logo

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జిల్లా వాసి

వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థిగా ప్రకాశం జిల్లాకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మీగడ వెంకటేశ్వర రెడ్డి పేరు ఖరారైంది.

Published : 03 Oct 2022 02:21 IST

వెంకటేశ్వర రెడ్డి

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థిగా ప్రకాశం జిల్లాకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు మీగడ వెంకటేశ్వర రెడ్డి పేరు ఖరారైంది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనను బరిలోకి నిలపాలని యూటీఎఫ్‌ ప్రతిపాదించగా... ఎస్‌టీయూతో పాటు వివిధ సంఘాలు మద్దతు తెలిపాయి. వెంకటేశ్వర రెడ్డి స్వగ్రామం కనిగిరి మండలంలోని గుండ్లపాలెం. కనిగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌, చీరాల వీఆర్‌ఎస్‌ అండ్‌ వైఆర్‌ఎన్‌ కళాశాలలో డిగ్రీ, గుంటూరు ఏఎల్‌ కళాశాలలో బీఈడీ పూర్తిచేశారు. 1984లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌గా యర్రారెడ్డిపాలెంలో చేరారు. ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎం, పీఎస్‌ అసిస్టెంట్‌గా తాళ్లూరు, పామూరు, సంతనూతలపాడు, కంచర్లవారిపల్లె, చింతలపాలెం ఉన్నత పాఠశాలల్లో పనిచేసి... నాలుగేళ్ల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శిగా సేవలందించారు. వివిధ సంఘాల మద్దతుతో ఎన్నికల్లో విజయం సాధిస్తానన్న నమ్మకంతో ఉన్నట్లు ‘న్యూస్‌టుడే’తో ఆయన తెలిపారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పట్టభద్రుల ఎన్నికలు మార్చిలో జరగనుండగా... ప్రస్తుతం కొత్త ఓటర్ల నమోదు ప్రారంభమైంది. నవంబర్‌ ఏడో తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. జిల్లాలో సుమారు లక్ష మంది పట్టభద్రులు ఓటు హక్కు కలిగి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని