logo

వైకాపా, తెదేపాలకు ప్రత్యామ్నాయం మేమే

అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్న అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపాలకు... రాష్ట్రంలో జనసేనతో కలిసి తామే ప్రత్యామ్నాయమని భాజపా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సునీల్‌ దేవధర్‌ పేర్కొన్నారు.

Published : 03 Oct 2022 02:21 IST

భాజపా రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సునీల్‌ దేవధర్‌ వెల్లడి

ప్రజాపోరు యాత్ర ముగింపు సభలో మాట్లాడుతున్న భాజపా జాతీయ కార్యదర్శి సునీల్‌ దేవధర్‌, చిత్రంలో నాయకులు

ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్‌టుడే: అవినీతి, అక్రమాలు, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్న అధికార వైకాపా, ప్రతిపక్ష తెదేపాలకు... రాష్ట్రంలో జనసేనతో కలిసి తామే ప్రత్యామ్నాయమని భాజపా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్‌ఛార్జి సునీల్‌ దేవధర్‌ పేర్కొన్నారు. ప్రజాపోరు యాత్ర ముగింపు సందర్భంగా ఒంగోలులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బాబు వస్తే జాబు వస్తుందన్న నినాదంతో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తన కుమారుడికే జాబ్‌ ఇచ్చారన్నారు. అలాగే నేను ఉన్నాను, నేను విన్నాను.. అంటూ అధికారం చేపట్టిన జగన్‌ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. ఆదాయ వనరులు, పారిశ్రామిక ప్రగతి లేక... రాష్ట్రాన్ని అప్పులకుప్పలా మార్చారని విమర్శించారు. ప్రస్తుతం అప్పులపై ఆధారపడి పాలన సాగిస్తున్నారని... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. భూ, ఇసుక, గ్రానైట్‌, మద్యం, ఎర్రచందనం మాఫియాలు రాజ్యమేలుతున్నాయని ధ్వజమెత్తారు. దేశ రాజధాని దిల్లీలో మద్యం మాఫియాకు సంబంధించి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు బయటపడి, సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తుంటే... ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఎందుకు నోరుమెదపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర పురపాలక శాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ క్రిస్టియన్‌ అయి ఉండి ఎస్సీ కోటాలో ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవిని అనుభవిస్తున్నారని విమర్శించారు. తన అధికారాన్ని వినియోగించుకుని మత మార్పిడులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ కోటా సీట్లలో హిందూ దళితులే పోటీ చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 95 శాతం హిందువుల నుంచి పన్నులు వసూలు చేసి... వాటి నుంచి ఇమామ్‌లు, పాస్టర్లకు వేతనం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కుటుంబపార్టీలకు ప్రత్యామ్నాయం తామేనని పునరుద్ఘాటించారు. కార్యక్రమంలో భాజపా పొలిటికల్‌ ఫీడ్‌బ్యాక్‌ ప్రముఖ్‌ లంకా దినకర్‌, జిల్లా అధ్యక్షుడు శిరసనగండ్ల శ్రీనివాసులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు