logo

అంధుడి పింఛను కాజేసిన వాలంటీరు

ఓ అంధుడికి మంజూరైన పింఛను సొమ్మును 23 నెలలుగా నొక్కేస్తున్నాడు ఓ వాలంటీర్‌. దివ్యాండుడి బంధువైన ఓ మహిళకు అనుమానం వచ్చి సచివాలయంలో ఫిర్యాదు చేయగా విషయం బయటపడింది.

Updated : 03 Oct 2022 04:55 IST

మోసాన్ని గుర్తించిన బంధువు.. నగదు తిరిగి ఇప్పించిన సంఘం ప్రతినిధులు

దివ్యాంగుడు షేక్‌ మస్తాన్‌బాషాకు నగదు అందజేస్తున్న వాలంటీర్ల సంఘం ప్రతినిధులు

పామూరు, న్యూస్‌టుడే: ఓ అంధుడికి మంజూరైన పింఛను సొమ్మును 23 నెలలుగా నొక్కేస్తున్నాడు ఓ వాలంటీర్‌. దివ్యాండుడి బంధువైన ఓ మహిళకు అనుమానం వచ్చి సచివాలయంలో ఫిర్యాదు చేయగా విషయం బయటపడింది. దీంతో వాలంటీర్ల సంఘం నాయకులు కల్పించుకొని బాధితుడికి అప్పటికప్పుడు రూ.69 వేలు ఇప్పించి న్యాయం చేశారు. ఈ సంఘటన పామూరు-3వ సచివాలయం పరిధిలో ఆదివారం వెలుగుచూసింది. స్థానిక కొత్త వాటర్‌ ట్యాంకు వీధిలో నివసిస్తున్న అంధుడు షేక్‌ మస్తాన్‌ బాషాకు 2020 సెప్టెంబరులో ప్రభుత్వం దివ్యాంగ పింఛను మంజూరు చేసింది. అయితే వాలంటీరు పి.వెంకటకృష్ణ మాత్రం పింఛను మంజూరు కాలేదని, దరఖాస్తు చేస్తున్నానంటూ ప్రతి నెలా మస్తాన్‌ బాషాతో వేలిముద్ర వేయించుకుంటూ నగదు తన సొంతానికి వాడుకున్నారు. మస్తాన్‌ బాషా తల్లి షేక్‌ ఖాజాబీకి వృద్ధాప్య పింఛను వస్తోంది. వారి కుటుంబానికి ఈ నగదే ఆధారం. ప్రతి నెలా తల్లి వేలిముద్ర వేయించుకొని నగదు ఇస్తూ, మస్తాన్‌ బాషాకు మాత్రం పింఛను కోసం దరఖాస్తు చేస్తున్నానని, మంజూరైందో లేదో చెక్‌ చేస్తున్నానంటూ 23 నెలలుగా నగదు కాజేశారు. శనివారం వేలిముద్ర వేయించుకోవడానికి వచ్చిన సమయంలో బాధితుడి బంధువైన ఓ మహిళ అక్కడే ఉండి ప్రశ్నించడంతో వాలంటీరు తడబడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అనుమానం వచ్చిన సదరు మహిళ శనివారం సాయంత్రం స్థానిక సచివాలయానికి వెళ్లి అధికారులకు విషయం చెప్పగా 23 నెలల క్రితమే పింఛను మంజూరైన విషయం బయటపడింది. ఎంపీడీవో, ఈవోఆర్డీ ఇతర అధికారులకు ఈ విషయం తెలిసింది. ఆదివారం సంక్షేమ, విద్య సహాయకుడు ఎస్డీ షరీఫ్‌ దివ్యాంగుడి ఇంటికి వెళ్లి ఈ నెల ఇవ్వాల్సిన రూ.3 వేలు పింఛను ఇచ్చారు. వాలంటీరు మోసం చేసిన విషయం బహిర్గతం కావడంతో వాలంటీర్ల సంఘం అధ్యక్షులు షేక్‌ సుభాని, ఎండీ గౌష్‌, సభ్యులు షలీంలు లబ్ధిదారుడు మస్తాన్‌బాషా ఇంటికి వెళ్లి మాట్లాడారు. అనంతరం వాలంటీరు వెంకటకృష్ణతో మాట్లాడి 23 నెలలకు గాను ఇవ్వాల్సిన మొత్తం సొమ్ము రూ.69 వేలను బాధితుడికి వెంటనే ఇప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని