాన్ని గుర్తించి మితిమీరిన వేగంతో ప్రయాణిస్తే అపరాధ రుసుం వేయనున్నట్లు దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు తెలిపారు.

Read latest Prakasam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts